సంఖ్యాకాండం 15:1-41

  • అర్పణల గురించి నియమాలు (1-21)

    • స్వదేశికి, పరదేశికి ఒకే నియమం (15, 16)

  • పొరపాటున చేసిన పాపాలకు అర్పణలు (22-29)

  • ఉద్దేశపూర్వకంగా చేసే పాపాలకు శిక్ష (30, 31)

  • విశ్రాంతి రోజును ఆచరించని వ్యక్తి చంపబడ్డాడు (32-36)

  • వస్త్రాల అంచులకు కుచ్చులు ఉండాలి (37-41)

15  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘మీరు నివసించడానికి నేను మీకు ఇస్తున్న దేశంలోకి+ మీరు వచ్చినప్పుడు,  యెహోవాకు ఇంపైన* సువాసన వచ్చేలా+ పశువుల్లో నుండి గానీ మందలో నుండి గానీ యెహోవా కోసం అగ్నితో అర్పించే అర్పణను ఇవ్వాలనుకుంటే, అది దహనబలి+ అయినా, ప్రత్యేక మొక్కుబడిని చెల్లించడానికి ఇచ్చే అర్పణ అయినా, స్వేచ్ఛార్పణ+ అయినా, ఆయా కాలాల్లో మీరు చేసుకునే పండుగలప్పుడు+ అర్పించే అర్పణ అయినా,  దాన్ని ఇచ్చే వ్యక్తి దానితోపాటు యెహోవాకు ధాన్యార్పణగా ఈఫాలో ​పదోవంతు* మెత్తని పిండిని+ హిన్‌లో* నాలుగో వంతు నూనె కలిపి తీసుకురావాలి.  అలాగే దహనబలితో పాటు లేదా బలి అర్పించే ప్రతీ మగ గొర్రెపిల్లతో పాటు హిన్‌లో నాలుగో వంతు ద్రాక్షారసాన్ని పానీయార్పణగా అర్పించాలి.+  ఒకవేళ అర్పించేది పొట్టేలునైతే, ధాన్యార్పణగా ఈఫాలో రెండు పదోవంతుల మెత్తని పిండిని హిన్‌లో మూడో వంతు నూనె కలిపి తీసుకురావాలి.  అలాగే పానీయార్పణగా హిన్‌లో మూడో వంతు ద్రాక్షారసాన్ని తీసుకురావాలి, అది యెహోవాకు ఇంపైన* సువాసన.  “ ‘ఒకవేళ యెహోవాకు దహనబలిగా లేదా ప్రత్యేక మొక్కుబడి చెల్లించడానికి ఇచ్చే అర్పణగా+ లేదా సమాధాన బలులుగా+ కోడెదూ​డను అర్పించాల్సి వస్తే,+  ఆ కోడెదూడతో పాటు ధాన్యార్పణగా+ ఈఫాలో మూడు పదోవంతుల మెత్తని పిండిని హిన్‌లో సగం నూనె కలిపి తీసుకురావాలి. 10  అలాగే పానీయార్పణగా హిన్‌లో సగం ద్రాక్షారసాన్ని+ అగ్నితో అర్పించే అర్పణగా తీసుకురావాలి, అది యెహోవాకు ఇంపైన* సువాసన. 11  ప్రతీ కోడెదూడ విషయంలో, ప్రతీ పొట్టేలు విషయంలో, ప్రతీ మగ గొర్రెపిల్ల విషయంలో, ప్రతీ మేక విషయంలో ఇలాగే చేయాలి. 12  మీరు ఎన్ని అర్పించినా, వాటి సంఖ్యను బట్టి ఒక్కో దాని విషయంలో మీరు ఇలాగే చేయాలి. 13  ప్రతీ ఇశ్రాయేలీయుడు అగ్నితో అర్పించే అర్పణను తీసుకొస్తున్నప్పుడు ఇలాగే చేయాలి, అది యెహోవాకు ఇంపైన* సువాసన. 14  “ ‘మీతోపాటు నివసిస్తున్న పరదేశి గానీ ఎన్నో తరాలుగా మీ మధ్య నివసిస్తూ వచ్చిన వ్యక్తి గానీ యెహోవాకు ఇంపైన* సువాసన వచ్చేలా అగ్నితో అర్పించే అర్పణను ఇవ్వాల్సి వస్తే, అతను కూడా మీరు చేసినట్టే చేయాలి.+ 15  ఇశ్రాయేలు సమాజానికి చెందిన మీకూ, మీ మధ్య ​నివసిస్తున్న పరదేశికీ ఒకే శాసనం వర్తిస్తుంది. ఇది మీరు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం. యెహోవా ముందు మీరూ, పరదేశులూ ఒకేలా ఉండాలి.+ 16  మీకూ, మీ మధ్య నివసిస్తున్న పరదేశికీ ఒకే నియమం,* ఒకే న్యాయనిర్ణయం ఉండాలి.’ ” 17  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 18  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను మిమ్మల్ని తీసుకొస్తున్న దేశంలోకి మీరు వచ్చాక, 19  మీరు ఆ దేశపు ఆహారం ఏదైనా తిన్నప్పుడు+ యెహోవాకు కానుక అర్పించాలి. 20  మీ మొదటి పంటలోని* దంచిన ధాన్యంతో భక్ష్యాలు* చేసి కానుకగా అర్పించాలి.+ కళ్లం* నుండి తెచ్చిన వాటిని అర్పించినట్టే దాన్ని కానుకగా అర్పించాలి. 21  మీరు తరతరాలపాటు మీ మొదటి పంటలోని* దంచిన ధాన్యంతో చేసిన కొన్నిటిని యెహోవాకు కానుకగా ఇవ్వాలి. 22  “ ‘ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసి, యెహోవా మోషేకు చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటినీ పాటించడంలో తప్పిపోతే, 23  అంటే యెహోవా ఆజ్ఞాపించిన రోజు నుండి తరతరాలపాటు ఎప్పుడైనా మీరు, మోషే ద్వారా యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడంలో తప్పిపోతే, 24  సమాజం తెలియక, పొరపాటున అలాచేస్తే, సమాజమంతా కలిసి దహనబలిగా ఒక కోడెదూడను అర్పించాలి, అది యెహోవాకు ఇంపైన* సువాసన; వాళ్లు దానితోపాటు ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే దాని ధాన్యార్పణను, దాని పానీయార్పణను కూడా అర్పించాలి;+ అలాగే పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.