లేవీయకాండం 11:1-47

  • పవిత్రమైన, అపవిత్రమైన జంతువులు (1-47)

11  తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు:  “ఇశ్రాయే​లీయులకు ఇలా చెప్పండి: ‘నేల మీద తిరిగే ప్రాణుల్లో వీటిని మీరు తినొచ్చు:+  పూర్తిగా చీలిన డెక్క* ఉండి, నెమరు వేసే ప్రతీ జంతువును మీరు తినొచ్చు.  “ ‘పూర్తిగా చీలిన డెక్క ఉన్న జంతువుల్లో లేదా నెమరు వేసే జంతువుల్లో వీటిని మీరు తినకూడదు: ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి చీలిన డెక్క ఉండదు. అది మీకు అపవిత్రమైనది.+  పొట్టి కుందేలు*+ నెమరు వేస్తుంది కానీ దానికి చీలిన డెక్క ఉండదు. అది మీకు అపవిత్రమైనది.  చెవుల పిల్లి నెమరు వేస్తుంది కానీ దానికి చీలిన డెక్క ఉండదు. అది మీకు అపవిత్రమైనది.  పందిని+ కూడా మీరు ​తినకూడదు. దానికి చీలిన డెక్క ఉంటుంది కానీ అది నెమరు వేయదు. అది మీకు అపవిత్రమైనది.  వాటిలో దేని మాంసాన్నీ మీరు ​తినకూడదు, వాటి కళేబరాల్ని ముట్టకూడదు. అవి మీకు అపవిత్రమైనవి.+  “ ‘నీళ్లలో ఉండే వాటన్నిట్లో వీటిని మీరు తినొచ్చు: సముద్రంలో గానీ నదుల్లో గానీ రెక్క​లు-పొలుసులు ఉన్న దేన్నైనా మీరు తినొచ్చు.+ 10  అయితే సముద్రంలో, నదుల్లో గుంపులుగుంపులుగా తిరిగే వాటిలో, అలాగే నీళ్లలో తిరిగే ఇతర ప్రాణులన్నిట్లో రెక్కలు-పొలుసులు లేనివి మీకు అసహ్యకరమైనవి. 11  అవును వాటిని మీరు అసహ్యించుకోవాలి, వాటిలో దేని మాంసాన్నీ మీరు తినకూడదు,+ వాటి కళేబ​రాల్ని మీరు అసహ్యించుకోవాలి. 12  నీళ్లలో తిరిగే వాటిలో రెక్కలు-పొలుసులు లేని ప్రతీది మీకు అసహ్యకరమైనది. 13  “ ‘ఎగిరే ప్రాణుల్లో వీటిని మీరు అసహ్యించుకోవాలి, వీటిని మీరు తినకూడదు, ఎందుకంటే ఇవి అసహ్యకరమైనవి: గద్ద,+ బోరువ, నల్ల రాబందు,+ 14  ఎర్ర గద్ద, ప్రతీ రకమైన నల్ల గద్ద, 15  ప్రతీ రకమైన కాకి, 16  నిప్పుకోడి, గుడ్లగూబ, సముద్రపక్షి,* ప్రతీ రకమైన డేగ, 17  చిన్న గుడ్లగూబ, చెరువుకాకి, పొడుగు చెవుల గుడ్లగూబ, 18  హంస, గూడబాతు,* రాబందు, 19  సంకుబుడి కొంగ, ప్రతీ రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలం. 20  రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో గుంపులుగుంపులుగా తిరిగే ప్రతీ ప్రాణి* మీకు అసహ్యకరమైనది. 21  “ ‘రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో గుంపులుగుంపులుగా తిరిగే ప్రాణుల్లో, గెంతడం కోసం పాదాలకు పైన కీళ్లున్న వాటిని మాత్రం మీరు తినొచ్చు. 22  వాటిలో ఇవి మీరు తినొచ్చు: వలస వెళ్లే రకరకాల మిడతలు, మామూలు మిడతలు,+ కీచురాళ్లు, గొల్లభామలు. 23  అయితే రెక్కలూ, నాలుగు కాళ్లూ ఉండి గుంపులుగుంపులుగా తిరిగే మిగతా ప్రాణులన్నీ మీకు అసహ్య​కరమైనవి. 24  వీటివల్ల మీరు అపవిత్రులౌతారు. వాటి కళేబరాల్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 25  వాటిలో దేని కళేబరాలనైనా మోసుకెళ్లే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి;+ అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 26  “ ‘పూర్తిగా చీలిన డెక్క లేని, నెమరు వేయని ప్రతీ జంతువు మీకు ​అపవిత్రమైనదే. వాటిని ముట్టుకునే ప్రతీ వ్యక్తి అపవిత్రుడౌతాడు.+ 27  నాలుగు కాళ్లతో నడిచే ప్రాణుల్లో ఏవైతే పంజాలతో నడుస్తాయో అవన్నీ మీకు అపవిత్రమైనవి. వాటి కళేబరాల్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 28  వాటి కళేబరాల్ని మోసుకెళ్లే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి.+ అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ అవి మీకు అపవిత్రమైనవి. 