యోబు 40:1-24

  • యెహోవా అడిగిన మరికొన్ని ప్రశ్నలు (1-24)

    • తాను ఏమీ చెప్పలేనని యోబు ఒప్పుకున్నాడు (3-5)

    • “నా న్యాయాన్ని నువ్వు ప్రశ్నిస్తావా?” (8)

    • దేవుడు బహేమోత్‌ బలాన్ని ​వర్ణించడం (15-24)

40  యెహోవా యోబుతో ఇంకా ఇలా అన్నాడు:  2  “తప్పులు పట్టేవాడు సర్వశక్తిమంతునితో పోరాడవచ్చా?+ దేవుణ్ణి సరిదిద్దాలని అనుకుంటున్నవాడు ఇప్పుడు జవాబివ్వాలి.”+  3  అప్పుడు యోబు యెహోవాతో ఇలా అన్నాడు:  4  “ఇదిగో! నేను అల్పుణ్ణి.+ నేను నీకు ఏం జవాబు ఇవ్వగలను? నా నోటి మీద చెయ్యి పెట్టుకుంటున్నాను.+  5  నేను ఒక్కసారి మాట్లాడాను, ఇక మాట్లాడను;రెండుసార్లు మాట్లాడాను, మళ్లీ నోరెత్తను.”  6  అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నాడు:+  7  “ఓ మనిషీ, దయచేసి నీ నడుం కట్టుకో;నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబివ్వు.+  8  నా న్యాయాన్ని నువ్వు ప్రశ్నిస్తావా? నువ్వు నిర్దోషివని అనిపించుకోవడానికి నామీద నేరం మోపుతావా?+  9  సత్యదేవునికి ఉన్నంత శక్తిమంతమైన బాహువు నీకుందా?+నీ స్వరం ఆయన స్వరంలా గర్జించగలదా?+ 10  దయచేసి ఘనతా వైభవాలతో నిన్ను నువ్వు అలంకరించుకో;మహిమను, తేజస్సును వస్త్రంలా ధరించుకో. 11  నీ ఉగ్రతను కుమ్మరించు;ప్రతీ అహంకారిని గమనించి కిందికి దించు. 12  గర్విష్ఠులందర్నీ గమనించి, వాళ్లను అణచివేయి,దుష్టుల్ని వాళ్లు నిల్చున్న చోటే తొక్కేసెయ్యి. 13  వాళ్లందర్నీ మట్టిలో పాతిపెట్టు;చీకటి స్థలంలో వాళ్లను కట్టిపడెయ్యి, 14  అప్పుడు, నీ కుడిచెయ్యి నిన్ను కాపాడగలదనినేను కూడా ఒప్పుకుంటాను.* 15  బహేమోత్‌ను* చూడు! నిన్ను చేసినట్టే నేను దాన్నీ చేశాను. ఎద్దులా అది గడ్డి తింటుంది. 16  దాని తుంట్లలో ఉన్న బలాన్ని,దాని కడుపు కండరాల్లో ఉన్న శక్తిని చూడు! 17  అది దేవదారు కొమ్మలా దాని తోకను వంచుతుంది;దాని తొడ నరాలు అల్లుకుపోయి ఉంటాయి. 18  దాని ఎముకలు రాగి గొట్టాలు;దాని కాళ్లు ఇనుప* కడ్డీలు. 19  దేవుడు చేసిన వాటిలో అది మొదటి స్థానంలో ఉంది;*దాని సృష్టికర్త మాత్రమే ఖడ్గంతో దాని దగ్గరికి వెళ్లగలడు. 20  పర్వతాలు దానికోసం ఆహారం పండిస్తాయి,అక్కడ అడవి జంతువులన్నీ ఆడుకుంటాయి. 21  అది తామర మొక్కల కింద పడుకుంటుంది,చిత్తడినేలలో జమ్ముగడ్డి మధ్య విశ్రమిస్తుంది. 22  తామర మొక్కలు దానికి నీడనిస్తాయి,లోయలోని* నిరవంజి చెట్లు దాని చుట్టూ ఉంటాయి. 23  నది ఉధృతంగా ప్రవహించినా అది భయపడదు. యొర్దాను నది+ ఉప్పొంగి, దానిమీద విరుచుకుపడినా అది బెదరదు. 24  అది చూస్తుండగా ఎవరైనా దాన్ని పట్టుకోగలరా?దాని ముక్కుకు కొక్కెం తగిలించగలరా?

అధస్సూచీలు

లేదా “నిన్ను మెచ్చుకుంటాను.”
నీటిగుర్రం కావచ్చు.
లేదా “చేత ఇనుప.”
అక్ష., “మొదటిది.”
లేదా “వాగు దగ్గరి.”