యోబు 4:1-21

  • ఎలీఫజు మొదటిసారి మాట్లాడడం (1-21)

    • అతను యోబు యథార్థతను హేళన చేశాడు (7, 8)

    • అతను ఒక అదృశ్యశక్తి సందేశాన్ని చెప్పాడు (12-17)

    • ‘దేవుడు తన సేవకుల్ని నమ్మడు’ (18)

4  అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు+ ఇలా అన్నాడు:   “ఎవరైనా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నువ్వు అసహనానికి గురౌతావా? అయినా, మాట్లాడకుండా ఎవరు ఉండగలరు?   నిజమే, నువ్వు చాలామందిని సరిదిద్దావు,బలహీనమైన చేతుల్ని నువ్వు బలపర్చేవాడివి.   నీ మాటలు తడబడేవాళ్లను పైకి లేపేవి,వణుకుతున్న మోకాళ్లను నువ్వు బలపర్చేవాడివి.   అయితే ఇప్పుడు నీకే ఆ పరిస్థితి వచ్చింది, నువ్వు ఉక్కిరిబిక్కిరి అవుతున్నావు;అది నీ దాకా వచ్చింది, నువ్వు దిగులుపడుతున్నావు.   దేవుని పట్ల నీకున్న భక్తి నీకు ధైర్యం ఇవ్వట్లేదా? నీ యథార్థత+ నీలో ఆశ నింపట్లేదా?   దయచేసి గుర్తుతెచ్చుకో, నిర్దోషి నశించిపోవడం గానీ, నిజాయితీపరుడు నాశనమవ్వడం గానీ ఎప్పుడైనా జరిగిందా?   నేను గమనించినంతవరకు, కీడును దున్నేవాళ్లు కీడును,కష్టాల్ని విత్తేవాళ్లు కష్టాల్ని కోస్తారు.   దేవుని శ్వాస వల్ల వాళ్లు నాశనమౌతారు,ఆయన కోపం వల్ల వాళ్లు అంతమౌతారు. 10  సింహం గర్జిస్తుంది, కొదమ సింహం గుర్రుమంటుంది,అయితే బలమైన సింహాల పళ్లు కూడా విరిగిపోతాయి. 11  ఆహారం లేక సింహం చచ్చిపోతుంది,సింహం పిల్లలు చెదిరిపోతాయి. 12  ఒక మాట రహస్యంగా నా చెవిన పడింది,దాని గుసగుస శబ్దం నాకు వినిపించింది. 13  రాత్రివేళ మనుషులు గాఢనిద్రలోకి జారుకునే సమయంలోనా మనసును కలవరపెట్టే దర్శనాలు నాకు వచ్చాయి. 14  నేను గజగజ వణికిపోయాను,నా ఎముకలన్నీ భయంతో నిండిపోయాయి. 15  నా ముఖం మీదుగా ఏదో* దాటివెళ్లింది;నా ఒంటి మీది వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. 16  తర్వాత అది కదలకుండా నిలబడింది,దాని రూపాన్ని నేను గుర్తుపట్టలేకపోయాను. ఏదో ఆకారం నా కళ్లముందు ఉంది;నిశ్శబ్దం ఆవరించింది, ఇలా ఒక స్వరం వినిపించింది: 17  ‘మనిషి దేవుని కన్నా నీతిమంతుడిగా ఉండగలడా? తన సృష్టికర్త కన్నా పవిత్రుడిగా ఉండగలడా?’ 18  ఇదిగో! ఆయన తన సేవకుల్ని నమ్మడు,తన దూతల్లో* కూడా తప్పులు వెదుకుతాడు. 19  అలాంటప్పుడు, మట్టిలో+ పునాది వేసిన బంకమట్టి ఇళ్లలో నివసిస్తూచిమ్మెటలా ఇట్టే నలిపేయబడే వాళ్లను ఎలా నమ్ముతాడు? 20  ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్లు పూర్తిగా నలిపేయబడతారు;వాళ్లు శాశ్వతంగా నశించిపోతారు, ఎవరూ దాన్ని పట్టించుకోరు. 21  వాళ్లు తాళ్లు పీకేసిన డేరాల్లా ఉన్నారు, వాళ్లు తెలివి లేకుండానే చనిపోతారు.

అధస్సూచీలు

లేదా “అదృశ్య శక్తి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “సందేశకుల్లో.”