లేవీయకాండం 2:1-16

  • ధాన్యార్పణ (1-16)

2  “ ‘ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ+ అర్పించాలనుకుంటే అతను మెత్తని పిండిని తీసుకురావాలి. అతను దానిమీద నూనె పోసి, దానిపైన సాంబ్రాణి పెట్టాలి.+  తర్వాత అతను దాన్ని యాజకులైన అహరోను కుమారుల దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు యాజకుడు పిడికెడు పిండిని, నూనెను, ఆ సాంబ్రాణి అంతటినీ తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తూ జ్ఞాపకార్థ* భాగంగా+ దాన్ని అర్పించాలి. ఇది అగ్నితో అర్పించే అర్పణ, యెహోవాకు ఇంపైన* సువాసన.  ధాన్యార్పణలో మిగిలిందంతా అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.+ అది అగ్నితో యెహోవాకు అర్పించే వాటిలోనిది, అతి పవిత్రమైనది.+  “ ‘ఒకవేళ నువ్వు పొయ్యిలో కాల్చిన వాటిని ధాన్యార్పణగా అర్పించాలనుకుంటే, అవి మెత్తని పిండితో చేసినవై ఉండాలి. అవి పులవని పిండితో చేసి నూనె కలిపిన భక్ష్యాలు* గానీ నూనె పూసిన అప్పడాలు గానీ అయ్యుండాలి.+  “ ‘ఒకవేళ నువ్వు పెనం మీద కాల్చిన వాటిని ధాన్యార్పణగా అర్పించాలనుకుంటే,+ అవి పులవని మెత్తని పిండిలో నూనె కలిపి చేసినవై ఉండాలి.  వాటిని ముక్కలుముక్కలుగా విరవాలి, నువ్వు వాటిమీద నూనె పోయాలి.+ ఇది ధాన్యార్పణ.  “ ‘ఒకవేళ నువ్వు మూకుడులో కాల్చిన వాటిని ధాన్యార్పణగా అర్పించాలనుకుంటే, అవి నూనె కలిపి మెత్తని పిండితో ​చేసినవై ఉండాలి.  వాటితో తయారుచేసిన ధాన్యార్పణను నువ్వు యెహోవా దగ్గరికి తీసుకురావాలి; దాన్ని నువ్వు యాజకునికి ఇవ్వాలి. అతను దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు.  యాజకుడు ధాన్యా​ర్పణలో నుండి కొంత జ్ఞాపకార్థ* భాగంగా ​తీసుకొని,+ బలిపీఠం మీద పొగ పైకిలే​చేలా దాన్ని కాలుస్తాడు. అది అగ్నితో అర్పించే అర్పణ, యెహోవాకు ఇంపైన* సువాసన.+ 10  ధాన్యార్పణలో మిగిలిందంతా అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. అది అగ్నితో యెహోవాకు అర్పించే వాటిలోనిది, అతి పవిత్రమైనది.+ 11  “ ‘పులిసిన దేన్నీ యెహోవాకు ధాన్యార్పణగా అర్పించకూడదు.+ యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా పులిసిన పిండిని గానీ తేనెను గానీ పొగ పైకిలేచేలా కాల్చకూడదు. 12  “ ‘నువ్వు వాటిని యెహోవాకు ప్రథమఫలాలుగా అర్పించవచ్చు,+ కానీ ఆయనకు ఇంపైన* సువాసనగా వాటిని బలిపీఠం మీద అర్పించకూడదు. 13  “ ‘నువ్వు అర్పించే ప్రతీ ధాన్యార్పణలో ఉప్పు కలపాలి; దేవుని ఒప్పందాన్ని* గుర్తుచేసే ఉప్పును నువ్వు నీ ధాన్యార్పణలన్నిట్లో ఖచ్చితంగా కలపాలి. నువ్వు అర్పించే ప్రతీ ధాన్యార్పణతో పాటు ఉప్పు అర్పించాలి.+ 14  “ ‘నువ్వు మొదట పండిన పంటలో నుండి యెహోవాకు ధాన్యార్పణను అర్పించాలనుకుంటే, కొత్త ధాన్యాన్ని* మంట మీద వేయించి, పైపైన దంచి తీసుకురావాలి. అది మొదట పండిన నీ పంటలో నుండి నువ్వు అర్పించే ధాన్యార్పణ.+ 15  నువ్వు దానిమీద నూనె పోసి, దానిపైన సాంబ్రాణి పెట్టాలి. ఇది ధాన్యార్పణ. 16  పైపైన దంచిన ఆ ధాన్యంలో కొంత భాగాన్ని, నూనెను, సాంబ్రాణి అంతటినీ తీసుకొని యాజకుడు పొగ పైకిలేచేలా జ్ఞాపకార్థ* భాగంగా దాన్ని కాలుస్తాడు.+ ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.

అధస్సూచీలు

లేదా “ప్రాతినిధ్య.”
లేదా “శాంతపర్చే.”
వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.
లేదా “ప్రాతినిధ్య.”
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
లేదా “నిబంధనను.”
లేదా “పచ్చని వెన్నుల్లోని గింజల్ని.”
లేదా “ప్రాతినిధ్య.”