యోబు 30:1-31
30 “ఇప్పుడేమో నాకన్నా వయసులో చిన్నవాళ్లు నన్ను చూసి నవ్వుతున్నారు,+నేను వాళ్ల తండ్రుల్ని నా మందను కాసే కుక్కల దగ్గరికి కూడా రానిచ్చేవాణ్ణి కాదు.
2 వాళ్ల చేతుల బలం వల్ల నాకేం లాభం?వాళ్ల బలం నశించిపోయింది.
3 వాళ్లు పేదరికంతో, ఆకలితో క్షీణించిపోయారు;అప్పటికే పాడైపోయి నిర్జనంగా ఉన్న స్థలంలోఇసుక నములుతున్నారు.
4 వాళ్లు పొదల్లో నుండి ఉప్పగా ఉండే ఆకుల్ని పీక్కొని తింటారు;తంగేడు చెట్ల వేర్లే వాళ్లకు ఆహారం.
5 వాళ్లు సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడుతున్నారు;+ప్రజలు దొంగను చూసి అరిచినట్టు వాళ్లను చూసి అరుస్తున్నారు.
6 వాళ్లు లోయల్లో,* నేల సందుల్లో, బండ సందుల్లో నివసిస్తారు.
7 వాళ్లు పొదల మధ్య నుండి కేకలు వేస్తారు,ముళ్ల చెట్ల మధ్య పోగౌతారు.
8 బుద్ధిలేనివాళ్ల పిల్లల్లా, అనామకుల పిల్లల్లావాళ్లు దేశంలో నుండి తరిమేయబడ్డారు.
9 కానీ ఇప్పుడు వాళ్లు నన్ను ఎగతాళి చేస్తూ పాటలు పాడుతున్నారు;+నన్ను ఈసడించుకుంటున్నారు.*+
10 నన్ను అసహ్యించుకుంటూ నాకు దూరంగా ఉంటున్నారు;+నా ముఖం మీద ఉమ్మేయడానికి కూడా వెనకాడట్లేదు.+
11 దేవుడు నా ఆయుధాల్ని తీసేసి* నన్ను నిస్సహాయ స్థితిలో ఉంచాడు,కాబట్టి నాతో వాళ్లు అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నారు.*
12 నా కుడివైపు వాళ్లు అల్లరిమూకలా లేస్తున్నారు;నన్ను పారిపోయేలా చేసినా దారిలో నాశనకరమైన అడ్డంకులు పెడుతున్నారు.
13 వాళ్లు నా దారుల్ని పాడుచేసి,నా ఆపదను పెద్దది చేస్తున్నారు,+వాళ్లను ఆపేవాళ్లు ఎవరూ లేరు.*
14 గోడలోని పెద్ద పగులు గుండా వచ్చినట్టు వాళ్లు వస్తున్నారు;వినాశనం మధ్య కూడా నా మీదికి దూసుకొస్తున్నారు.
15 భయం నన్ను ముంచెత్తుతోంది;నా ఘనత గాలిలా కొట్టుకుపోతోంది,నా రక్షణ మబ్బులా మాయమైపోతోంది.
16 ఇప్పుడు నా ప్రాణం వెళ్లిపోతోంది;+నేను రోజూ బాధపడుతున్నాను.+
17 రాత్రివేళ నా ఎముకల్లో పొడిచినట్టు అనిపిస్తోంది;+విపరీతమైన నొప్పి నన్ను పట్టిపీడిస్తోంది.+
18 నా వస్త్రం గొప్పశక్తితో మెలితిప్పబడింది;*అది మెడపట్టీలా నాకు ఊపిరాడకుండా చేస్తోంది.
19 దేవుడు నన్ను బురద గుంటలోకి తోసేశాడు;నేను ధూళిలా, బూడిదలా అయిపోయాను.
20 నేను సహాయం కోసం నీకు మొరపెడుతున్నాను, కానీ నువ్వు జవాబివ్వట్లేదు;+నేను నిల్చున్నాను, కానీ నువ్వు కేవలం చూస్తూ ఉన్నావు.
21 నువ్వు మారిపోయి, నాతో క్రూరంగా ప్రవర్తిస్తున్నావు;+నీ చేతి బలమంతా ఉపయోగించి నా మీద దాడిచేస్తున్నావు.
22 నువ్వు నన్ను పైకి లేపి, గాలికి కొట్టుకుపోయేలా చేస్తున్నావు;తర్వాత తుఫానుతో నన్ను అల్లాడిపోయేలా* చేస్తున్నావు.
23 నువ్వు నన్ను మరణానికి అప్పగిస్తావని,సజీవులందరూ కలుసుకునే ఇంటికి తీసుకెళ్తావని నాకు తెలుసు.
24 అయితే విపత్తు సమయంలో సహాయం కోసం మొరపెట్టే నిస్సహాయుణ్ణిఎవ్వరూ పూర్తిగా నాశనం చేయరు.+
25 కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం నేను ఏడ్వలేదా?
పేదవాళ్ల కోసం దుఃఖపడలేదా?+
26 నేను మంచిని ఆశిస్తే చెడు జరిగింది;వెలుగు కోసం ఎదురుచూస్తే చీకటి వచ్చింది.
27 నాలో అలజడి తగ్గలేదు;కష్టాలతో నిండిన రోజులు నాకు ఎదురయ్యాయి.
28 నేను చీకట్లో నడుస్తున్నాను;+ సూర్యుని వెలుగు లేదు.
నేను సమాజంలో లేచి, సహాయం కోసం మొరపెడుతున్నాను.
29 నేను నక్కలకు సహోదరుణ్ణి అయ్యాను,నిప్పుకోళ్లకు సహచరుణ్ణి అయ్యాను.+
30 నా చర్మం నల్లబడి రాలిపోయింది;+వేడి* వల్ల నా ఎముకలు మండుతున్నాయి.
31 నా వీణ* కేవలం శోక స్వరం వినిపించడానికి,నా పిల్లనగ్రోవి* ఏడుపు శబ్దం చేయడానికి ఉపయోగపడుతున్నాయి.
అధస్సూచీలు
^ లేదా “వాగుల దగ్గర.”
^ లేదా “నా మీద సామెత చెప్పుకుంటున్నారు.”
^ అక్ష., “నా వింటి తాడును వదులు చేసి.”
^ లేదా “కళ్లెం వదిలించుకుంటున్నారు.”
^ లేదా “ఎవరూ వాళ్లకు సహాయం చేయట్లేదు” అయ్యుంటుంది.
^ లేదా “నా కష్టాల తీవ్రత వల్ల నేను వికారంగా తయారయ్యాను” అయ్యుంటుంది.
^ లేదా “కరిగిపోయేలా” అయ్యుంటుంది.
^ లేదా “జ్వరం” అయ్యుంటుంది.
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “సన్నాయి.”