సంఖ్యాకాండం 21:1-35
21 ఇశ్రాయేలీయులు అతారీము మార్గంలో వచ్చారని నెగెబులో ఉంటున్న కనానీయుల రాజు అరాదు+ విన్నప్పుడు, అతను వాళ్లమీద దాడిచేసి వాళ్లలో కొందర్ని ఖైదీలుగా తీసుకెళ్లిపోయాడు.
2 కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు ఇలా మొక్కుబడి చేసుకున్నారు: “నువ్వు ఈ ప్రజల్ని మా చేతికి అప్పగిస్తే, మేము తప్పకుండా వాళ్ల నగరాల్ని పూర్తిగా నాశనం చేస్తాం.”
3 యెహోవా ఇశ్రాయేలీయుల మొర విని ఆ కనానీయుల్ని వాళ్ల చేతికి అప్పగించాడు; ఇశ్రాయేలీయులు వాళ్లను, వాళ్ల నగరాల్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి వాళ్లు ఆ చోటికి హోర్మా*+ అని పేరు పెట్టారు.
4 వాళ్లు హోరు కొండ+ నుండి బయల్దేరి, ఎదోము దేశం చుట్టు తిరిగి వెళ్దామని+ ఎర్రసముద్ర మార్గంలో తమ ప్రయాణం కొనసాగించారు; వాళ్లు అలా వెళ్తున్నప్పుడు, ప్రయాణం వల్ల ప్రజలు బాగా అలసిపోయారు.
5 దాంతో వాళ్లు దేవునికి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ+ ఇలా అన్నారు: “మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు బయటికి తీసుకొచ్చారు? ఈ ఎడారిలో చనిపోవడానికేనా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు,+ నీచమైన ఈ ఆహారం అంటేనే మాకు వెగటు* పుట్టింది.”+
6 కాబట్టి యెహోవా ఆ ప్రజల మధ్యకు విష* సర్పాల్ని పంపించాడు, అవి ప్రజల్ని కాటేస్తూ ఉండడంతో చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.+
7 కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి, “మేము యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాం.+ ఈ సర్పాల్ని మా మధ్య నుండి తీసేయమని మా తరఫున యెహోవాను వేడుకో” అన్నారు. అప్పుడు మోషే ఆ ప్రజల తరఫున వేడుకున్నాడు.+
8 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “నువ్వు ఒక విష* సర్పం ప్రతిరూపాన్ని తయారుచేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. ఎవరినైనా పాము కాటేసినప్పుడు వాళ్లు చనిపోకుండా ఉండాలంటే దాన్ని చూడాలి.”
9 మోషే వెంటనే రాగితో ఒక సర్పాన్ని చేసి+ దాన్ని స్తంభం మీద పెట్టాడు;+ ఎప్పుడైనా ఒక వ్యక్తిని పాము కాటేసినప్పుడు అతను ఆ రాగి సర్పాన్ని చూస్తే చనిపోకుండా ఉండేవాడు.+
10 తర్వాత ఇశ్రాయేలీయులు అక్కడి నుండి బయల్దేరి ఓబోతులో డేరాలు వేసుకున్నారు.+
11 ఆ తర్వాత వాళ్లు ఓబోతు నుండి బయల్దేరి ఈయ్యె-అబారీములో,+ అంటే తూర్పు వైపున ఉన్న ఎడారిలో మోయాబుకు ఎదురుగా డేరాలు వేసుకున్నారు.
12 తర్వాత వాళ్లు అక్కడి నుండి బయల్దేరి జెరెదు లోయలో*+ డేరాలు వేసుకున్నారు.
13 అక్కడి నుండి బయల్దేరి అర్నోను ప్రాంతంలో డేరాలు వేసుకున్నారు.+ ఈ అర్నోను అమోరీయుల సరిహద్దు నుండి మొదలయ్యే ఎడారిలో ఉంది; మోయాబుకు, అమోరీయులకు మధ్య అది మోయాబు సరిహద్దుగా ఉంది.
14 అందుకే యెహోవా యుద్ధాలు అనే పుస్తకంలో వీటి గురించి ఉంది: “సూఫాలోని వాహేబు, అర్నోను లోయలు,*
15 మోయాబు సరిహద్దు మీదుగా ఆరు ప్రాంతం వరకు ఉన్న ఆ లోయల* ద్వారం.”
16 అలా వెళ్తూవెళ్తూ వాళ్లు బెయేరుకు* వచ్చారు. “ప్రజల్ని సమావేశపర్చు, నేను వాళ్లకు నీళ్లు ఇస్తాను” అని యెహోవా మోషేతో చెప్పింది ఈ బావి గురించే.
17 ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు:
“బావీ, పైకి ఉబుకు!—పాటతో దానికి జవాబు చెప్పండి!
18 ఇది రాకుమారులు తవ్విన బావి, ప్రజల ప్రముఖులు తవ్విన బావి,అధికార దండంతో, తమ చేతికర్రలతో వాళ్లు తవ్విన బావి.”
తర్వాత వాళ్లు ఎడారి నుండి ప్రయాణం కొనసాగించి మత్తానుకు చేరుకున్నారు,
19 ఆ తర్వాత మత్తాను నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు+ చేరుకున్నారు.
