సంఖ్యాకాండం 13:1-33

  • కనానుకు 12 మంది వేగులవాళ్లను పంపడం (1-24)

  • పదిమంది వేగులవాళ్ల చెడ్డ నివేదిక (25-33)

13  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు:  “నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న కనాను దేశాన్ని వేగుచూడడానికి మనుషుల్ని పంపించు. వాళ్ల పూర్వీకుల గోత్రాల్లో ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని పంపించాలి, వాళ్లలో ప్రతీ ఒక్కరు తన గోత్రంలో ప్రధానుడై+ ఉండాలి.”+  కాబట్టి మోషే యెహోవా ఆదేశం మేరకు పారాను ఎడారి+ నుండి వాళ్లను పంపించాడు. వాళ్లందరూ ఇశ్రాయేలీయుల పెద్దలే.  వాళ్లు ఎవరంటే: రూబేను గోత్రం నుండి జక్కూరు ​కుమారుడైన షమ్మూయ;  షిమ్యోను గోత్రం నుండి హోరీ కుమారుడైన షాపాతు;  యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;+  ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కుమారుడైన ఇగాలు;  ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడైన హోషేయ;+  బెన్యామీను గోత్రం నుండి రాఫు కుమారుడైన పల్తీ; 10  జెబూలూను గోత్రం నుండి సోరీ కుమారుడైన గదీయేలు; 11  యోసేపు+ కుమారుడైన మనష్షే+ గోత్రం నుండి సూసీ కుమారుడైన గదీ; 12  దాను గోత్రం నుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు; 13  ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు; 14  నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కుమారుడైన నహబీ; 15  గాదు గోత్రం నుండి మాకీ ​కుమారుడైన గెయువేలు. 16  ఇవి కనాను దేశాన్ని వేగుచూడడానికి మోషే పంపించిన వాళ్ల పేర్లు. అయితే నూను కుమారుడైన హోషేయకు మోషే ​యెహోషువ*+ అని పేరు పెట్టాడు. 17  కనాను దేశాన్ని వేగుచూడడానికి వాళ్లను పంపిస్తున్నప్పుడు మోషే వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు నెగెబుకు చేరుకొని, అక్కడి నుండి కొండ ప్రాంతానికి వెళ్లండి.+ 18  మీరు దాన్ని చూసి, అది ఎలాంటి దేశమో,+ అక్కడ నివసించే ప్రజలు బలవంతులో బలహీనులో, వాళ్లు ఎక్కువ​మంది ఉన్నారో తక్కువమంది ఉన్నారో, 19  అది మంచి దేశమో కాదో, వాళ్లు నివసిస్తున్న నగరాలకు ప్రాకారాలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. 20  అది సంపన్న దేశమో పేద దేశమో,+ దానిలో చెట్లు ఉన్నాయో లేవో చూడండి. మీరు ధైర్యంగా ఉండాలి,+ అలాగే ఆ దేశంలోని పండ్లలో కొన్ని తీసుకురావాలి.” అది ద్రాక్షల ప్రథమ​ఫలాల కాలం.+ 21  కాబట్టి వాళ్లు వెళ్లి సీను ఎడారి+ నుండి లెబో-హమాతు*+ దగ్గరున్న రెహోబు+ వరకు ఆ దేశాన్ని వేగుచూశారు. 