యోబు 9:1-35

  • యోబు జవాబు (1-35)

    • మనిషి దేవునితో పోరాడలేడు (2-4)

    • ‘దేవుడు పరిశోధించలేని వాటిని చేస్తాడు’ (10)

    • దేవునితో ఎవరూ వాదించలేరు (32)

9  అప్పుడు యోబు ఇలా అన్నాడు:  2  “అది నిజమని నాకు తెలుసు. కానీ దేవుని ముందు మనిషి ఎలా నిర్దోషిగా ఉండగలడు?+  3  ఎవరైనా ఆయనతో వాదించాలని అనుకుంటే,*+ఆయన వేసే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అతను జవాబివ్వలేడు.  4  ఆయన తెలివిగలవాడు,* మహా శక్తిమంతుడు.+ ఆయన్ని ఎదిరించి దెబ్బతినని వాళ్లెవరు?+  5  ఆయన పర్వతాల్ని కదిలిస్తాడు,* అయినా ఆ సంగతి ఎవ్వరికీ తెలీదు;కోపంతో వాటిని తలకిందులు చేస్తాడు.  6  ఆయన భూమిని కుదిపేసి దాని స్థానం నుండి కదిలిస్తాడు,దాని పునాదులు ఊగిపోయేలా చేస్తాడు.+  7  ప్రకాశించవద్దని సూర్యునికి ఆజ్ఞాపిస్తాడు,నక్షత్రాలు కనబడకుండా చేస్తాడు;+  8  ఆయనే స్వయంగా ఆకాశాన్ని పరుస్తున్నాడు,+సముద్రంలోని ఎత్తైన అలల్ని తొక్కుతున్నాడు.+  9  యాష్‌,* కెసిల్‌,* కిమా* నక్షత్రరాశుల్ని,+దక్షిణ నక్షత్రరాశుల్ని ఆయనే చేశాడు; 10  ఆయన గొప్పవాటిని, పరిశోధించలేని వాటిని,+లెక్కలేనన్ని అద్భుత కార్యాల్ని చేస్తాడు.+ 11  ఆయన నా పక్క నుండి వెళ్తాడు, కానీ నేను ఆయన్ని చూడలేను;నన్ను దాటి వెళ్తాడు, కానీ నేను గమనించలేను. 12  ఆయన దేన్నైనా లాక్కున్నప్పుడు, ఎవరు అడ్డుకోగలరు? ‘నువ్వేం చేస్తున్నావు?’ అని ఆయనతో ఎవరు అనగలరు?+ 13  దేవుడు తన కోపాన్ని అణుచుకోడు;+రాహాబుకు*+ సహాయం చేసేవాళ్లు కూడా ఆయనకు వంగి నమస్కారం చేస్తారు. 14  అలాంటిది నేను ఆయనకు జవాబిస్తున్నప్పుడుఆయనతో వాదించడానికి ఇంకెంత జాగ్రత్తగా నా మాటల్ని ఎంచుకోవాలి! 15  ఒకవేళ నేను నిర్దోషినే అయినా, ఆయనకు జవాబిచ్చే సాహసం చేయను.+ కరుణ చూపించమని మాత్రమే నా న్యాయమూర్తిని* వేడుకోగలను. 16  నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన నాకు జవాబిస్తాడా? ఆయన నా స్వరాన్ని వింటాడనే నమ్మకం నాకు లేదు. 17  ఎందుకంటే, ఆయన తుఫానుతో నన్ను నలగ్గొడుతున్నాడు,ఏ కారణం లేకుండానే నా గాయాల్ని ఎక్కువ చేస్తున్నాడు.+ 18  ఆయన నాకు ఊపిరాడనివ్వట్లేదు;నన్ను కష్టాలతో ముంచెత్తుతున్నాడు. 19  విషయం శక్తి గురించైతే, ఆయనే బలవంతుడు.+ ఒకవేళ విషయం న్యాయం గురించైతే, ఆయన ‘నన్ను లెక్క అడిగేవాళ్లు ఎవరు?’* అని అంటాడు. 