యోబు 11:1-20

  • జోఫరు మొదటిసారి మాట్లాడడం (1-20)

    • యోబు మాటలు వ్యర్థమైనవని ​నిందించడం (2, 3)

    • చెడు చేయొద్దని యోబుకు చెప్పడం (14)

11  అప్పుడు నయమాతీయుడైన జోఫరు+ ఇలా అన్నాడు:   “నీ మాటలన్నిటికీ ఎవరో ఒకరు జవాబు చెప్పకపోతే ఎలా?ఎక్కువగా మాట్లాడినంత మాత్రాన ఒక వ్యక్తి* నిర్దోషి అవుతాడా?   నీ వ్యర్థమైన మాటలతో ప్రజల నోళ్లు మూయిస్తావా? నీ ఎగతాళి మాటల్ని బట్టి ఎవరూ నిన్ను గద్దించరా?+   ఎందుకంటే, ‘నా బోధ స్వచ్ఛమైనది,+నేను నీ దృష్టిలో పవిత్రంగా ఉన్నాను’ అని నువ్వు అంటున్నావు.+   దేవుడే తన నోరు తెరిచినీతో మాట్లాడితే ఎంత బావుంటుంది!+   అప్పుడు ఆయన తెలివికి సంబంధించిన రహస్యాల్ని నీకు తెలియజేస్తాడు,ఎందుకంటే తెలివికి* ఎన్నో కోణాలు ఉన్నాయి. దేవుడు నీ తప్పుల్లో కొన్నిటిని గుర్తుచేసుకోవట్లేదని నువ్వు గ్రహిస్తావు.   దేవుని లోతైన విషయాల్ని నువ్వు తెలుసుకోగలవా?సర్వశక్తిమంతుని గొప్పతనపు హద్దును* నువ్వు కనిపెట్టగలవా?   అది ఆకాశం కన్నా ఎత్తైనది. నువ్వు ఏం చేయగలవు? అది సమాధి* కన్నా లోతైనది. నువ్వు ఏం తెలుసుకోగలవు?   అది భూమి కన్నా పెద్దది,*సముద్రం కన్నా విశాలమైనది. 10  ఆయన వెళ్తూవెళ్తూ ఎవరినైనా బంధించి, న్యాయస్థానాన్ని సమావేశపరిస్తే,ఎవరు ఆయన్ని అడ్డుకోగలరు? 11  ఎవరు మోసగాళ్లో ఆయనకు తెలుసు. చెడును చూసినప్పుడు, ఆయన దాన్ని పట్టించుకోడా? 12  అడవి గాడిద కడుపున మనిషి* పుట్టినప్పుడు మాత్రమేతెలివిలేనివాడికి అవగాహన వస్తుంది. 13  నువ్వు నీ హృదయాన్ని సిద్ధం చేసుకుని,ఆయన వైపు చేతులు చాపు; 14  ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే దాన్ని మానేయి,నీ డేరాల్లో ఎలాంటి చెడ్డపనులూ జరగనివ్వకు. 15  అప్పుడు నువ్వు నిర్దోషిగా తల ఎత్తుకోవచ్చు;ఏ భయమూ లేకుండా స్థిరంగా ఉండవచ్చు. 16  అప్పుడు నువ్వు నీ కష్టాల్ని మర్చిపోతావు;దాటిపోయిన నీటి ప్రవాహంలా వాటిని మర్చిపోతావు. 17  నీ జీవితం మిట్టమధ్యాహ్న వెలుగు కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది;దాని చీకటి కూడా ఉదయకాంతిలా ఉంటుంది. 18  నువ్వు ఆశాభావంతో ధైర్యంగా ఉంటావు,చుట్టూ చూసి ఏ భయం లేకుండా పడుకుంటావు. 19  నువ్వు పడుకున్నప్పుడు, నిన్ను భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు,చాలామంది నీ దయను కోరుకుంటారు. 20  అయితే దుష్టుల కళ్లు క్షీణించిపోతాయి;పారిపోవడానికి వాళ్లకు ఏ చోటూ ఉండదు,వాళ్లకు చావు తప్ప ఇంకే ఆశా ఉండదు.”+

అధస్సూచీలు

లేదా “గొప్పలు చెప్పుకునేవాడు.”
లేదా “ఆచరణాత్మక తెలివికి.”
లేదా “గురించిన ప్రతీ విషయాన్ని.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
అక్ష., “పొడవైనది.”
లేదా “అడవి గాడిద మనిషిగా.”