యెహోషువ 8:1-35
8 ఆ తర్వాత యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “నువ్వు భయపడకు, బెదిరిపోకు.+ యోధులందర్నీ వెంటబెట్టుకుని హాయి నగరం మీదికి వెళ్లు. చూడు, హాయి రాజును, అతని ప్రజల్ని, అతని నగరాన్ని, అతని దేశాన్ని నేను నీకు అప్పగించాను.+
2 యెరికోకు, దాని రాజుకు చేసినట్టే+ హాయి నగరానికి, దాని రాజుకు చేయి. అయితే మీరు ఆ నగరాన్ని, దాని పశువుల్ని దోచుకోవచ్చు. నువ్వు నగరం వెనక మాటువేయించు.”
3 కాబట్టి యెహోషువ, అలాగే యోధులందరూ హాయి నగరం మీదికి వెళ్లారు. యెహోషువ 30,000 మంది బలమైన యోధుల్ని ఎంచుకొని వాళ్లను రాత్రిపూట పంపించాడు.
4 అతను వాళ్లకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “చూడండి, మీరు నగరం వెనక పొంచివుండాలి. నగరానికి మరీ దూరంగా వెళ్లొద్దు, మీరందరూ సిద్ధంగా ఉండండి.
5 నేనూ, నాతో ఉన్న ప్రజలందరూ నగరం దగ్గరికి వెళ్తాం. వాళ్లు అంతకుముందులాగే మా మీదికి వచ్చినప్పుడు+ మేము వాళ్ల ఎదుట నుండి పారిపోతాం.
6 మేము అంతకుముందులా వాళ్ల ఎదుట నుండి పారిపోతున్నామని అనుకొని వాళ్లు మమ్మల్ని తరుముతారు.+ కానీ వాళ్లను నగరం నుండి దూరంగా బయటికి రప్పించేంతవరకు వాళ్ల ఎదుట నుండి పారిపోతాం.
7 అప్పుడు మీరు మాటువేసిన చోట నుండి లేచి నగరాన్ని స్వాధీనం చేసుకోవాలి; మీ దేవుడైన యెహోవా మీకు దాన్ని అప్పగిస్తాడు.
8 మీరు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే దాన్ని తగలబెట్టాలి.+ మీరు యెహోవా మాట ప్రకారం చేయాలి. ఇది నా ఆదేశం.”
9 తర్వాత యెహోషువ వాళ్లను పంపించాడు, వాళ్లు మాటువేసే స్థలానికి వెళ్లారు; వాళ్లు బేతేలు, హాయి నగరాల మధ్య హాయికి పడమటి వైపు మాటువేశారు. అయితే యెహోషువ ఆ రాత్రి ప్రజలతోపాటు ఉన్నాడు.
10 యెహోషువ ఉదయాన్నే లేచి, సైనికుల్ని సమకూర్చాడు. అతనూ, ఇశ్రాయేలీయుల పెద్దలూ ఆ సైనికుల్ని హాయి దగ్గరికి నడిపించారు.
11 అతనితోపాటు ఉన్న యోధులందరూ+ ముందుకు సాగి హాయి నగరం ముందు వైపుకు వెళ్లారు. వాళ్లు దాని ఉత్తరం వైపు ఆగారు. వాళ్లకు, హాయి నగరానికి మధ్య లోయ మాత్రమే ఉంది.
12 ఈలోగా అతను దాదాపు 5,000 మందిని తీసుకొని బేతేలు,+ హాయి నగరాల మధ్య హాయికి పడమటి వైపు మాటువేయించాడు.+
13 కాబట్టి సైన్యంలోని ప్రధాన భాగాన్ని నగరం ఉత్తరం వైపు,+ మాటువేసేవాళ్లను నగరం పడమటి వైపు ఉంచారు.+ ఆ రాత్రి యెహోషువ లోయ మధ్యలోకి వెళ్లాడు.
14 హాయి రాజు దీన్ని చూసిన వెంటనే అతనూ, నగరంలోని మనుషులూ త్వరగా ఉదయాన్నే ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి ఎడారి మైదానం ఎదురుగా ఉన్న ఒక స్థలానికి వెళ్లారు. కానీ నగరం వెనక వైపున తమ కోసం ఇశ్రాయేలీయులు మాటువేసి ఉన్నారన్న సంగతి వాళ్లకు తెలీదు.
15 హాయి మనుషులు దాడిచేసినప్పుడు, యెహోషువతోపాటు ఇశ్రాయేలీయులంతా ఎడారివైపుకు వెళ్లే దారిలో పారిపోయారు.+
16 వీళ్లను తరమడానికి నగరంలో ఉన్న ప్రజలందరూ సమకూడారు. వాళ్లు యెహోషువను తరుముతూ నగరానికి దూరంగా వెళ్లారు.
17 హాయిలోగానీ బేతేలులోగానీ ఒక్క మనిషి కూడా మిగలకుండా అందరూ ఇశ్రాయేలీయుల్ని తరిమారు. వాళ్లు నగర ద్వారాల్ని పూర్తిగా తెరిచి ఉంచి ఇశ్రాయేలీయుల్ని తరిమారు.
18 యెహోవా అప్పుడు యెహోషువతో ఇలా అన్నాడు: “నీ చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు చాపు,+ నేను ఆ నగరాన్ని నీ చేతికి ఇస్తాను.”+ కాబట్టి, యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ నగరం వైపు చాపాడు.