20 బామోతు లోయ నుండి బయల్దేరి మోయాబు ప్రాంతంలో*+ ఉన్న లోయ దగ్గరికి వెళ్లారు. అది పిస్గా పైన+ ఉంది, పిస్గా పైనుండి చూస్తే యెషీమోను* కనిపిస్తుంది.+
21 అప్పుడు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరికి సందేశకుల్ని పంపించి ఇలా చెప్పమన్నారు:+
22 “దయచేసి మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు. మేము ఎవ్వరి పొలంలోకి, ద్రాక్షతోటలోకి వెళ్లం; ఏ బావిలోని నీళ్లూ తాగం. మేము మీ ప్రాంతాన్ని దాటిపోయే వరకు తిన్నగా రాజమార్గంలో నడుచుకుంటూ వెళ్లిపోతాం.”+
23 అయితే ఇశ్రాయేలీయులు తన ప్రాంతం గుండా వెళ్లడానికి సీహోను అనుమతించలేదు. బదులుగా అతను తన ప్రజలందర్నీ పోగుచేసుకొని ఎడారిలో ఇశ్రాయేలీయుల మీదికి వెళ్లాడు; అతను యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో పోరాడడం మొదలుపెట్టాడు.+
24 అయితే ఇశ్రాయేలీయులు అతన్ని కత్తితో ఓడించి,+ అర్నోను+ నుండి యబ్బోకు+ వరకు అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు;+ ఈ యబ్బోకు అమ్మోనీయుల దేశానికి దగ్గర్లో ఉంది. కానీ వాళ్లు యాజెరును+ దాటి వెళ్లలేదు, ఎందుకంటే అది అమ్మోనీయుల ప్రాంతానికి సరిహద్దు.+
25 కాబట్టి ఇశ్రాయేలీయులు ఈ నగరాలన్నిటినీ ఆక్రమించుకొని హెష్బోనులో, దాని చుట్టుపక్కల పట్టణాలన్నిటితో పాటు అమోరీయుల నగరాలన్నిట్లో నివసించడం మొదలుపెట్టారు.+
26 ఎందుకంటే, ఈ హెష్బోను నగరం అమోరీయుల రాజైన సీహోనుది; అతను మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు అతని దేశమంతటినీ ఆక్రమించుకున్నాడు.
27 ప్రజలు ఎగతాళి చేస్తూ చెప్పుకునే ఈ సామెత అందుకే పుట్టింది:
“హెష్బోనుకు రండి.
సీహోను నగరాన్ని కట్టాలి, దాన్ని స్థిరపర్చాలి.
28 ఎందుకంటే హెష్బోను నుండి అగ్ని బయల్దేరింది, సీహోను పట్టణం నుండి జ్వాల బయల్దేరింది.
అది మోయాబులోని ఆరును, అర్నోను ఎత్తైన స్థలాల ప్రభువుల్ని దహించేసింది.
29 మోయాబూ, నీకు శ్రమ! కెమోషు+ ప్రజలారా, మీరు నాశనమౌతారు!
అతను తన కుమారుల్ని దేశదిమ్మరులుగా, తన కూతుళ్లను అమోరీయుల రాజైన సీహోనుకు ఖైదీలుగా చేస్తాడు.
30 మనం వాళ్లమీద దాడి చేద్దాం;దీబోను+ వరకు హెష్బోను నాశనం చేయబడుతుంది;నోఫహు వరకు మనం దాన్ని నిర్జన ప్రదేశంగా చేద్దాం;మేదెబా+ వరకు అగ్ని వ్యాపిస్తుంది.”
31 అలా ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివసించడం మొదలుపెట్టారు.
32 తర్వాత మోషే యాజెరును+ వేగుచూడడానికి కొంతమందిని పంపించాడు. వాళ్లు దాని చుట్టుపక్కల పట్టణాల్ని జయించి, అక్కడున్న అమోరీయుల్ని తరిమేశారు.
33 తర్వాత వాళ్లు పక్కకు తిరిగి బాషాను మార్గం గుండా వెళ్లారు. దాంతో బాషాను రాజైన ఓగు+ తన ప్రజలందర్నీ తీసుకొని వాళ్లతో యుద్ధం చేయడానికి ఎద్రెయికి వచ్చాడు.+
34 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అతన్ని చూసి భయపడకు.+ ఎందుకంటే అతన్ని, అతని ప్రజలందర్నీ, అతని దేశాన్ని నేను నీ చేతికి అప్పగిస్తాను.+ మీరు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేస్తారు.”+
35 కాబట్టి వాళ్లు అతని ప్రజల్లో ఒక్కరు కూడా మిగలకుండా ఉండేవరకు అతన్ని, అతని కుమారుల్ని, అతని ప్రజలందర్నీ చంపుతూ వెళ్లారు;+ చివరికి అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.+
అధస్సూచీలు
^ “నాశనం కోసం ప్రతిష్ఠించడం” అని అర్థం.
^ లేదా “అసహ్యం.”
^ లేదా “మంట పుట్టించే.”
^ లేదా “మంట పుట్టించే.”
^ లేదా “వాగు దగ్గర.”
^ లేదా “వాగులు.”
^ లేదా “వాగుల.”
^ “బావి; గొయ్యి” అని అర్థం.
^ అక్ష., “మైదానంలో.”
^ లేదా “ఎడారి; ఎండిన ప్రదేశం” అయ్యుంటుంది.