+ 25  ఇశ్రాయేలీయుల సమాజమంతటి కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు, వాళ్లు క్షమాపణ పొందుతారు.+ ఎందుకంటే వాళ్లు పొరపాటున తప్పు చేశారు, తాము చేసిన తప్పును బట్టి తమ అర్పణగా యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణను, అలాగే యెహోవా ముందుకు తమ పాపపరిహారార్థ బలిని తీసుకొచ్చారు. 26  ప్రజలందరూ పొరపాటున ఆ తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలీయులందరు, అలాగే వాళ్ల మధ్య నివసిస్తున్న పరదేశులు క్షమాపణ పొందుతారు. 27  “ ‘ఒకవేళ ఒక వ్యక్తి ​పొరపాటున పాపం చేస్తే, అతను పాపపరిహారార్థ బలిగా ఏడాది ఆడ మేకపిల్లను తీసుకురావాలి.+ 28  యెహోవా ముందు అనుకోకుండా పాపం చేయడం ద్వారా తప్పు చేసిన ఆ వ్యక్తి కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడతను ​క్షమాపణ పొందుతాడు.+ 29  పొరపాటున తప్పు చేయడం విషయంలో మీకూ, మీ మధ్య నివసిస్తున్న పరదేశులకూ ఒకే నియమం ఉండాలి.+ 30  “ ‘అయితే ఉద్దేశపూర్వకంగా పాపం చేసే వ్యక్తి,+ అతను ఇశ్రాయేలీయుడైనా పరదేశైనా, అతను యెహోవాను దూషిస్తున్నట్టే; అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.* 31  ఆ వ్యక్తి యెహోవా మాటను నీచంగా ఎంచి, ఆయన ఆజ్ఞను మీరాడు కాబట్టి అతను ఖచ్చితంగా కొట్టివేయబడాలి.+ అతని దోషమే అతని మీదికి శిక్ష తీసుకొచ్చింది.’ ”+ 32  ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి విశ్రాంతి రోజున* కట్టెలు ఏరుకోవడం చూశారు.+ 33  అతను కట్టెలు ఏరుకుంటుండగా చూసినవాళ్లు అతన్ని మోషే ముందుకు, అహరోను ముందుకు, అలాగే సమాజమంతటి ముందుకు తీసుకొచ్చారు. 34  అతన్ని ​ఏంచేయాలో ప్రత్యేకంగా చెప్పబడలేదు కాబట్టి వాళ్లు అతన్ని కాపలాలో ఉంచారు.+ 35  అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “అతన్ని ఖచ్చితంగా చంపేయాలి,+ సమాజమంతా కలిసి పాలెం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి.”+ 36  కాబట్టి సమాజమంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతన్ని పాలెం బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టారు, దాంతో అతను చనిపోయాడు. 37  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 38  “ఇశ్రాయేలీయులు తరతరాలపాటు తమ వస్త్రాల అంచులకు కుచ్చులు చేసుకోవాలని, ఆ కుచ్చులకు పైన నీలంరంగు దారం ఉండాలని నువ్వు వాళ్లకు చెప్పు.+ 39  ‘కుచ్చులున్న ఆ అంచును చూసి మీరు యెహోవా ఆజ్ఞలన్నిటినీ గుర్తుచేసుకుని, వాటిని పాటించేలా+ అది మీ వస్త్రాలకు ఉండాలి. మీరు నాకు నమ్మకద్రోహం చేసేలా* మిమ్మల్ని నడిపిస్తున్న మీ హృదయాల్ని, మీ కళ్లను మీరు అనుసరించకూడదు.+ 40  ఈ నియమం, నా ఆజ్ఞలన్నిటినీ గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది; దానివల్ల మీరు నా ఆజ్ఞలన్నీ పాటిస్తూ, మీ దేవుడినైన నాకు పవిత్రంగా ఉంటారు.+ 41  నేను మీ దేవుడైన యెహోవాను; మీకు దేవుడిగా ఉండడానికి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది నేనే.+ నేను మీ దేవుడైన యెహోవాను.’ ”+

అధస్సూచీలు

లేదా “శాంతపర్చే.”
అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక హిన్‌ 3.67 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
అక్ష., “ధర్మశాస్త్రం.”
లేదా “ప్రథమఫలాల్లోని.”
వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.
పదకోశం చూడండి.
లేదా “ప్రథమఫలాల్లోని.”
లేదా “శాంతపర్చే.”
లేదా “చంపబడాలి.”
లేదా “సబ్బాతు రోజున.”
లేదా “ఆధ్యాత్మిక వ్యభిచారం చేసేలా.”