యోబు 23:1-17
23 అప్పుడు యోబు ఇలా అన్నాడు:
2 “ఈ రోజు కూడా నేను మొండిగా ఫిర్యాదు చేస్తాను;+నా నిట్టూర్పుల వల్ల నా బలం క్షీణించింది.
3 దేవుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలిస్తే బావుండు!+
అప్పుడు నేను ఆయన నివాస స్థలానికి వెళ్తాను.+
4 నా వ్యాజ్యాన్ని ఆయన ముందు పెడతాను,నా నోటిని వాదనలతో నింపుకుంటాను.
5 ఆయన నాకు ఎలా జవాబిస్తాడో తెలుసుకుంటాను,నాకు ఏం చెప్తాడో చూస్తాను.
6 ఆయన తన గొప్ప శక్తిని ఉపయోగించి నాతో పోరాడతాడా?
లేదు, నేను చెప్పేది తప్పకుండా వింటాడు.+
7 ఆయన ముందు నిజాయితీపరుడి వ్యాజ్యం పరిష్కరించబడుతుంది,నా న్యాయమూర్తి నన్ను నిర్దోషిగా ప్రకటించి, శాశ్వతంగా విడుదల చేస్తాడు.
8 కానీ నేను తూర్పు వైపుకు వెళ్లినా, ఆయన అక్కడ లేడు;పడమటి వైపుకు వెళ్లినా, ఆయన కనిపించలేదు.
9 ఆయన ఎడమవైపు పనిచేస్తున్నప్పుడు నేను ఆయన్ని చూడలేను;ఆయన కుడివైపు తిరిగినప్పుడు కూడా ఆయన నాకు కనిపించడు.
10 కానీ నేను నడిచే దారి ఆయనకు తెలుసు,+
ఆయన నన్ను పరీక్షించిన తర్వాత, నేను స్వచ్ఛమైన బంగారంలా బయటికొస్తాను.+
11 నా పాదాలు ఆయన అడుగుజాడల్లోనే నడిచాయి;నేను పక్కకు తిరగకుండా ఆయన దారిలోనే నడిచాను.+
12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచిపెట్టలేదు,
ఆయన నన్ను అడిగిన దానికన్నా ఎక్కువే చేశాను.+
13 ఆయన నిశ్చయించుకుంటే ఎవరు ఆయన్ని అడ్డుకోగలరు?+
ఆయన ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా చేస్తాడు.+
14 ఆయన నా విషయంలో చేయాలనుకున్నది పూర్తిగా చేస్తాడు,ఆయన మనసులో ఇలాంటివి చాలా ఉన్నాయి.
15 అందుకే, ఆయన్ని బట్టి నాకు ఆందోళనగా ఉంది;ఆయన గురించి ఆలోచించినప్పుడు, నాలో భయం పెరిగిపోతోంది.
16 దేవుడు నన్ను పిరికివాణ్ణి చేశాడు,సర్వశక్తిమంతుడు నన్ను భయపెట్టాడు.
17 గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేసింది.అయినా నేను మౌనంగా ఉండను.