యోబు 13:1-28

  • యోబు జవాబు కొనసాగుతుంది (1-28)

    • ‘నేను దేవునితోనే మాట్లాడతాను’ (3)

    • “మీరంతా పనికిరాని వైద్యులు” (4)

    • “నేను నిర్దోషినని నాకు తెలుసు” (18)

    • దేవుడు తనను ఎందుకు శత్రువులా చూస్తున్నాడని అడిగాడు (24)

13  “ఇదంతా నా కన్ను చూసింది,నా చెవి విని అర్థంచేసుకుంది.   మీకు తెలిసింది నాకూ తెలుసు;నేను మీకన్నా తక్కువవాణ్ణేం కాదు.   నాకైతే సర్వశక్తిమంతునితోనే మాట్లాడాలనుంది;దేవునితోనే నా వ్యాజ్యాన్ని వాదించాలనుంది.+   మీరేమో అబద్ధాలతో నా పేరు పాడుచేస్తున్నారు;మీరంతా పనికిరాని వైద్యులు.+   మీరు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే,తెలివిగలవాళ్లని అనిపించుకుంటారు.+   దయచేసి నా వాదనల్ని వినండి,నా పెదాల విన్నపాల్ని ఆలకించండి.   మీరు దేవుని పక్షాన అన్యాయంగా మాట్లాడతారా?ఆయన తరఫున మోసకరంగా మాట్లాడతారా?   మీరు ఆయన వైపు ఉంటారా?*సత్యదేవుని తరఫున వాదించడానికి ప్రయత్నిస్తారా?   ఆయన మిమ్మల్ని పరిశీలించడం+ మీకు మంచిదా? మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయన్ని మోసం చేయగలరా? 10  మీరు రహస్యంగా పక్షపాతం చూపించడానికి ప్రయత్నిస్తే,ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తాడు.+ 11  ఆయన గొప్పతనమే మిమ్మల్ని భయపెడుతుంది కదా!ఆయన గురించిన భయం మిమ్మల్ని ఆవరిస్తుంది కదా! 12  మీ జ్ఞాన వాక్కులు బూడిద సామెతలు;మీ అడ్డుగోడలు* బలహీనమైన మట్టిగోడలు. 13  మీరు మౌనంగా ఉంటే నేను మాట్లాడతాను. ఆ తర్వాత నాకేం జరిగితే అది జరుగుతుంది! 14  నన్ను నేను ప్రమాదంలో పడేసుకుంటున్నాను,నా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటున్నాను. 15  ఆయన నన్ను చంపినా, నేను ఎదురుచూస్తూనే ఉంటాను;+ఆయన ముఖం ముందు నా వ్యాజ్యాన్ని వాదిస్తాను.* 16  అప్పుడు ఆయన నా రక్షణ అవుతాడు,+ఎందుకంటే భక్తిహీనులు* ఎవరూ ఆయన ముందుకు రాలేరు.+ 17  నా మాటల్ని శ్రద్ధగా వినండి;నేను చెప్పేది ఆలకించండి. 18  చూడండి, నేను నా వ్యాజ్యాన్ని సిద్ధం చేసుకున్నాను;నేను నిర్దోషినని నాకు తెలుసు. 19  నాతో వాదించే వాళ్లెవరు? నేను మౌనంగా ఉండాల్సి వస్తే నా ప్రాణం పోతుంది!* 20  దేవా, రెండింటిని నాకు దయచేయి చాలు, అప్పుడు నేను నీ ముందు దాక్కోను: 21  బరువైన నీ చేతిని నా నుండి దూరంగా తీసేయి,నీ గురించిన భయం నన్ను బెదరగొట్టనివ్వకు.+ 22  నువ్వైనా నన్ను పిలువు, నేను జవాబిస్తాను,లేదా నన్నైనా మాట్లాడనిచ్చి, నాకు జవాబివ్వు. 23  నేను చేసిన తప్పులేంటి, పాపాలేంటి? నా అపరాధాన్ని, నా పాపాన్ని నాకు తెలియజేయి. 24  ఎందుకు నీ ముఖాన్ని దాచుకుంటున్నావు?+ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నావు?+ 25  గాలికి ఎగిరిపోయే ఆకును నువ్వు భయపెడతావా?గడ్డిపోచను తరుముతావా? 26  నువ్వు నామీద తీవ్రమైన ఆరోపణలు నమోదు చేస్తూ ఉన్నావు,నా యౌవనకాల పాపాలకు నన్ను లెక్క అడుగుతున్నావు. 27  నా పాదాల్ని బొండలో పెట్టావు,నా మార్గాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నావు,నా అడుగుజాడల్ని జాగ్రత్తగా గమనిస్తున్నావు. 28  అందుకే, కుళ్లిపోయిన పదార్థంలా,చిమ్మెట తినేసిన వస్త్రంలా మనిషి* కుళ్లిపోతున్నాడు.

అధస్సూచీలు

లేదా “ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా?”
లేదా “డాళ్లు.”
లేదా “నా మార్గాల్ని సమర్థించుకుంటాను.”
లేదా “మతభ్రష్టులు.”
లేదా “ఎవరైనా వాదించగలిగితే, నేను మౌనంగా ఉండి చనిపోతాను” అయ్యుంటుంది.
అక్ష., “అతను,” యోబును సూచిస్తుండవచ్చు.