22  వాళ్లు నెగెబులోకి వెళ్లి అనాకీయులైన+ అహీమాను, షేషయి, తల్మయి+ నివసిస్తున్న హెబ్రోను+ ​నగరానికి వచ్చారు. ఈ హెబ్రోను నగరం, ఐగు​ప్తుకు చెందిన సోయను కన్నా ఏడేళ్లు ముందే నిర్మించ​బడింది. 23  వాళ్లు ఎష్కోలు లోయకు* ​వచ్చినప్పుడు, ద్రాక్ష గుత్తి ఉన్న ఒక తీగను కోశారు; దాన్ని ఇద్దరు వ్యక్తులు మోతకర్ర మీద మోయాల్సి వచ్చింది. అలాగే వాళ్లు కొన్ని దానిమ్మ పండ్లను, అంజూర పండ్లను కూడా కోశారు. 24  ఇశ్రాయేలీయులు అక్కడ ద్రాక్ష గుత్తిని కోశారు కాబట్టి వాళ్లు ఆ స్థలానికి ఎష్కోలు* లోయ*+ అని పేరు పెట్టారు. 25  వాళ్లు ఆ దేశాన్ని వేగుచూసి 40 రోజుల+ తర్వాత తిరిగొచ్చారు. 26  వాళ్లు కాదేషు+ ​దగ్గరికి, అంటే పారాను ఎడారిలో మోషే, అహరోను, ఇశ్రాయేలీయుల సమాజమంతా ఉన్న చోటికి తిరిగొచ్చారు. వాళ్లు ఆ సమాజమంతటి కోసం నివేదికను తీసుకొచ్చారు, ఆ దేశంలోని పండ్లను వాళ్లకు చూపించారు. 27  వాళ్లు మోషేకు ఇలా చెప్పారు: “నువ్వు మమ్మల్ని ​పంపించిన దేశంలోకి మేము వెళ్లాం, అది ​నిజంగానే పాలుతేనెలు ప్రవహించే దేశం;+ ఇవి దాని పండ్లు. 28  అయితే, ఆ దేశంలో ​నివసించే ప్రజలు చాలా బలవంతులు; వాళ్ల ​నగరాలు చాలా పెద్దవి, వాటికి ప్రాకారాలు ఉన్నాయి. అంతేకాదు అక్కడ మేము అనాకీయుల్ని చూశాం.+ 29  నెగెబు దేశంలో అమాలేకీయులు+ నివసిస్తున్నారు; కొండ ప్రాంతంలో హిత్తీయులు, యెబూసీయులు,+ అమోరీయులు+ నివసిస్తున్నారు; సముద్రం దగ్గర,+ అలాగే యొర్దాను తీరం వెంబడి కనానీయులు+ నివసి​స్తున్నారు.” 30  అప్పుడు కాలేబు మోషే ముందు నిలబడిన ప్రజల్ని శాంతపర్చడానికి ప్రయత్నిస్తూ, “మనం వెంటనే అక్కడికి వెళ్దాం, మనం దాన్ని తప్పక స్వాధీనం చేసుకుంటాం; ఎందుకంటే మనం దాన్ని ఖచ్చితంగా జయించగలం” అన్నాడు.+ 31  అయితే అతనితో పాటు అక్కడికి వెళ్లొచ్చిన వాళ్లు, “మనం ఆ ప్రజలతో యుద్ధం చేయలేం, వాళ్లు మనకన్నా బలవంతులు” అన్నారు.+ 32  తాము వేగుచూసి వచ్చిన దేశం గురించి వాళ్లు ఇశ్రాయేలీయులకు చెడ్డ నివేదిక ఇస్తూ ఇలా అంటూ ఉన్నారు: “మేము వేగుచూడడానికి ఏ దేశానికైతే వెళ్లామో ఆ దేశం దాని నివాసుల్ని మింగేసే దేశం; అందులో మేము చూసిన ప్రజలంతా భారీకాయులు.+ 33  అక్కడ మేము అనాకు వంశస్థులైన+ భారీకాయుల్ని* చూశాం, వాళ్లు నెఫీలీయుల నుండి వచ్చారు; వాళ్లతో పోల్చుకున్నప్పుడు మేము మా కంటికీ వాళ్ల కంటికీ మిడతల్లా* కనిపించాం.”

అధస్సూచీలు

“యెహోవాయే రక్షణ” అని అర్థం.
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
లేదా “వాగుకు.”
“ద్రాక్ష గుత్తి” అని అర్థం.
లేదా “వాగు.”
అక్ష., “నెఫీలీయుల్ని.”
లేదా “గొల్లభామల్లా.”