సంఖ్యాకాండం 17:1-13

  • చిగురించిన అహరోను కర్ర సూచనగా ఉంటుంది (1-13)

17  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ఒక్కో పూర్వీకుల కుటుంబానికి ఒక కర్ర చొప్పున తీసుకో, ప్రతీ పూర్వీకుల కుటుంబ ప్రధానుడి+ నుండి ఒక కర్ర తీసుకో, అలా మొత్తం 12 కర్రలు తీసుకో. ఎవరి కర్ర మీద వాళ్ల పేరు రాయి.  లేవి గోత్రం కర్ర మీద నువ్వు అహరోను పేరు రాయాలి, ఎందుకంటే ఒక్కో పూర్వీకుల కుటుంబ పెద్ద కోసం ఒక్క కర్రే ఉంది.  ఆ కర్రల్ని నువ్వు ప్రత్యక్ష గుడారంలో సాక్ష్యపు మందసం ముందు,+ నేను ఎప్పుడూ నీకు ప్రత్యక్షమయ్యే చోట+ పెట్టు.  నేను ​ఎవరినైతే ఎంచుకుంటానో ఆ వ్యక్తి+ కర్ర చిగురిస్తుంది; అలా నేను, ఇశ్రాయేలీయులు నా మీద, మీ మీద సణుగుతున్న సణుగుల్ని ఆపుచేస్తాను.”+  కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు, అప్పుడు వాళ్ల ప్రధానులందరూ అతనికి కర్రలు ఇచ్చారు. ఒక్కో పూర్వీకుల కుటుంబ ప్రధానుడు ఒక్కో కర్ర చొప్పున మొత్తం 12 కర్రలు ఇచ్చారు; వాటిలో అహరోను కర్ర కూడా ఉంది.  అప్పుడు మోషే ఆ కర్రల్ని తీసుకొని సాక్ష్యపు గుడారంలో యెహోవా ముందు పెట్టాడు.  తర్వాతి రోజు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్లినప్పుడు, ఇదిగో! లేవి గోత్రానికి చెందిన ​అహరోను కర్ర చిగురించింది; దానికి మొగ్గలు, పూలు వచ్చాయి, బాదం పండ్లు కాశాయి.  తర్వాత మోషే, యెహోవా ముందున్న ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలందరి ముందుకు తీసుకొచ్చాడు. వాళ్లు వాటిని చూశారు, ప్రతీ వ్యక్తి తన కర్రను తీసుకున్నాడు. 10  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అహరోను కర్రను+ తిరిగి సాక్ష్యపు మందసం ముందు పెట్టు, అది తిరుగుబాటుదారులకు+ సూచనగా+ ఎప్పటికీ అక్కడ ఉంటుంది. అలా వాళ్లు నా మీద సణుగుతున్న సణుగులు ​ఆగిపోతాయి, వాళ్లు చావకుండా ఉంటారు.” 11  మోషే వెంటనే యెహోవా తనకు ఆజ్ఞా​పించినట్టు చేశాడు. అతను సరిగ్గా అలాగే చేశాడు. 12  తర్వాత ఇశ్రాయేలీయులు మోషేతో ఇలా అన్నారు: “ఇప్పుడు మేము చనిపోతాం, మేము ఖచ్చితంగా నశించిపోతాం, మేమంతా నాశనం కాబోతున్నాం! 13  ఎవరైనా యెహోవా గుడారం దరిదాపుల్లోకి వచ్చినా చనిపోతారు!+ చివరికి మేము ఇలా చనిపోవాలా?”+

అధస్సూచీలు