సంఖ్యాకాండం 23:1-30
23 తర్వాత బిలాము బాలాకుతో, “ఈ స్థలంలో ఏడు బలిపీఠాలు కట్టి,+ నా కోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయి” అన్నాడు.
2 బాలాకు వెంటనే బిలాము చెప్పినట్టు చేశాడు. తర్వాత బాలాకు, బిలాము ఒక్కో బలిపీఠం మీద ఒక ఎద్దును, ఒక పొట్టేలును అర్పించారు.+
3 అప్పుడు బిలాము బాలాకుతో ఇలా అన్నాడు: “నువ్వు ఇక్కడే నీ దహనబలి దగ్గర ఉండు. నేను వెళ్లి, యెహోవా నాకు ప్రత్యక్షమౌతాడేమో చూస్తాను. ఆయన నాకు ఏమి వెల్లడిచేస్తే, అది నీకు చెప్తాను.” తర్వాత అతను ఒక కొండ మీదికి వెళ్లాడు.
4 అప్పుడు దేవుడు బిలాముకు ప్రత్యక్షమయ్యాడు,+ బిలాము ఆయనతో ఇలా అన్నాడు: “నేను వరుసగా ఏడు బలిపీఠాల్ని ఏర్పాటుచేసి, ఒక్కో దాని మీద ఒక ఎద్దును, ఒక పొట్టేలును అర్పించాను.”
5 యెహోవా తన మాటను బిలాము నోట ఉంచి,+ “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగెళ్లి ఇలా చెప్పాలి” అన్నాడు.
6 కాబట్టి బిలాము తిరిగెళ్లి బాలాకు, అలాగే మోయాబు అధికారులందరూ అతని దహనబలి పక్కన నిలబడి ఉండడం చూశాడు.
7 తర్వాత అతను కావ్యరూపంలో ఇలా అన్నాడు:+
“మోయాబు రాజైన బాలాకు అరాము+ నుండి నన్ను తీసుకొచ్చాడు,తూర్పున ఉన్న కొండల దగ్గర నుండి నన్ను రప్పించాడు.
‘వచ్చి నాకోసం యాకోబును శపించు.
అవును, వచ్చి ఇశ్రాయేలును దూషించు’ అన్నాడు.+
8 దేవుడు శపించనివాళ్లను నేనెలా శపించగలను?
యెహోవా దూషించనివాళ్లను నేనెలా దూషించగలను?+
9 బండల పైనుండి నేను వాళ్లను చూస్తున్నాను,కొండల మీద నుండి నేను వాళ్లను చూస్తున్నాను.
వాళ్లు ఒంటరి జనంగా ఉన్నారు;+వాళ్లు తమను తాము ఒక జనంగా ఎంచుకోరు.+
10 యాకోబు ధూళి కణాల్ని ఎవరు లెక్కపెట్టగలరు?+ఇశ్రాయేలు నాలుగో భాగాన్నైనా ఎవరు లెక్కించగలరు?
నీతిమంతులకు వచ్చే మరణం నాకు రావాలి,నా చివరిదశ వాళ్ల చివరిదశలా ఉండాలి.”
11 అప్పుడు బాలాకు బిలాముతో ఇలా అన్నాడు: “నువ్వు నాకు చేసిందేంటి? నా శత్రువుల్ని శపించమని నిన్ను తీసుకొస్తే, నువ్వేమో వాళ్లను దీవించావు.”+
12 దానికి బిలాము, “యెహోవా నా నోట ఏం ఉంచితే అదే నేను చెప్పాలి కదా” అన్నాడు.+
13 బాలాకు అతనితో ఇలా అన్నాడు: “దయచేసి నాతో రా, వాళ్లు నీకు కనిపించే ఇంకో చోటికి నిన్ను తీసుకెళ్తాను; అక్కడి నుండి చూస్తే వాళ్లందరూ కనిపించరు, వాళ్లలో కొంతమందే కనిపిస్తారు. నా కోసం అక్కడి నుండి నువ్వు వాళ్లను శపించు.”+
14 కాబట్టి అతను బిలామును సోఫీము మైదానంలో పిస్గా మీదికి తీసుకెళ్లి,+ అక్కడ ఏడు బలిపీఠాలు కట్టించి, ఒక్కో దాని మీద ఒక ఎద్దును, ఒక పొట్టేలును అర్పించాడు.+
15 అప్పుడు బిలాము బాలాకుతో ఇలా అన్నాడు: “నేను అక్కడికెళ్లి దేవునితో మాట్లాడి తిరిగొచ్చే వరకు నువ్వు ఇక్కడే నీ దహనబలి దగ్గర ఉండు.”
