యోనా 1:1-17

  • యోనా యెహోవా నుండి పారిపోవడానికి ప్రయత్నించడం (1-3)

  • యెహోవా భయంకరమైన తుఫానును రప్పించడం (4-6)

  • యోనానే విపత్తుకు కారణం (7-13)

  • యోనాను తుఫాను రేగిన సముద్రంలో పడేయడం (14-16)

  • పెద్ద చేప యోనాను మింగేయడం (17)

1  యెహోవా వాక్యం అమిత్తయి కుమారుడైన యోనా*+ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 2  “లేచి, మహా నగరమైన నీనెవెకు+ వెళ్లి దానికి వ్యతిరేకంగా తీర్పును ప్రకటించు. ఎందుకంటే వాళ్ల చెడుతనం నా దృష్టికి వచ్చింది.” 3  కానీ యోనా యెహోవా నుండి దూరంగా తర్షీషుకు పారిపోవాలనుకున్నాడు; అతను యొప్పేకు వెళ్లాడు, అక్కడ అతనికి తర్షీషుకు వెళ్లే ఒక ఓడ కనిపించింది. అతను ప్రయాణం కోసం డబ్బులిచ్చి, తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. యెహోవాకు దూరంగా వెళ్లాలని అలా చేశాడు. 4  అప్పుడు యెహోవా సముద్రంలో పెద్దగాలి వీచేలా చేశాడు. దాంతో సముద్రంలో ఎంత భయంకరమైన తుఫాను వచ్చిందంటే, ఓడ దాదాపు బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. 5  నావికులు చాలా భయపడిపోయి, వాళ్లలో ప్రతీ ఒక్కరు సహాయం కోసం వాళ్లవాళ్ల దేవుళ్లను వేడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఓడను తేలిక చేయడానికి అందులోని సరుకుల్ని సముద్రంలోకి పడేయడం మొదలుపెట్టారు.+ అయితే యోనా ఓడ* అడుగుభాగానికి వెళ్లి, అక్కడ పడుకొని గాఢనిద్రలోకి జారుకున్నాడు. 6  ఓడ అధికారి యోనా దగ్గరికి వచ్చి, “నువ్వు నిద్రపోతున్నావేంటి? లే, నీ దేవుణ్ణి వేడుకో! బహుశా సత్యదేవుడు మన మీద కనికరం చూపిస్తాడేమో, అప్పుడు మనం చావకుండా ఉంటాం” అని అన్నాడు.+ 7  తర్వాత వాళ్లు ఒకరితోఒకరు ఇలా అనుకున్నారు: “రండి, ఈ విపత్తు ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లు* వేద్దాం.”+ వాళ్లు చీట్లు వేసినప్పుడు యోనా పేరున చీటి పడింది.+ 8  అప్పుడు వాళ్లు అతనితో ఇలా అన్నారు: “ఎవరి వల్ల ఈ విపత్తు మా మీదికి వచ్చిందో దయచేసి చెప్పు. నువ్వు ఏ పని చేస్తావు? ఎక్కడి నుండి వచ్చావు? నీది ఏ దేశం? నీ ప్రజలు ఎవరు?” 9  యోనా ఇలా చెప్పాడు: “నేను ఒక హెబ్రీయుణ్ణి. పరలోక దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు గలవాణ్ణి.* సముద్రాన్ని, భూమిని సృష్టించింది ఆయనే.” 10  తర్వాత యోనా తాను యెహోవా నుండి పారిపోతున్నానని చెప్పాడు. అది విన్నప్పుడు వాళ్లు ఇంకా భయపడి, “నువ్వు ఎందుకలా చేశావు?” అన్నారు. 11  అంతేకాదు, సముద్రంలో తుఫాను అంతకంతకు తీవ్రమౌతుండడంతో, “సముద్రం శాంతించాలంటే మేము నీకేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 12  అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. అప్పుడు సముద్రం శాంతిస్తుంది; నా వల్లే ఈ భయంకరమైన తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు.” 13  అయితే, నావికులు చాలా కష్టపడి తెడ్లు వేస్తూ ఓడను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ల వల్ల కాలేదు. ఎందుకంటే, తుఫాను అంతకంతకు ఎక్కువౌతోంది. 14  అప్పుడు వాళ్లు యెహోవాను ఇలా వేడుకున్నారు: “యెహోవా, దయచేసి ఈ మనిషి వల్ల మేము నశించిపోకుండా చూడు! యెహోవా, నిర్దోషిని చంపామనే నేరం* మా మీద మోపవద్దు, ఎందుకంటే ఇది నీ ఇష్టానుసారంగా జరుగుతోంది.” 15  తర్వాత వాళ్లు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు; దాంతో సముద్రం నిమ్మళించింది. 16  అది చూసి వాళ్లు యెహోవాకు ఎంతో భయపడ్డారు.+ వాళ్లు యెహోవాకు ఒక బలి అర్పించి, మొక్కుబడులు చేసుకున్నారు. 17  అప్పుడు యెహోవా యోనాను మింగడానికి ఒక పెద్ద చేపను పంపించాడు. యోనా ఆ చేప కడుపులో మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు.+

అధస్సూచీలు

“పావురం” అని అర్థం.
లేదా “అంతస్తులున్న ఓడ.”
పదకోశం చూడండి.
లేదా “ఆరాధించే వ్యక్తిని.”
అక్ష., “నిర్దోషి రక్తాన్ని.”