19 అతను తన చెయ్యి చాపగానే, మాటువేసి ఉన్నవాళ్లు తాము ఉన్న చోట నుండి నగరంలోకి పరుగెత్తుకొని వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు వెంటనే ఆ నగరాన్ని తగలబెట్టారు.+
20 హాయి మనుషులు వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఆ నగరం నుండి పొగ ఆకాశానికి లేవడం గమనించారు, వాళ్లు ఎటూ పారిపోలేకపోయారు. అప్పుడు ఎడారివైపు పారిపోతున్న ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి, తమను తరుముతున్నవాళ్ల మీద దాడి చేశారు.
21 మాటువేసినవాళ్లు నగరాన్ని స్వాధీనం చేసుకోవడం, ఆ నగరం నుండి పొగ పైకి లేవడం యెహోషువతోపాటు ఇశ్రాయేలీయులంతా చూసినప్పుడు వాళ్లు వెనక్కి తిరిగి హాయి మనుషుల మీద దాడిచేశారు.
22 ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఇశ్రాయేలీయులు హాయివాళ్ల మీద దాడిచేయడానికి నగరం నుండి బయటికి వచ్చారు. ఇశ్రాయేలీయుల్లో కొంతమంది ఇటువైపు, మరికొంతమంది అటువైపు ఉండడంతో హాయివాళ్లు మధ్యలో చిక్కుకుపోయారు. వాళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా, తప్పించుకోకుండా ఇశ్రాయేలీయులు వాళ్లందర్నీ చంపారు.+
23 అయితే, వాళ్లు హాయి రాజును+ ప్రాణాలతో పట్టుకొని యెహోషువ ముందుకు తీసుకొచ్చారు.
24 ఇశ్రాయేలీయులు ఎడారిలో తమను తరిమిన హాయి వాళ్లందర్నీ చంపిన తర్వాత, వాళ్లలో చివరి వ్యక్తి కూడా కత్తితో చంపబడ్డాక, ఇశ్రాయేలీయులందరూ హాయి నగరానికి తిరిగొచ్చి మిగతావాళ్లను కత్తితో చంపారు.
25 ఆ రోజు హాయి ప్రజల్లో మొత్తం 12,000 మంది స్త్రీపురుషులు చనిపోయారు.
26 హాయి ప్రజలందర్నీ నాశనం చేసేంతవరకు,+ ఈటె పట్టుకున్న తన చేతిని యెహోషువ దించలేదు.+
27 అయితే, యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్టు,+ ఇశ్రాయేలీయులు ఆ నగరంలోని పశువుల్ని, దోపుడుసొమ్మును తీసుకున్నారు.
28 అప్పుడు యెహోషువ హాయి నగరాన్ని కాల్చేసి దాన్ని శాశ్వతంగా పాడుదిబ్బగా మార్చాడు.+ అది ఈ రోజు వరకు అలాగే ఉంది.
29 అతను హాయి రాజును సాయంత్రం వరకు కొయ్య* మీద వేలాడదీశాడు. సూర్యుడు అస్తమించే సమయానికి యెహోషువ అతని శవాన్ని కొయ్య మీద నుండి దించమని ఆదేశించాడు.+ ఆ తర్వాత వాళ్లు శవాన్ని నగర ప్రవేశ ద్వారం దగ్గర పడేసి, దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేశారు. ఈ రోజు వరకు అది అక్కడే ఉంది.
30 ఆ సమయంలోనే యెహోషువ ఏబాలు పర్వతం+ మీద ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.
31 యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టే, “ఇనుప పనిముట్టు తగలని రాళ్లతో బలిపీఠం కట్టాలి”+ అని మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో+ రాయబడి ఉన్నట్టే అతను దాన్ని కట్టాడు. దానిమీద వాళ్లు యెహోవాకు దహనబలులు, సమాధాన బలులు అర్పించారు.+
32 ఆ తర్వాత, మోషే ఇశ్రాయేలీయుల ముందు రాసిన+ ధర్మశాస్త్రాన్ని యెహోషువ ఆ రాళ్లమీద రాశాడు.+
33 ఇశ్రాయేలీయులందరూ, వాళ్ల పెద్దలు, అధికారులు, వాళ్ల న్యాయమూర్తులు యెహోవా ఒప్పంద మందసాన్ని మోస్తున్న లేవీయులైన యాజకుల ఎదుట, మందసానికి రెండు వైపులా నిలబడివున్నారు. అక్కడ విదేశీయులు అలాగే స్థానికులు ఉన్నారు.+ యాజకులు ఇశ్రాయేలీయుల్ని దీవించేలా (అంతకుముందు యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్టే)+ ఆ ప్రజల్లో సగం మంది గెరిజీము పర్వతం ముందు, సగం మంది ఏబాలు పర్వతం ముందు నిలబడివున్నారు.+
34 ఆ తర్వాత అతను ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినవాటన్నిటి ప్రకారం, ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ అంటే దీవెనల్ని,+ శాపాల్ని+ గట్టిగా చదివాడు.+
35 స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న విదేశీయులతో సహా+ ఇశ్రాయేలు సమాజమంతటి ముందు యెహోషువ మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఒక్కమాట కూడా విడిచిపెట్టకుండా+ గట్టిగా చదివాడు.+
అధస్సూచీలు
^ లేదా “చెట్టు.”