యెహోషువ 24:1-33

  • యెహోషువ ఇశ్రాయేలు చరిత్రను చెప్పడం (1-13)

  • యెహోవాను సేవించమని ప్రోత్సహించడం (14-24)

    • “నేనూ, నా కుటుంబం యెహోవాను సేవిస్తాం” (15)

  • ఇశ్రాయేలీయులతో యెహోషువ ఒప్పందం (25-28)

  • యెహోషువ మరణం, పాతిపెట్టబడడం (29-31)

  • షెకెములో యోసేపు ఎముకలు పాతిపెట్టబడడం (32)

  • ఎలియాజరు మరణం, పాతిపెట్టబడడం (33)

24  అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల వాళ్లందర్నీ షెకెము దగ్గర సమావేశపర్చి, వాళ్ల పెద్దల్ని, నాయకుల్ని, న్యాయమూర్తుల్ని, అధికారుల్ని పిలిపించాడు.+ వాళ్లు సత్యదేవుని ముందు నిలబడ్డారు.  యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు, ‘అబ్రాహాము, నాహోరుల తండ్రైన తెరహుతో సహా మీ పూర్వీకులు+ చాలాకాలం క్రితం నది* అవతలి వైపు నివసించేవాళ్లు.+ వాళ్లు వేరే దేవుళ్లను సేవించేవాళ్లు.+  “ ‘కొంతకాలం తర్వాత, నేను మీ పూర్వీకుడైన అబ్రాహామును+ నది* అవతలి వైపు నుండి తీసుకొచ్చి కనాను దేశమంతా నడిచేలా చేశాను, అతని సంతానాన్ని* వృద్ధి చేశాను.+ అతనికి ఇస్సాకును ఇచ్చాను;+  ఇస్సాకుకు యాకోబును, ఏశావును ఇచ్చాను.+ ఏశావుకు శేయీరు పర్వత ప్రాంతాన్ని ఆస్తిగా ఇచ్చాను;+ ఆ తర్వాత యాకోబు, అతని కుమారులు ఐగుప్తుకు వెళ్లారు.+  తర్వాత నేను మోషేను, అహరోనును పంపించి, ఐగుప్తును తెగుళ్లతో బాధించి,+ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను.  నేను మీ తండ్రుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నప్పుడు+ వాళ్లు సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తీయులు యుద్ధ రథాలతో, రౌతులతో మీ తండ్రుల్ని తరుముతూ ఎర్రసముద్రం వరకు వచ్చారు.+  అప్పుడు మీ తండ్రులు యెహోవాను వేడుకోవడం మొదలుపెట్టారు. నేను వాళ్లకూ ఐగుప్తీయులకూ మధ్య చీకటి కమ్ముకునేలా చేశాను, వాళ్ల మీదికి సముద్రాన్ని రప్పించి వాళ్లను ముంచేశాను;+ నేను ఐగుప్తులో చేసింది మీరు కళ్లారా చూశారు.+ తర్వాత మీరు చాలా సంవత్సరాలు* ఎడారిలో నివసించారు.+  “ ‘తర్వాత నేను మిమ్మల్ని యొర్దాను అవతలి వైపున* అమోరీయులు నివసిస్తున్న దేశానికి తీసుకొచ్చాను. వాళ్లు మీతో యుద్ధం చేశారు.+ కానీ మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకునేలా నేను వాళ్లను మీ చేతికి అప్పగించాను, మీ ఎదుట నుండి వాళ్లను నిర్మూలించాను.+  తర్వాత మోయాబు రాజూ సిప్పోరు కుమారుడూ అయిన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. అతను మిమ్మల్ని శపించడానికి బెయోరు కుమారుడైన బిలామును పిలిపించాడు.+ 10  అయితే నేను బిలాము మాట వినలేదు.+ కాబట్టి అతను పదేపదే మిమ్మల్ని ఆశీర్వదించాడు,+ అలా నేను మిమ్మల్ని అతని చేతిలో నుండి కాపాడాను.+ 11  “ ‘తర్వాత మీరు యొర్దాను దాటి+ యెరికోకు+ వచ్చారు. యెరికో నాయకులు,* అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు మీతో యుద్ధం చేశారు. కానీ నేను వాళ్లను మీ చేతికి అప్పగించాను.+ 12  మీరు రాకముందే వాళ్ల గుండెలు జారిపోయేలా చేశాను.* అది, అమోరీయుల ఇద్దరు రాజుల్ని వెళ్లగొట్టినట్టే, వాళ్లను మీ ఎదుట నుండి వెళ్లగొట్టింది.+ అది మీ కత్తి వల్లో, మీ విల్లు వల్లో జరగలేదు.+ 13  ఆ విధంగా, మీరు కష్టపడని దేశాన్ని, మీరు కట్టని నగరాల్ని నేను మీకు ఇచ్చాను.+ మీరు వాటిలో స్థిరపడ్డారు. మీరు నాటని ద్రాక్షతోటల, ఒలీవ తోటల పండ్లను తింటున్నారు.’+ 14  “కాబట్టి, యెహోవాకు భయపడి యథార్థంగా,* నమ్మకంగా* ఆయన్ని సేవించండి;+ నది* అవతలి వైపున, అలాగే ఐగుప్తులో మీ పూర్వీకులు సేవించిన దేవుళ్లను తీసేసి+ యెహోవాను సేవించండి. 15  అయితే యెహోవాను సేవించడం మీకు ఇష్టం లేకపోతే, మీరు ఎవర్ని సేవిస్తారో ఈ రోజే ఎంచుకోండి;+ నది* అవతలి వైపున మీ పూర్వీకులు సేవించిన దేవుళ్లను సేవిస్తారో లేదా మీరు ఎవరి ప్రాంతంలోనైతే నివసిస్తున్నారో ఆ అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో+ ఎంచుకోండి. కానీ నేనూ, నా కుటుంబం యెహోవాను సేవిస్తాం.” 