యోబు 20:1-29

  • జోఫరు రెండోసారి మాట్లాడడం (1-29)

    • యోబు తనను అవమానించినట్టు ​భావించాడు (2, 3)

    • యోబు దుష్టుడని ఆరోపించాడు (5)

    • పాపం చేయడం యోబుకు ఇష్టమని అన్నాడు (12, 13)

20  అప్పుడు నయమాతీయుడైన జోఫరు+ ఇలా అన్నాడు:  2  “నాలోని కలవరపెట్టే ఆలోచనలు నన్ను బలవంతపెడుతున్నాయి,అందుకే నేను జవాబు ఇస్తున్నాను. నా లోపల ఆందోళనగా ఉంది.  3  నన్ను అవమానించే ఒక గద్దింపును నేను విన్నాను;అందుకే, జవాబిచ్చేలా నా అవగాహన నన్ను బలవంతపెడుతోంది.  4  ఈ విషయం నీకు చాలాకాలంగా తెలిసుంటుంది,ఎందుకంటే, భూమ్మీద మనిషిని* ఉంచినప్పటి నుండి ఇలా జరుగుతోంది:+  5  దుష్టుడి ఆనంద ధ్వనులు కాసేపే ఉంటాయి,భక్తిహీనుడి* సంతోషం క్షణకాలమే ఉంటుంది.+  6  అతని గొప్పతనం ఆకాశానికి ఎక్కినా,అతని తల మేఘాల్ని తాకినా,  7  తన మలంలానే అతను శాశ్వతంగా నాశనమైపోతాడు;అతన్ని చూస్తూవచ్చిన వాళ్లు, ‘అతను ఎక్కడున్నాడు?’ అని అడుగుతారు.  8  అతను కలలా ఎగిరిపోతాడు, వాళ్లకు దొరకడు;రాత్రి కలిగే దర్శనంలా మాయమైపోతాడు.  9  ఒకప్పుడు అతన్ని చూసిన కళ్లు మళ్లీ అతన్ని చూడవు,అతని ఇంట్లో ఇక అతను కనిపించడు.+ 10  అతని పిల్లలు పేదవాళ్ల దయను వెదుకుతారు,స్వయంగా అతని చేతులే అతని సంపదను తిరిగిచ్చేస్తాయి.+ 11  అతని ఎముకలు యౌవన బలంతో నిండివున్నా,అది* అతనితో పాటు నేలలో పడుకుంటుంది. 12  చెడు అతని నోటికి తియ్యగా ఉంటే,అతను తన నాలుక కింద దాన్ని దాచిపెడితే, 13  దాన్ని ఇష్టపడుతూ, బయటికి పోనివ్వకుండాతన నోటిలో అలాగే ఉంచుకుంటే, 14  అతని కడుపులో అతని ఆహారం పులిసిపోతుంది;అది అతనిలో తాచుపాముల విషంలా* మారుతుంది. 15  అతను సంపదను మింగేశాడు, కానీ దాన్ని కక్కేస్తాడు;దేవుడే దాన్ని బయటికి కక్కిస్తాడు. 16  అతను తాచుపాముల విషాన్ని పీలుస్తాడు;విషసర్పం కోరలు* అతన్ని చంపేస్తాయి. 17  నీటి వాగుల్ని గానీ, వెన్న-తేనెల ప్రవాహాల్ని గానీఅతను ఇంకెప్పుడూ చూడడు. 18  అతను తన వస్తువుల్ని ఉపయోగించకుండానే తిరిగిచ్చేస్తాడు;తన వ్యాపారం వల్ల సంపాదించిన ఆస్తిని అనుభవించడు.+ 19  ఎందుకంటే అతను పేదవాళ్లను నలగ్గొట్టాడు, వాళ్లను పట్టించుకోలేదు;తాను కట్టని ఇంటిని ఆక్రమించుకున్నాడు. 20  కానీ లోపల అతనికి మనశ్శాంతి ఉండదు;అతని ఆస్తి అతన్ని కాపాడదు. 21  మింగేయడానికి అతనికి ఇంకేమీ మిగలదు;అందుకే అతని సమృద్ధి నిలవదు. 22  అతని ఆస్తి బాగా పెరిగినప్పుడు, అతనికి ఆందోళన పట్టుకుంటుంది;చెడ్డవన్నీ అతని మీదికి వస్తాయి. 23  అతను తన కడుపు నింపుకుంటుండగా,దేవుడు* తన కోపాగ్నిని అతని మీదికి రప్పిస్తాడు,వర్షంలా దాన్ని అతని మీద కుమ్మరిస్తాడు. 24  అతను ఇనుప ఆయుధాల నుండి పారిపోతున్నప్పుడు,రాగి విల్లుతో సంధించిన బాణాలు అతనికి గుచ్చుకుంటాయి. 25  అతను తన వీపుకు గుచ్చుకున్న బాణాన్ని,తన పేగుల్లోకి దూసుకెళ్లిన మెరిసే ఆయుధాన్ని లాగేస్తాడు,భయం అతన్ని ఆవరిస్తుంది.+ 26  అతని సంపదలన్నీ చీకట్లో కలిసిపోతాయి;ఎవరూ రాజేయని అగ్ని అతన్ని దహించేస్తుంది;అతని డేరాల్లో మిగిలివున్నవాళ్లు విపత్తు బారినపడతారు. 27  ఆకాశం అతని తప్పును బయటపెడుతుంది;భూమి అతని మీదికి లేస్తుంది. 28  వరద అతని ఇంటిని కొట్టుకుపోతుంది,దేవుడు* తన కోపాన్ని చూపించే రోజున అది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. 29  దుష్టునికి దేవుడు ఇచ్చే వాటా ఇదే,అతనికి ఇవ్వాలని దేవుడు ఆదేశించిన స్వాస్థ్యం ఇదే.”

అధస్సూచీలు

లేదా “మానవజాతిని; ఆదామును.”
లేదా “మతభ్రష్టుడి.”
అంటే, అతని బలం.
లేదా “పైత్యరసంలా.”
అక్ష., “నాలుక.”
అక్ష., “ఆయన.”
అక్ష., “ఆయన.”