యోబు 41:1-34

  • దేవుడు అద్భుతమైన లివ్యాతన్‌ను ​వర్ణించడం (1-34)

41  “చేపలు పట్టే గాలంతో నువ్వు లివ్యాతన్‌ను*+ పట్టుకోగలవా?దాని నాలుకను తాడుతో కట్టేయగలవా?   దానికి ముక్కుతాడు వేయగలవా?దాని దవడలకు కొక్కెం తగిలించగలవా?   అది నీకు పదేపదే మొరపెట్టుకుంటుందా?నీతో మృదువుగా మాట్లాడుతుందా?   జీవితాంతం నీకు బానిసగా ఉండేలానీతో ఒప్పందం చేసుకుంటుందా?   నువ్వు పక్షితో ఆడుకున్నట్టు దానితో ఆడుకోగలవా?నీ కూతుళ్లు ఆడుకోవడం కోసం దాన్ని కట్టేయగలవా?   జాలర్లు దానితో వ్యాపారం చేస్తారా? దాన్ని ముక్కలుముక్కలు చేసి వ్యాపారులకు అమ్ముతారా?   నువ్వు దాని చర్మం నిండా ఈటెలు గుచ్చగలవా?+దాని తలను బల్లెంతో పొడవగలవా?   దాని మీద చెయ్యి వేసి చూడు;దానితో పోరాటం గుర్తొచ్చి, ఇంకోసారి అలా చేయవు!   దాన్ని లొంగదీసుకోవచ్చని అనుకోవడం వృథా. దాన్ని చూస్తేనే నువ్వు కింద పడిపోతావు. 10  దాన్ని రెచ్చగొట్టే సాహసం ఎవరూ చేయరు. మరి, నా ముందు నిలబడే ధైర్యం ఎవరికుంది?+ 11  నేను తిరిగి ఇవ్వడానికి, ముందుగా ఎవరైనా ఏదైనా నాకు ఇచ్చారా?+ ఆకాశం కింద ఉన్నదంతా నాదే.+ 12  దాని కాళ్ల గురించి, దాని గొప్ప బలం గురించి,అద్భుతంగా రూపించబడిన దాని శరీరం గురించి నేను మాట్లాడకుండా ఉండలేను. 13  దాని కవచాన్ని ఎవరు ఊడదీయగలరు? దాని దవడల మధ్యకు ఎవరు వెళ్లగలరు? 14  దాని నోటి తలుపుల్ని ఎవరు తెరిచి చూడగలరు? నోటి నిండా ఉన్న దాని పళ్లు భయం పుట్టిస్తాయి. 15  దాని వీపు మీద దగ్గరదగ్గరగా పొలుసుల వరుసలు ఉంటాయి.* 16  అవి గాలి కూడా దూరలేనంత దగ్గరదగ్గరగా ఉంటాయి. 17  అవి ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి;అవి గట్టిగా పట్టుకొని ఉంటాయి, వాటిని విడదీయడం అసాధ్యం. 18  అది తుమ్మినప్పుడు వెలుగును వెదజల్లుతుంది,దాని కళ్లు వేకువ కిరణాల్లాంటివి. 19  దాని నోటి నుండి మంటలు వస్తాయి;నిప్పురవ్వలు ఎగసిపడతాయి. 20  కొలిమిలో గడ్డిని వేస్తే వచ్చినట్టుదాని ముక్కు రంధ్రాల నుండి పొగ వస్తుంది. 21  దాని ఊపిరికి బొగ్గులు మండుతాయి,దాని నోటి నుండి అగ్ని జ్వాల వస్తుంది. 22  దాని మెడ చాలా బలంగా ఉంటుంది,దాని ముందు ఉన్న వాళ్లు భయంతో హడలిపోతారు. 23  దాని చర్మం ముడతలు చాలా బిగుతుగా ఉంటాయి;అవి పోతపోసినట్టు కదలకుండా స్థిరంగా ఉంటాయి. 24  దాని గుండె రాయి అంత గట్టిగా ఉంటుంది,అవును, తిరుగలి దిమ్మ అంత గట్టిగా ఉంటుంది. 25  అది లేచినప్పుడు బలవంతులు కూడా భయపడిపోతారు;అది నీళ్లలో వేగంగా కదిలినప్పుడు అయోమయంలో పడిపోతారు. 26  దాని దగ్గరికి వచ్చే ఖడ్గం గానీ, ఈటె గానీ, బల్లెం గానీ, బాణం గానీ దాన్ని ఏమీ చేయలేవు.+ 27  అది ఇనుమును గడ్డిపోచలా,రాగిని కుళ్లిన చెక్కలా చూస్తుంది. 28  బాణాన్ని చూసి అది పారిపోదు;అది వడిసెల రాళ్లను గడ్డి దుబ్బులా చూస్తుంది. 29  దుడ్డుకర్రను గడ్డిపరకలా ఎంచుతుంది,ఈటె శబ్దాన్ని చూసి నవ్వుతుంది. 30  దాని కింది భాగం, గరుకైన కుండ పెంకుల్లా ఉంటుంది;అది నూర్చే పనిముట్టులా+ బురదలో చాచుకుని పడుకుంటుంది. 31  అది లోతైన నీళ్లను పాత్రలోని నీళ్లలా మరిగిస్తుంది;సముద్రాన్ని నూనె పాత్రలా నురగలు కక్కేలా చేస్తుంది. 32  అది వెళ్లినప్పుడు ఆ దారంతా నురగలమయం అవుతుంది. చూసేవాళ్లకు లోతైన నీళ్లకు తెల్ల వెంట్రుకలు ఉన్నట్టు కనిపిస్తుంది. 33  భూమ్మీద దాని లాంటిది ఏదీ లేదు,అది భయంలేని ప్రాణిగా తయారుచేయబడింది. 34  పొగరుబోతు జంతువుల్ని అది లెక్కచేయదు. బలమైన అడవి జంతువులన్నిటికీ అది రాజు.”

అధస్సూచీలు

మొసలి కావచ్చు.
లేదా “పొలుసుల వరుసల్ని బట్టి అది గర్విస్తుంది” అయ్యుంటుంది.