16 తర్వాత యెహోవా బిలాముకు ప్రత్యక్షమై, తన మాటను అతని నోట ఉంచి,+ “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగెళ్లి ఇలా చెప్పాలి” అన్నాడు.
17 కాబట్టి బిలాము తిరిగెళ్లి బాలాకు తన దహనబలి దగ్గర వేచివుండడం, మోయాబు అధికారులందరూ అతనితోపాటే ఉండడం చూశాడు. బాలాకు, “యెహోవా ఏం చెప్పాడు?” అని అతన్ని అడిగాడు.
18 అప్పుడు బిలాము కావ్యరూపంలో ఇలా అన్నాడు:+
“బాలాకూ, లేచి విను.
సిప్పోరు కుమారుడా, నా మాట విను.
19 దేవుడు మనుషుల్లా అబద్ధాలు చెప్పడు,+మనసు మార్చుకోవడానికి* ఆయన మనిషి కాడు.+
ఆయన ఏమైనా చెప్తే, దాన్ని చేయకుండా ఉంటాడా?
ఏదైనా మాటిస్తే, దాన్ని నెరవేర్చకుండా ఉంటాడా?+
20 ఇదిగో! దీవించడానికే నేను వచ్చాను;ఆయన దీవించేశాడు,+ నేను దాన్ని మార్చలేను.+
21 యాకోబుకు వ్యతిరేకమైన ఏ ఇంద్రజాల శక్తినీ ఆయన సహించడు,ఇశ్రాయేలు మీదికి ఆయన ఏ కష్టాన్నీ రానివ్వడు.
అతని దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు,+వాళ్ల మధ్య ఆయన రాజుగా స్తుతించబడుతున్నాడు.
22 దేవుడే వాళ్లను ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నాడు.+
ఆయన వాళ్లకు అడవి ఎద్దు కొమ్ముల లాంటివాడు.+
23 యాకోబుకు వ్యతిరేకమైన శకునాలు ఏవీ లేవు,+ఇశ్రాయేలుకు వ్యతిరేకమైన సోదె అంటూ ఏదీ లేదు.+
ఈ సమయంలో యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి ఇలా చెప్పొచ్చు:
‘దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూడండి!’
24 ఇదిగో ఈ ప్రజలు సింహంలా లేస్తారు,సింహంలా వాళ్లు పైకి లేస్తారు.+
వేటాడిన జంతువును తినేవరకు,చంపబడినవాటి రక్తం తాగేవరకు అది పడుకోదు.”
25 అప్పుడు బాలాకు బిలాముతో ఇలా అన్నాడు: “నువ్వు అతన్ని శపించలేకపోతే సరే, అలాంటప్పుడు నువ్వు అతన్ని దీవించకూడదు కూడా.”
26 దానికి బిలాము ఇలా జవాబిచ్చాడు: “ ‘యెహోవా చెప్పిందంతా నేను చేస్తాను’ అని నేను నీతో అనలేదా?”+
27 అప్పుడు బాలాకు బిలాముతో ఇలా అన్నాడు: “దయచేసి నాతో రా, నేను నిన్ను ఇంకో చోటికి తీసుకెళ్తాను. అక్కడి నుండి నువ్వు నా కోసం వాళ్లను శపించడం బహుశా సత్యదేవుని దృష్టికి సరైనదిగా ఉంటుందేమో.”+
28 కాబట్టి బాలాకు బిలామును పెయోరు మీదికి తీసుకెళ్లాడు, అక్కడి నుండి చూస్తే యెషీమోను*+ కనిపిస్తుంది.
29 తర్వాత బిలాము బాలాకుతో, “ఈ స్థలంలో ఏడు బలిపీఠాలు కట్టి, నా కోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయి” అన్నాడు.+
30 బాలాకు బిలాము చెప్పినట్టే చేశాడు; అతను ఒక్కో బలిపీఠం మీద ఒక ఎద్దును, ఒక పొట్టేలును అర్పించాడు.