లేవీయకాండం 3:1-17

  • సమాధానబలి (1-17)

    • కొవ్వును, రక్తాన్ని తినకూడదు (17)

3  “ ‘ఒకవేళ అతను సమాధానబలి అర్పించాలనుకొని,+ తన పశువుల్లో ఒకదాన్ని బలిగా ఇవ్వాలనుకుంటే ఏ లోపంలేని మగదాన్ని గానీ, ఆడదాన్ని గానీ యెహోవా ముందుకు తీసుకురావాలి.  అతను దాని తల మీద చెయ్యి ఉంచాలి. అది ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర వధించబడుతుంది; యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరిస్తారు.  అతను ఆ సమాధానబలిలో ​కొంతభాగాన్ని యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా అర్పిస్తాడు.+ అందులో ఏమేమి ఉంటాయంటే: పేగుల దగ్గరున్న కొవ్వు,+ అలాగే పేగుల మీద పేరుకున్న కొవ్వంతా,  రెండు మూత్రపిండాలు, వాటిమీద తుంట్ల దగ్గరున్న కొవ్వు. అతను మూత్రపిండాలతోపాటు కాలేయం మీదున్న కొవ్వును కూడా వేరుచేస్తాడు.+  అహరోను కుమారులు దాన్ని బలిపీఠం మంట మీద పేర్చిన కట్టెలపై ఉంచిన దహనబలి మీద పెట్టి, పొగ పైకిలేచేలా కాలుస్తారు;+ అది అగ్నితో అర్పించే అర్పణ, యెహోవాకు ఇంపైన* సువాసన.+  “ ‘ఒకవేళ అతను మందలో నుండి యెహో​వాకు సమాధానబలిని అర్పించాలనుకుంటే, ఏ లోపంలేని మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ అర్పించాలి.+  అతను మగ గొర్రెపిల్లను ​అర్పించాలనుకుంటే, దాన్ని యెహోవా ముందుకు తీసుకురావాలి.  అతను దాని తల మీద చెయ్యి పెడతాడు. అది ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం ముందు వధించబడుతుంది. అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరిస్తారు.  సమాధానబలి జంతువు కొవ్వును యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా అతను తీసుకొస్తాడు.+ అతను వెన్నెముక దగ్గరున్న కొవ్విన తోకను, పేగుల దగ్గరున్న కొవ్వును, అలాగే పేగుల మీద పేరుకున్న ​కొవ్వంతటినీ, 10  రెండు మూత్రపిండాల్ని, వాటిమీద తుంట్ల దగ్గరున్న కొవ్వును ​వేరుచేస్తాడు. అతను మూత్రపిండాలతోపాటు కాలేయం మీదున్న కొవ్వును కూడా వేరుచేస్తాడు.+ 11  యాజకుడు దాన్ని తీసుకొని, ఆహారంగా* బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు. అది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.+ 12  “ ‘ఒకవేళ అతను మేకను అర్పించాలనుకుంటే, అతను దాన్ని యెహోవా ముందుకు ​తీసుకొస్తాడు. 13  అతను దాని తల మీద చెయ్యి పెడతాడు. అది ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం ముందు వధించబడుతుంది. అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా ​చిలకరించాలి. 14  యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా అతను తీసుకొచ్చే భాగం ఏమిటంటే: పేగుల దగ్గరున్న కొవ్వు, అలాగే పేగుల మీద పేరుకున్న కొవ్వంతా,+ 15  రెండు మూత్రపిండాలు, వాటిమీద తుంట్ల దగ్గరున్న కొవ్వు. అతను మూత్రపిండాలతోపాటు కాలేయం మీదున్న కొవ్వును కూడా వేరుచేస్తాడు. 16  యాజకుడు దాన్ని తీసుకొని ఆహారంగా* బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు. అది అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన. కొవ్వంతా యెహోవాకే ​చెందుతుంది.+ 17  “ ‘మీ నివాసాలన్నిట్లో మీరు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం ఇది: మీరు అసలు దేని కొవ్వునూ, దేని రక్తాన్నీ తినకూడదు.’ ”+

అధస్సూచీలు

లేదా “శాంతపర్చే.”
అక్ష., “రొట్టెగా,” అంటే, సమాధాన బలిలో దేవునికి చెందే భాగంగా.
అక్ష., “రొట్టెగా,” అంటే, సమాధాన బలిలో దేవునికి చెందే భాగంగా.
లేదా “శాంతపర్చే.”