లేవీయకాండం 6:1-30

  • అపరాధ పరిహారార్థ బలి గురించి మరిన్ని ​వివరాలు (1-7)

  • అర్పణల గురించి నిర్దేశాలు (8-30)

    • దహనబలి (8-13)

    • ధాన్యార్పణ (14-23)

    • పాపపరిహారార్థ బలి (24-30)

6  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “ఎవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన లేదా తన దగ్గర ఉంచిన దాని విషయంలో మోసం చేసి+ గానీ, తన పొరుగువాణ్ణి దోచుకొని గానీ, దగా చేసి గానీ పాపానికి ఒడిగట్టి యెహోవా పట్ల నమ్మకద్రోహానికి పాల్పడితే,+  లేదా వేరేవాళ్ల వస్తువు తనకు దొరికినప్పుడు అబద్ధమాడి గానీ, తాను చేసిన అలాంటి ఏ పాపం గురించైనా బూటకపు ప్రమాణం చేసి గానీ పాపానికి ఒడిగట్టి+ దేవుని పట్ల నమ్మక​ద్రోహానికి పాల్పడితే, అతను ఇలా చేయాలి:  అతను పాపం చేసి అపరాధి అయితే, తాను దొంగిలించిన దాన్ని, బలవంతంగా లాక్కున్న దాన్ని, దగా చేసి తీసుకున్న దాన్ని, తనకు అప్పగించబడిన దాన్ని లేదా తనకు దొరికిన దాన్ని అతను తిరిగిచ్చేయాలి.  లేదా అతను దేని గురించైతే బూటకపు ప్రమాణం చేశాడో దాన్ని తిరిగిచ్చేయాలి, దానికి పూర్తి పరిహారం చెల్లించాలి.+ అంతేకాదు దాని విలువలో ఐదోవంతును కూడా దానికి కలపాలి. తన అపరాధం రుజువైన రోజున అతను దాని యజమానికి దాన్ని ఇచ్చేయాలి.  అతను అపరాధ పరిహారార్థ బలి కోసం నిర్ణయించబడిన విలువ ప్రకారం మందలో నుండి ఏ లోపంలేని పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా దగ్గరికి తీసుకురావాలి.+  యాజకుడు యెహోవా ముందు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు అతను ఏమి చేసి అపరాధి అయ్యాడో, దాని విషయంలో క్షమాపణ పొందుతాడు.”+  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “అహరోనుకు, అతని కుమారులకు ఇలా ​ఆజ్ఞాపించు: ‘దహనబలి గురించిన నియమం ఏంటంటే,+ దహనబలి జంతువు తెల్లారేవరకు రాత్రంతా బలిపీఠంపై ఉన్న అగ్ని మీద అలాగే ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. 10  యాజకుడు తన ప్రత్యేకమైన నారవస్త్రాన్ని వేసుకొని,+ తన మర్మాంగాల్ని ​కప్పుకోవడానికి నార లాగుల్ని* తొడుక్కుంటాడు.+ తర్వాత అతను బలిపీఠం మీద అగ్ని దహించేసిన దహనబలి జంతువు బూడిదను* తీసి,+ బలి​పీఠం పక్కన పోస్తాడు. 11  తర్వాత అతను తన వస్త్రాల్ని తీసేసి,+ వేరే వస్త్రాలు ​వేసుకొని ఆ ​బూడిదను పాలెం బయట ఒక ​శుభ్రమైన చోటికి తీసుకెళ్తాడు.+ 12  బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. యాజకుడు ప్రతీ ఉదయం దానిమీద కట్టెల్ని కాల్చి+ వాటిమీద దహనబలి ముక్కల్ని పేర్చాలి; అతను దానిమీద సమాధాన బలుల కొవ్వును కాల్చి, పొగ పైకిలే​చేలా చేస్తాడు.+ 13  బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. 14  “ ‘ధాన్యార్పణ గురించిన నియమం ఏంటంటే,+ అహరోను కుమారులైన మీరు బలిపీఠం ఎదుట యెహోవా ముందుకు దాన్ని తీసుకురావాలి. 