29  “ ‘నేలమీద పాకే ప్రాణుల్లో ఇవి మీకు అపవిత్రమైనవి: చిన్న పందికొక్కు, గెంతే ఎలుక,+ ప్రతీ రకమైన బల్లి, 30  గెకో బల్లి, ఉడుము, నీటి ఉడుము,* సరటము, ఊసరవెల్లి. 31  ఇవి మీకు అపవిత్రమైనవి.+ వాటి కళేబరాల్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 32  “ ‘అవి చచ్చి ఏ వస్తువు మీదైనా పడితే, అది చెక్కపాత్ర గానీ, వస్త్రం గానీ, తోలు గానీ, గోనెపట్ట గానీ అది అపవిత్రమౌతుంది. రోజూ వాడుకునే వస్తువుల్లో దేనిమీదైనా అవి పడితే ఆ వస్తువును నీళ్లలో ముంచాలి. అది సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటుంది, తర్వాత పవిత్రమౌతుంది. 33  అవి మట్టిపాత్రలో పడితే, ఆ పాత్రను పగలగొట్టాలి, దానిలో ఉన్నదేదైనా ​అపవిత్రమౌతుంది.+ 34  అలాంటి పాత్రలోని నీళ్లు ఏదైనా ఆహారం మీద పడితే ఆ ఆహారం ​అపవిత్రమౌతుంది, అలాంటి పాత్రలో ఉన్న పానీయం ఏదైనా అది అపవిత్రమైనదే. 35  వాటి కళేబరాలు దేనిమీద పడినా అది అపవిత్రమౌతుంది. అది పొయ్యి అయినా, కుంపటి అయినా దాన్ని ముక్కలుముక్కలుగా పగలగొట్టాలి. అవి అపవిత్రమైనవి, అవి మీకు అపవిత్రమైనవిగానే ఉంటాయి. 36  ఊటలు,* నీళ్లు నిల్వ చేసే గుంటలు మాత్రం అవి పడినా పవిత్రంగానే ఉంటాయి. అయితే ఆ కళేబరాల్ని ముట్టుకునే వ్యక్తి అపవిత్రుడౌతాడు. 37  ఒకవేళ నాటాల్సిన విత్తనాల మీద వాటి కళేబరాలు పడితే, ఆ విత్తనాలు అపవిత్రం అవ్వవు. 38  కానీ నానబెట్టిన విత్తనాల మీద వాటి ​కళేబరంలో కొంచెం పడినా, అవి అపవిత్రమౌతాయి. 39  “ ‘తినదగిన జంతువు ఏదైనా చనిపోతే, దాని కళేబరాన్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 40  దాని కళేబరంలో కొంచెమైనా తినే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి, అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ దాని కళేబరాన్ని మోసుకెళ్లే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి, అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 41  నేలమీద పాకే ప్రతీ ప్రాణి మీకు అసహ్యకరమైనది.+ దాన్ని మీరు తినకూడదు. 42  పొట్టతో పాకే ఏ ప్రాణినీ, నాలుగు కాళ్లతో కదిలే ఏ ప్రాణినీ, చాలా కాళ్లతో నేలమీద తిరిగే ఏ ప్రాణినీ మీరు తినకూ​డదు. ఎందుకంటే అవి అసహ్యకరమైనవి.+ 43  పాకే ఏ ప్రాణి వల్లా మీరు అసహ్యకరంగా తయారవ్వకండి, మిమ్మల్ని మీరు మలినపర్చు​కోకండి, ​అపవిత్రులు కాకండి.+ 44  ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను,+ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని పవిత్రులు అవ్వండి,+ ​ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.+ నేల మీద పాకే ఏ ప్రాణి వల్లా మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకోకండి. 45  ఎందుకంటే మీకు దేవునిగా ​ఉండడానికి ఐగుప్తు* దేశం నుండి మిమ్మల్ని ​బయటికి నడిపిస్తున్న యెహోవాను నేనే.+ మీరు పవిత్రులుగా ఉండాలి,+ ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.+ 46  “ ‘జంతువుల గురించిన, ఎగిరే ప్రాణుల గురించిన, నీళ్లలో తిరిగే ప్రతీ ప్రాణి గురించిన, నేలమీద పాకే ప్రతీ ప్రాణి గురించిన నియమం ఇదే. 47  ఈ నియమం పవిత్రమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని; తినదగిన ప్రాణుల్ని, తినకూడని ప్రాణుల్ని వేరుచేయడానికి ఉపయోగపడుతుంది.’ ”+

అధస్సూచీలు

లేదా “గిట్ట.”
అంటే, రాక్‌ బ్యాడ్జర్‌.
అంటే, సీ-గల్‌.
అంటే, పెలికన్‌.
లేదా “పురుగు.”
లేదా “నలికండ్లపాము లాంటిది.”
లేదా “బావులు.”
లేదా “ఈజిప్టు.”