యోబు 8:1-22

  • బిల్దదు మొదటిసారి మాట్లాడడం (1-22)

    • యోబు కుమారులు పాపం చేశారని ​ఆరోపించడం (4)

    • ‘నువ్వు స్వచ్ఛంగా జీవించివుంటే దేవుడు నిన్ను కాపాడతాడు’ (6)

    • యోబు భక్తిహీనుడని ఆరోపించడం (13)

8  అప్పుడు షూహీయుడైన+ బిల్దదు+ ఇలా అన్నాడు:  2  “ఎంతసేపు నువ్విలా మాట్లాడుతూ ఉంటావు?+ నీ నోటి మాటలు సుడిగాలి లాంటివి!*  3  దేవుడు న్యాయాన్ని పక్కదారి పట్టిస్తాడా?సర్వశక్తిమంతుడు నీతిని తారుమారు చేస్తాడా?  4  ఒకవేళ నీ పిల్లలు* ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశారేమో,అందుకే ఆయన వాళ్ల తిరుగుబాటును బట్టి వాళ్లను శిక్షించాడు;  5  అయితే ఇప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తే,+దయ చూపించమని సర్వశక్తిమంతుణ్ణి వేడుకుంటే,  6  నిజంగా నువ్వు స్వచ్ఛంగా, నిజాయితీగా జీవించివుంటే,+ఆయన నీ మీద దృష్టిపెడతాడు,మళ్లీ నిన్ను సరైన స్థానంలో ఉంచుతాడు.  7  నీ ఆరంభం చిన్నగా ఉన్నానీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది.+  8  దయచేసి, ముందటి తరంవాళ్లను అడిగిచూడు,వాళ్ల తండ్రులు కనుగొన్న వాటిమీద దృష్టిపెట్టు.+  9  ఎందుకంటే, మనం కేవలం నిన్న గాక మొన్న పుట్టినవాళ్లం, మనకేమీ తెలీదు,భూమ్మీద మన రోజులు నీడ లాంటివి. 10  వాళ్లు నీకు ఉపదేశించరా?తమకు తెలిసినవాటిని నీకు చెప్పరా? 11  చిత్తడినేల లేని చోట జమ్ము,* నీళ్లులేని చోట రెల్లు ఏపుగా పెరుగుతాయా? 12  అది మొగ్గ దశలో ఉండగానే, ఇంకా కోయక ముందే,మిగతా మొక్కల కన్నా త్వరగా ఎండిపోతుంది. 13  దేవుణ్ణి మర్చిపోయే వాళ్లందరికీ అదే గతి పడుతుంది,భక్తిహీనుల* ఆశ నశించిపోతుంది. 14  వాళ్ల నమ్మకం వమ్ము అవుతుంది,అది సాలెగూడు అంత బలహీనమైనది. 15  అతను తన ఇంటిమీద ఆనుకుంటాడు, కానీ అది నిలవదు;దానిమీద ఒరుగుతాడు, కానీ అది కూలిపోతుంది. 16  అతను ఎండలో ఉన్న పచ్చని మొక్కలాంటివాడు,అతని కొమ్మలు తోటంతా వ్యాపిస్తాయి.+ 17  అతని వేళ్లు రాళ్లకుప్పలో పెనవేసుకుంటాయి;అతను రాళ్ల మధ్య ఒక ఇల్లు కోసం* చూస్తాడు. 18  కానీ అతను తన స్థలంలో నుండి పీకేయబడినప్పుడు,ఆ స్థలం, ‘నేను నిన్నెప్పుడూ చూడలేదు’+ అంటూ అతన్ని తిరస్కరిస్తుంది. 19  అవును, అతను అలా మాయమైపోతాడు;+తర్వాత వేరేవాళ్లు ధూళిలో నుండి పైకిలేస్తారు. 20  ఖచ్చితంగా, దేవుడు యథార్థవంతుల్ని* తిరస్కరించడు;ఆయన చెడ్డవాళ్లకు మద్దతివ్వడు, 21  చివరికి ఆయన నీ నోటిని నవ్వుతో,నీ పెదాలను ఆనంద ధ్వనులతో నింపుతాడు. 22  నిన్ను ద్వేషించేవాళ్లు సిగ్గుపడతారు,దుష్టుల డేరా ఇక ఉండదు.”

అధస్సూచీలు

లేదా “వ్యర్థమైనవి.”
అక్ష., “కుమారులు.”
లేదా “పపైరస్‌.”
లేదా “మతభ్రష్టుల.”
లేదా “రాళ్ల ఇంటి వైపు.”
లేదా “నిందలేనివాళ్లను.”