యోబు 5:1-27
5 “దయచేసి వేడుకో! నీకు జవాబిచ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారా?
సహాయం కోసం పవిత్రుల్లో ఎవరివైపు నువ్వు తిరుగుతావు?
2 చిరాకు తెలివితక్కువవాణ్ణి,ఈర్ష్య వివేకంలేనివాణ్ణి చంపుతుంది.
3 తెలివితక్కువవాడు వర్ధిల్లడం నేను చూశాను,అయితే హఠాత్తుగా అతని నివాసం శపించబడింది.
4 అతని కుమారులు ఏమాత్రం సురక్షితంగా ఉండరు,వాళ్లు నగర ద్వారం దగ్గర నలగ్గొట్టబడతారు,+ వాళ్లను రక్షించేవాళ్లు ఎవ్వరూ ఉండరు.
5 ఆకలితో ఉన్నవాళ్లు అతని పంటను తింటారు,ముళ్లకంపల్లో నుండి కూడా దాన్ని తీసుకుంటారు,అతని సంపదల్ని వేరేవాళ్లు లాక్కుంటారు.
6 ఎందుకంటే, హానికరమైనవి మట్టిలో నుండి రావు,కష్టాలు నేలలో నుండి మొలకెత్తవు.
7 నిప్పురవ్వలు పైకి లేవడం ఎంత నిజమో,మనిషి కష్టాల కోసమే పుట్టాడన్నది కూడా అంతే నిజం.
8 నేనే గనుక నీ స్థానంలో ఉంటే, దేవునికి మొరపెట్టుకుంటాను,ఆయనకే నా వ్యాజ్యాన్ని అప్పగిస్తాను.
9 ఆయన గొప్పవాటిని, పరిశోధించలేని వాటిని,లెక్కలేనన్ని ఆశ్చర్యకార్యాల్ని చేస్తాడు.
10 ఆయన భూమికి వర్షాన్ని ఇస్తాడు,పొలాల్లోకి నీళ్లు పంపుతాడు.
11 దీనుల్ని పైకి లేపుతాడు,నిరాశలో ఉన్నవాళ్లను రక్షణతో హెచ్చిస్తాడు.
12 వంచకుల పన్నాగాల్ని భగ్నం చేసి,వాళ్ల పనులు సఫలం కాకుండా చూస్తాడు.
13 ఆయన, తెలివిగలవాళ్లు తమ కుయుక్తిలో తామే చిక్కుకునేలా చేస్తాడు,+అలా యుక్తిగలవాళ్ల పన్నాగాల్ని తలకిందులు చేస్తాడు.
14 వాళ్లకు పగలే చీకటిలా ఉంటుంది,రాత్రివేళ తడవులాడినట్టు వాళ్లు పట్టపగలు తడవులాడతారు.
15 ఖడ్గాల్లాంటి వాళ్ల నాలుకల నుండి ఆయనే కాపాడతాడు,బలవంతుల చేతిలో నుండి పేదవాళ్లను రక్షిస్తాడు,
16 అలా దీనుల్లో ఆశ చిగురింపజేస్తాడు,అనీతిమంతుల నోళ్లు మూతపడతాయి.
17 దేవుడు గద్దించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు;కాబట్టి సర్వశక్తిమంతుడు ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించకు!
18 ఆయన గాయపరుస్తాడు, అయితే కట్టు కూడా కడతాడు;ఆయన విరగ్గొడతాడు, కానీ స్వయంగా తన చేతులతోనే బాగుచేస్తాడు.
19 ఆరు విపత్తుల నుండి ఆయన నిన్ను కాపాడతాడు,ఏడవది కూడా నీకు ఏ హానీ చేయదు.
20 కరువు వచ్చినప్పుడు ఆయన నిన్ను చనిపోకుండా కాపాడతాడు,*యుద్ధ సమయంలో ఖడ్గం నుండి రక్షిస్తాడు.
21 కొరడా లాంటి నాలుక+ నుండి నువ్వు కాపాడబడతావు,విపత్తు వచ్చినప్పుడు నువ్వు భయపడవు.
22 నాశనాన్ని, ఆకలిని చూసి నువ్వు నవ్వుతావు,అడవి జంతువులకు నువ్వు భయపడవు.
23 పొలంలోని రాళ్లు నీకు హాని చేయవు,*అడవి జంతువులు నీతో శాంతిగా ఉంటాయి.
24 నువ్వు నీ డేరా సురక్షితంగా* ఉందనే ధైర్యంతో ఉంటావు,నీ మందను పరిశీలించినప్పుడు వాటిలో ఏ ఒక్కటీ తక్కువ కాదు.
25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు,నీ వంశస్థులు భూమ్మీది పచ్చికలా విస్తరిస్తారు.
26 సకాలంలో సమకూర్చిన ధాన్యపు పనల్లా*నువ్వు సమాధికి చేరుకున్నప్పుడు కూడా బలంగానే ఉంటావు.
27 చూడు! మేము దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాం, ఇది వాస్తవం.
విని అర్థం చేసుకో.”
అధస్సూచీలు
^ అక్ష., “మరణం నుండి విడిపిస్తాడు.”
^ లేదా “నీతో ఒప్పందం చేసుకుంటాయి.”
^ అక్ష., “శాంతిగా.”
^ లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్లా.”