యోబు 39:1-30

  • మనిషికి తెలిసింది ఎంత తక్కువో జంతు సృష్టి చూపిస్తుంది (1-30)

    • కొండమేకలు, జింకలు (1-4)

    • అడవి గాడిద (5-8)

    • అడవి ఎద్దు (9-12)

    • నిప్పుకోడి (13-18)

    • గుర్రం (19-25)

    • డేగ, గద్ద (26-30)

39  “కొండమేకలు ఎప్పుడు ఈనతాయో నీకు తెలుసా?+ జింకలు పిల్లల్ని కనేటప్పుడు నువ్వు చూశావా?+   అవి ఎన్ని నెలలు మోస్తాయో నువ్వు లెక్కపెట్టావా? అవి ఎప్పుడు కంటాయో నీకు తెలుసా?   అవి పిల్లల్ని కనేటప్పుడు నేలకు ​వంగుతాయి,అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.   వాటి పిల్లలు బలంగా ఎదుగుతాయి, మైదానాల్లో పెరుగుతాయి;అవి తల్లుల్ని విడిచి వెళ్లిపోతాయి, మళ్లీ రావు.   అడవి గాడిదను స్వేచ్ఛగా తిరగనిచ్చింది ఎవరు?+దాని తాళ్లను విప్పింది ఎవరు?   నేను ఎడారి మైదానాన్ని దానికి ఇల్లుగా ఇచ్చాను,ఉప్పు నేలను దానికి నివాసంగా చేశాను.   నగరంలోని కోలాహలాన్ని అది ​పట్టించుకోదు;దాన్ని తోలేవాడి కేకల్ని వినిపించుకోదు.   అది మేత కోసం వెతుక్కుంటూ కొండల్లో తిరుగుతుంది,పచ్చని మొక్కల కోసం చూస్తుంది.   అడవి ఎద్దు నీకు సేవచేస్తుందా?+ అది రాత్రిపూట నీ పశువుల కొట్టంలో ఉంటుందా? 10  నువ్వు అడవి ఎద్దుకు తాడు కట్టి, దానితో పొలం దున్నించగలవా?లోయను చదును చేయడానికి అది నీ వెంట వస్తుందా? 11  దాని బలం గొప్పదని దాన్ని నమ్ము​కుంటావా?దానికి బరువైన పనులు అప్పగిస్తావా? 12  నీ పంటను ఇంటికి తెచ్చుకోవడానికి దానిమీద ఆధారపడతావా?అది కళ్లం* దగ్గరికి నీ పంటను పోగుచేస్తుందా? 13  నిప్పుకోడి ఆనందంతో రెక్కలు ఆడిస్తుంది,కానీ దాని రెక్కలు, ఈకలు సంకుబుడి కొంగకు ఉన్న లాంటివా?+ 14  అది దాని గుడ్లను నేల మీద వదిలేస్తుంది,మట్టిలో వాటిని వెచ్చగా ఉంచుతుంది. 15  అవి దేని కాలి కిందైనా పడి చితికిపోవచ్చని,అడవి జంతువు వాటిని తొక్కేయవచ్చని అది మర్చిపోతుంది. 16  దాని పిల్లలు దానివి కావన్నట్టుగా కఠినంగా ప్రవర్తిస్తుంది;+తన కష్టం వృథా అయిపోతుందనే భయం దానికి ఉండదు. 17  ఎందుకంటే దేవుడు దానికి తెలివిని, అవగాహనను ఇవ్వలేదు. 18  కానీ అది లేచి రెక్కలు ఆడించినప్పుడుగుర్రాన్ని, దాని రౌతును చూసి ​ఎగతాళిగా నవ్వుతుంది. 19  గుర్రానికి బలాన్ని ఇచ్చేది నువ్వేనా?+ జూలుతో దాని మెడను కప్పేది నువ్వేనా? 20  నువ్వు దాన్ని మిడతలా గంతులు వేసేట్టు చేయగలవా? దాని భీకరమైన సకిలింపు భయం పుట్టిస్తుంది.+ 21  అది లోయలో కాలు దువ్వుతూ, తన బలాన్ని బట్టి సంతోషిస్తుంది;+యుద్ధానికి కదం తొక్కుతుంది.+ 22  అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికీ బెదరదు.+ ఖడ్గాన్ని చూసి వెనక్కి తిరగదు. 23  అంబులపొది దానికి తగిలి గలగల​మంటుంది,ఈటె, బల్లెం తళతళ మెరుస్తాయి. 24  అది ఉత్సాహంతో ముందుకు దూకుతుంది,*బూర* శబ్దం విన్నప్పుడు దాని కాలు నిలవదు.* 25  బూరను ఊదినప్పుడు, అది ‘ఆహా!’ అంటుంది.అది దూరం నుండే యుద్ధ వాసనను పసిగడుతుంది, సైన్యాధికారుల అరుపుల్ని, యుద్ధకేకల్ని వింటుంది.+ 26  నీ అవగాహనను బట్టే డేగ రెక్కలు చాచిదక్షిణం వైపు ఎగురుతుందా? 27  నీ ఆజ్ఞను బట్టే గద్ద పైకి ఎగిరి+ఎత్తైన చోట గూడు కట్టుకుంటుందా?+ 28  నీ ఆజ్ఞను బట్టే అది కొండ అంచుల్లో రాత్రి గడుపుతుందా?గుట్ట మీద ఎవరూ రాలేని చోట నివసిస్తుందా? 29  అక్కడి నుండి అది ఆహారం కోసం వెతుకుతుంది;+దాని కళ్లు చాలా దూరం చూస్తాయి. 30  దాని పిల్లలు రక్తం పీలుస్తాయి;కళేబరం ఎక్కడ ఉంటే, అది అక్కడ ఉంటుంది.”+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “నేలను మింగేస్తుంది.”
అక్ష., “కొమ్ము.”
లేదా “అది బూర శబ్దాన్ని నమ్మదు” అయ్యుంటుంది.