యోబు 18:1-21
18 అప్పుడు షూహీయుడైన బిల్దదు+ ఇలా అన్నాడు:
2 “మీరు ఎంతసేపు ఇలా మాట్లాడుతుంటారు?
కాస్త అవగాహన చూపించండి, అప్పుడు మేం మాట్లాడగలుగుతాం.
3 మీరెందుకు మమ్మల్ని జంతువుల్లా చూస్తున్నారు?+ఎందుకు మమ్మల్ని మూర్ఖుల్లా* ఎంచుతున్నారు?
4 నువ్వు కోపంతో నిన్ను నువ్వు ముక్కలుముక్కలుగా చీల్చేసుకున్నా,నీకోసం భూమి విడిచిపెట్టబడుతుందా?బండరాయి దాని స్థానం నుండి పక్కకు జరుగుతుందా?
5 అవును, దుష్టుడి దీపం ఆరిపోతుంది,అతని నిప్పు మండదు.+
6 అతని డేరాలోని వెలుగు చీకటైపోతుంది,అతని దీపం ఆరిపోతుంది.
7 బలమైన అతని అడుగులు చిన్నవౌతాయి,అతని సలహానే అతన్ని పడిపోయేలా చేస్తుంది.+
8 ఎందుకంటే, అతని పాదాలు అతన్ని వలలోకి నడిపిస్తాయి,అతను దానిలో చిక్కుకుపోతాడు.
9 అతని మడిమె బోనులో ఇరుక్కుపోతుంది,అతనికి ఉచ్చు బిగుసుకుంటుంది.+
10 అతని కోసం నేలమీద చాటుగా ఉరి ఉంచబడుతుంది,అతని దారిలో వల ఉంటుంది.
11 భయాలు అన్నివైపులా అతన్ని చుట్టుముడతాయి,+అడుగడుగునా అతన్ని వెంటాడతాయి.
12 అతని బలం క్షీణిస్తుంది,విపత్తు+ వల్ల అతను కుంటుతాడు.
13 అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి* అతని చర్మాన్ని, కాళ్లను, చేతుల్ని తినేస్తుంది.
14 సురక్షితంగా ఉన్న తన డేరాలో నుండి అతను పెరికేయబడతాడు,+ఘోరమైన మరణం దగ్గరికి తీసుకెళ్లబడతాడు.
15 అతని డేరాలో పరాయివాళ్లు నివసిస్తారు;అతని ఇంటిమీద గంధకం చల్లుతారు.+
16 కింద అతని వేర్లు ఎండిపోతాయి,పైన అతని కొమ్మలు వాడిపోతాయి.
17 అతని జ్ఞాపకం భూమ్మీద నుండి తుడిచిపెట్టుకుపోతుంది,వీధిలో అతని పేరు ఎవరికీ తెలీదు.*
18 అతను వెలుగులో నుండి చీకట్లోకి గెంటేయబడతాడు,ఫలవంతమైన నేల నుండి తరిమేయబడతాడు.
19 తన ప్రజల మధ్య అతనికి సంతానం గానీ, వంశం గానీ ఉండదు,అతను నివసిస్తున్న* చోట అతని వాళ్లెవరూ మిగలరు.
20 అతని రోజు వచ్చినప్పుడు, పడమటి వైపున్న ప్రజలు ఆశ్చర్యపోతారు,తూర్పు వైపున్న ప్రజలు భయభ్రాంతులకు గురౌతారు.
21 తప్పుచేసేవాడి డేరాలకు,దేవుణ్ణి తెలుసుకోనివాడి స్థలానికి ఇలా జరుగుతుంది.”
అధస్సూచీలు
^ లేదా “అపవిత్రుల్లా” అయ్యుంటుంది.
^ అక్ష., “మరణపు మొదటి సంతానం.”
^ అక్ష., “అతనికి పేరు ఉండదు.”
^ లేదా “అతను పరదేశిగా నివసిస్తున్న.”