16  అప్పుడు ప్రజలు ఇలా చెప్పారు: “యెహోవాను విడిచిపెట్టి, వేరే దేవుళ్లను సేవించడం మా ఊహకందని విషయం. 17  మన దేవుడైన యెహోవాయే మనల్ని, మన తండ్రుల్ని దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు;+ ఆయనే మన కళ్లముందు గొప్ప సూచనలు చేశాడు,+ మనం నడిచిన మార్గమంతటా, అలాగే మనం దాటుకుంటూ వచ్చిన ప్రజలందరి మధ్య ఆయనే మనల్ని కాపాడుతూ వచ్చాడు.+ 18  మన కన్నా ముందు ఈ దేశంలో నివసించిన అమోరీయులతో సహా జనులందర్నీ యెహోవా వెళ్లగొట్టాడు. అందుకే మేము కూడా యెహోవాను సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.” 19  అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా అన్నాడు: “మీరు నిజంగా యెహోవాను సేవించగలుగుతారా? ఎందుకంటే ఆయన పవిత్రుడైన దేవుడు;+ ఆయన సంపూర్ణ భక్తిని కోరే దేవుడు.+ ఆయన మీ అపరాధాల్ని,* పాపాల్ని క్షమించడు.+ 20  ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి అన్య దేవుళ్లను సేవిస్తే, మొదట్లో ఆయన మీకు మేలు చేసినాసరే, మీకు వ్యతిరేకంగా తిరిగి మిమ్మల్ని నాశనం చేస్తాడు.”+ 21  అయితే ప్రజలు యెహోషువతో, “లేదు, మేము యెహోవాను సేవిస్తాం!” అని అన్నారు.+ 22  అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా అన్నాడు: “యెహోవాను సేవించాలని మీకు మీరే నిర్ణయించుకున్నారు,+ దానికి మీరే సాక్షులు.” అందుకు వాళ్లు, “అవును, దీనికి మేము సాక్షులం” అన్నారు. 23  “కాబట్టి, మీ మధ్య ఉన్న అన్య దేవుళ్లను తీసేసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు మీ హృదయాల్ని తిప్పండి.” 24  అప్పుడు, ప్రజలు యెహోషువతో ఇలా అన్నారు: “మేము మన దేవుడైన యెహోవాను సేవిస్తాం, మేము ఆయన మాట వింటాం!” 25  కాబట్టి యెహోషువ ఆ రోజున ప్రజలతో ఒక ఒప్పందం చేసి, వాళ్ల కోసం షెకెములో ఒక నియమాన్ని, శాసనాన్ని స్థాపించాడు. 26  అప్పుడు యెహోషువ దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో+ ఈ మాటల్ని రాసి, ఒక పెద్ద రాయి తీసుకొని+ యెహోవా పవిత్రమైన స్థలం దగ్గర ఉన్న పెద్ద చెట్టు కింద దాన్ని నిలబెట్టాడు. 27  యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “చూడండి! ఈ రాయి మనకు సాక్షిగా ఉంటుంది.+ ఎందుకంటే, యెహోవా మనకు చెప్పినవన్నీ ఇది విన్నది; మీరు మీ దేవుణ్ణి తిరస్కరించకుండా ఇది మీకు సాక్షిగా ఉంటుంది.” 28  తర్వాత యెహోషువ ప్రజలందర్నీ వాళ్లవాళ్ల ప్రాంతాలకు పంపించేశాడు. 29  ఇవి జరిగిన తర్వాత, నూను కుమారుడూ యెహోవా సేవకుడూ అయిన యెహోషువ చనిపోయాడు, అప్పుడు అతని వయసు 110 ఏళ్లు.+ 30  అతన్ని తిమ్నత్సెరహులో+ అతని స్వాస్థ్యంలో పాతిపెట్టారు. అది ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో గాయషు పర్వతానికి ఉత్తరాన ఉంది. 31  యెహోషువ బ్రతికున్నంత కాలం, అలాగే యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేసిన పనులన్నీ తెలుసుకుని, యెహోషువ కన్నా ఎక్కువకాలం జీవించిన పెద్దలు బ్రతికున్నంత కాలం ఇశ్రాయేలీయులు యెహోవాను సేవిస్తూ వచ్చారు.+ 32  ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన యోసేపు ఎముకల్ని+ షెకెములోని ఒక పొలంలో పాతిపెట్టారు; యాకోబు ఆ పొలాన్ని షెకెము తండ్రైన హమోరు కుమారుల దగ్గర+ 100 వెండి రూకలకు కొన్నాడు;+ అది యోసేపు కుమారుల ఆస్తి అయ్యింది.+ 33  అలాగే, అహరోను కుమారుడైన ఎలియాజరు కూడా చనిపోయాడు.+ వాళ్లు అతన్ని ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో అతని కుమారుడైన ఫీనెహాసుకు+ ఇవ్వబడిన ఫీనెహాసు కొండమీద పాతిపెట్టారు.

అధస్సూచీలు

అంటే, యూఫ్రటీసు.
అంటే, యూఫ్రటీసు.
అక్ష., “విత్తనాన్ని.”
అక్ష., “రోజులు.”
అంటే, తూర్పు వైపున.
లేదా “జమీందారులు” అయ్యుంటుంది.
లేదా “వాళ్లకు భయాందోళన కలిగించాను” అయ్యుంటుంది.
లేదా “నిందలేని విధంగా.”
అక్ష., “సత్యంతో.”
అంటే, యూఫ్రటీసు.
అంటే, యూఫ్రటీసు.
లేదా “తిరుగుబాటును.”