20  ఒకవేళ నేను సరిగ్గా ఉన్నా, నా నోరే నన్ను ఖండిస్తుంది;నేను నా యథార్థతను కాపాడుకున్నా,* ఆయన నన్ను దోషిగా ప్రకటిస్తాడు. 21  నేను నా యథార్థతను కాపాడుకున్నా,* నాకు ఏం జరుగుతుందో నాకు తెలీదు;ఈ జీవితం నాకొద్దు.* 22  ఏం తేడా లేదు, అంతా ఒక్కటే.అందుకే నేను, ‘ఆయన నిర్దోషుల్ని,* దుష్టుల్ని ఒకేలా నాశనం చేస్తాడు’ అంటున్నాను. 23  అకస్మాత్తుగా వరద ముంచుకొచ్చి నాశనం చేస్తే,నిర్దోషుల కష్టాన్ని చూసి ఆయన నవ్వుతాడు. 24  భూమి చెడ్డవాళ్ల చేతికి అప్పగించబడింది;+ఆయన దాని న్యాయమూర్తుల కళ్లకు గంతలు కడతాడు. ఆయన కాకపోతే ఇంకెవరు అలా చేయగలరు? 25  నా రోజులు, పరుగెత్తేవాడి కన్నా వేగంగా గడిచిపోతున్నాయి;+ఏ మంచీ చూడకుండానే అవి గతించిపోతున్నాయి. 26  రెల్లు పడవల్లా, ఎర మీదికి దూసుకొచ్చే గద్దల్లాఅవి వేగంగా సాగిపోతున్నాయి. 27  ఒకవేళ నేను, ‘నా దుఃఖాన్ని మర్చిపోతాను,నా ముఖం బాధగా పెట్టుకోకుండా సంతోషంగా ఉంటాను’ అని అనుకుంటే 28  అప్పటికీ నా బాధలన్నిటిని బట్టి నేను భయపడుతూ ఉంటాను,+నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవని నాకు తెలుసు. 29  నేను దోషిగా* ఎంచబడతాను. అలాంటప్పుడు, నేను ఎందుకు వృథాగా ప్రయాసపడాలి?+ 30  కరిగే మంచుతో నన్ను నేను శుభ్రం చేసుకున్నా,సబ్బుతో నా చేతులు కడుక్కున్నా,+ 31  నువ్వు నన్ను బురద గుంటలో ముంచుతావు,అప్పుడు నా బట్టలు కూడా నన్ను అసహ్యించుకుంటాయి. 32  నేను ఆయనకు జవాబివ్వడానికి,ఇద్దరం కలిసి న్యాయస్థానానికి వెళ్లడానికి ఆయన నాలా మనిషి కాదు.+ 33  మాకు న్యాయమూర్తిగా ఉండి,మా మధ్య న్యాయం తీర్చేవాళ్లు* ఎవరూ లేరు. 34  ఆయన నన్ను కొట్టడం ఆపేస్తే,ఆయన గురించిన భయం నన్ను బెదరగొట్టకుండా ఉంటే,+ 35  నేను నిర్భయంగా ఆయనతో మాట్లాడతాను,ఎందుకంటే, నేను భయపడుతూ మాట్లాడేవాణ్ణి కాదు.

అధస్సూచీలు

లేదా “ఆయన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లాలని అనుకుంటే.”
అక్ష., “హృదయంలో తెలివిగలవాడు.”
లేదా “తీసేస్తాడు.”
పెద్ద ఎలుగుబంటి (అర్స మేజర్‌) నక్షత్రరాశి కావచ్చు.
మృగశీర్ష నక్షత్రరాశి కావచ్చు.
వృషభ నక్షత్రరాశిలోని సప్తఋషి నక్షత్రాలు కావచ్చు.
ఒక భారీ సముద్రప్రాణి కావచ్చు.
లేదా “నా ప్రత్యర్థిని” అయ్యుంటుంది.
లేదా “న్యాయస్థానానికి రమ్మనేవాళ్లు ఎవరు?”
లేదా “ఒకవేళ నేను నిర్దోషినైనా.”
లేదా “ఒకవేళ నేను నిర్దోషినైనా.”
లేదా “నాకు అసహ్యం.”
లేదా “యథార్థతను కాపాడుకునేవాళ్లను.”
అక్ష., “దుష్టుడిగా.”
లేదా “మధ్యవర్తి.”