15  వాళ్లలో ఒకరు ధాన్యార్పణలో నుండి పిడికెడు మెత్తని పిండిని, కొంచెం నూనెను, ధాన్యార్పణ మీదున్న సాంబ్రాణి అంతటినీ తీసుకొని యెహోవాకు జ్ఞాపకార్థ* భాగంగా దాన్ని ​బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాలి; అది ఆయనకు ఇంపైన* సువాసన. 16  అందులో మిగిలిన దాన్ని అహరోను, అతని కుమారులు తింటారు.+ వాళ్లు దానితో పులవని రొట్టెలు చేసుకొని, ప్రత్యక్ష గుడారపు ప్రాంగణంలో ఒక పవిత్రమైన చోట తింటారు.+ 17  వాటిని తయారుచేసేటప్పుడు పులిసిందేదీ కలపకూడదు.+ నాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి వాళ్ల భాగంగా నేను దాన్ని వాళ్లకు ఇచ్చాను.+ పాపపరిహారార్థ బలిలా, అపరాధ పరిహారార్థ బలిలా అది అతి పవిత్రమైనది.+ 18  అహరోను వంశంలోని ప్రతీ పురుషుడు దాన్ని తింటాడు.+ అది మీ తరతరాలపాటు, యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి వాళ్లకు ఇవ్వబడే శాశ్వతమైన భాగం.+ వాటికి* తగిలే ప్రతీది పవిత్రం ​అవుతుంది.’ ” 19  యెహోవా మోషేతో మళ్లీ ఇలా అన్నాడు: 20  “అహరోను అభిషేకించబడే రోజున అతను, అతని కుమారులు యెహోవాకు ఎప్పుడూ దీన్ని అర్పించాలి: ఈఫాలో పదోవంతు* మెత్తని పిండిని ధాన్యార్పణగా అర్పించాలి;+ దానిలో సగం ఉదయం, సగం సాయంత్రం అర్పించాలి. 21  దానిలో నూనె కలిపి, పెనం మీద కాల్చాలి.+ బాగా నూనె కలిపి, ముక్కలుముక్కలు చేసి ధాన్యార్పణగా దాన్ని అర్పించాలి, అది యెహో​వాకు ఇంపైన* సువాసన. 22  అతని వంశస్థుల్లో అతని తర్వాత ప్రధాన​యాజకునిగా అభిషేకించబడే వ్యక్తి+ దాన్ని అర్పిస్తాడు. ఇది శాశ్వత శాసనం: యెహోవాకు అర్పణగా, పొగ పైకిలేచేలా దాన్ని పూర్తిగా కాల్చాలి. 23  యాజకుని తరఫున అర్పించే ప్రతీ ధాన్యా​ర్పణను పూర్తిగా కాల్చాలి, దాన్ని తినకూడదు.” 24  యెహోవా మోషేతో మళ్లీ ఇలా అన్నాడు: 25  “అహరోనుకు, అతని కుమారులకు ఇలా చెప్పు: ‘పాపపరిహారార్థ బలి గురించిన నియమం ఏంటంటే,+ దహనబలి జంతువును వధించే చోటే+ పాపపరిహారార్థ బలి జంతువును కూడా యెహోవా ముందు వధించాలి. అది అతి పవిత్రమైనది. 26  పాపానికి ప్రాయశ్చిత్తంగా దాన్ని అర్పించే యాజకుడే దాన్ని తింటాడు.+ ప్రత్యక్ష గుడారపు ప్రాంగణంలో ఒక పవిత్రమైన చోట దాన్ని తినాలి.+ 27  “ ‘దాని మాంసానికి తగిలే ప్రతీది పవిత్రం అవుతుంది. దాని రక్తంలో కొంచెం ఎవరి వస్త్రం మీదైనా పడితే, రక్తం పడిన ఆ వస్త్రాన్ని ఒక ​పవిత్రమైన చోట ఉతకాలి. 28  ఆ మాంసాన్ని ఉడకబెట్టిన మట్టి కుండను పగలగొట్టాలి. కానీ దాన్ని ఒకవేళ రాగి గిన్నెలో ఉడకబెట్టి ఉంటే, ఆ గిన్నెను బాగా తోమి నీళ్లతో కడగాలి. 29  “ ‘యాజకుడైన ప్రతీ పురుషుడు దాన్ని తింటాడు.+ అది అతి పవిత్రమైనది. 30  అయితే, పవిత్ర స్థలంలో ప్రాయశ్చిత్తం ​చేయడానికి పాపపరిహారార్థ బలి రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి ఉంటే, ఆ అర్పణను తినకూడదు.+ దాన్ని అగ్నితో కాల్చేయాలి.

అధస్సూచీలు

లేదా “లోదుస్తుల్ని.”
లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిదను.
లేదా “ప్రాతినిధ్య.”
లేదా “శాంతపర్చే.”
లేదా “ఆ అర్పణలకు.”
అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “శాంతపర్చే.”