యెహోషువ 22:1-34
22 తర్వాత యెహోషువ రూబేనీయుల్ని, గాదీయుల్ని, మనష్షే అర్ధగోత్రం వాళ్లను పిలిపించి,
2 వాళ్లతో ఇలా అన్నాడు: “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేశారు,+ నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ మీరు లోబడ్డారు.+
3 ఈ రోజు వరకు మీరు ఏనాడూ మీ సహోదరుల్ని విడిచిపెట్టలేదు;+ మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను మీరు పాటించారు.+
4 మీ దేవుడైన యెహోవా మీ సహోదరులకు వాగ్దానం చేసినట్టే, ఇప్పుడు వాళ్లకు ఆయన విశ్రాంతి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతలి వైపున* మీకు ఆస్తిగా ఇచ్చిన+ ప్రాంతంలోని మీ ఇళ్లకు తిరిగెళ్లిపోవచ్చు.
5 అయితే మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ,+ ఆయన మార్గాలన్నిట్లో నడుస్తూ,+ ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ,+ ఆయన్ని హత్తుకొని ఉంటూ,+ మీ నిండు హృదయంతో, మీ నిండు ప్రాణంతో*+ ఆయన్ని సేవిస్తూ+ యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.”+
6 తర్వాత యెహోషువ వాళ్లను ఆశీర్వదించి పంపించేశాడు, వాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
7 మనష్షే అర్ధగోత్రానికి మోషే బాషానులో స్వాస్థ్యాన్ని ఇచ్చాడు; మిగతా అర్ధగోత్రానికి యెహోషువ వాళ్ల సహోదరులతోపాటు యొర్దానుకు పడమటి వైపున భూమిని ఇచ్చాడు.+ అంతేకాదు, వాళ్లను తమ ఇళ్లకు పంపిస్తున్నప్పుడు యెహోషువ వాళ్లను ఆశీర్వదించి,
8 వాళ్లతో ఇలా అన్నాడు: “అనేక సంపదలతో, విస్తారమైన పశువులతో, వెండి-బంగారంతో, రాగి-ఇనుముతో, లెక్కలేనన్ని బట్టలతో మీ ఇళ్లకు తిరిగెళ్లండి.+ మీ శత్రువుల దగ్గర దోచుకున్న సొమ్మును తీసుకెళ్లి మీ సహోదరులతో పంచుకోండి.”+
9 తర్వాత రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వాళ్లు మిగతా ఇశ్రాయేలీయుల దగ్గర నుండి బయల్దేరారు; వాళ్లు కనాను దేశంలోని షిలోహు నుండి గిలాదు ప్రాంతానికి,+ అంటే యెహోవా మోషే ద్వారా ఆదేశించిన ప్రకారం తాము స్థిరపడిన తమ స్వాస్థ్యానికి తిరిగొచ్చారు.+
10 రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వాళ్లు కనాను దేశంలోని యొర్దాను దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్లు అక్కడ ఒక గొప్ప బలిపీఠాన్ని కట్టారు.
11 “చూడండి! కనాను దేశ సరిహద్దులో, ఇశ్రాయేలీయులకు చెందిన యొర్దాను పడమటి భాగంలో రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వాళ్లు ఒక బలిపీఠం కట్టారు” అనే వార్తను మిగతా ఇశ్రాయేలీయులు విన్నారు.+
12 ఇశ్రాయేలీయులు దాని గురించి విన్నప్పుడు, వాళ్ల మీద యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహు దగ్గర సమావేశమైంది.+
13 అప్పుడు ఇశ్రాయేలీయులు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేనీయుల, గాదీయుల, మనష్షే అర్ధగోత్రం వాళ్ల దగ్గరికి యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును+ పంపించారు,
14 అతనితోపాటు ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో ఒక్కో పూర్వీకుల కుటుంబం నుండి ఒక ప్రధానుడి చొప్పున పదిమంది ప్రధానుల్ని పంపించారు. వాళ్లందరూ ఇశ్రాయేలు వేలమందిలో తమతమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు.+
15 వాళ్లు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేనీయుల, గాదీయుల, మనష్షే అర్ధగోత్రం వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్లతో ఇలా అన్నారు:
16 “యెహోవా సమాజమంతా చెప్పేదేమిటంటే: ‘మీరు ఇశ్రాయేలు దేవునికి ఎందుకు నమ్మకద్రోహం చేశారు?+ మీరు ఒక బలిపీఠాన్ని కట్టుకొని, యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా ఈ రోజు మీరు యెహోవాను అనుసరించడం మానేశారు.+
17 పెయోరు దగ్గర మనం చేసిన తప్పు చాలదా? యెహోవా సమాజం మీదికి వచ్చిన తెగులును మీరు మర్చిపోయారా?+ ఆ పాపపు ఫలితాల్ని మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం.
18 మీరు ఇప్పుడు యెహోవాను అనుసరించడం మానేయాలనుకుంటున్నారా? ఈ రోజు మీరు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, రేపు ఇశ్రాయేలు సమాజమంతటి మీద ఆయనకు ఆగ్రహం వస్తుంది.+
19 ఒకవేళ మీరు నివసిస్తున్న ప్రాంతం అపవిత్రమైనదైతే, యెహోవా గుడారం ఉన్న+ యెహోవా ప్రాంతానికి+ వచ్చి మా మధ్య స్థిరపడండి. అంతేకానీ యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకండి. మన దేవుడైన యెహోవా బలిపీఠానికి పోటీగా మీరు ఒక బలిపీఠాన్ని కట్టుకొని మమ్మల్ని తిరుగుబాటుదారులుగా చేయకండి.+
20 నాశనం చేయబడాల్సినవాటి విషయంలో జెరహు కుమారుడైన ఆకాను+ నమ్మకద్రోహానికి పాల్పడినప్పుడు, ఇశ్రాయేలు సమాజమంతటి మీదికి దేవుని ఆగ్రహం రాలేదా?+ అతను చేసిన తప్పుకు చనిపోయింది అతను ఒక్కడే కాదు.’ ”+
21 అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వాళ్లు ఇశ్రాయేలు వేలమందిలో పెద్దలైనవాళ్లతో+ ఇలా అన్నారు:
22 “దేవాది దేవుడైన యెహోవా! దేవాది దేవుడైన యెహోవా!+ మేము ఎందుకు అలా చేశామో ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులకు కూడా తెలుస్తుంది. మేము తిరుగుబాటుచేసి యెహోవాకు నమ్మకద్రోహం చేసివుంటే, ఈ రోజు మమ్మల్ని బ్రతకనివ్వకండి.
23 యెహోవాను అనుసరించడం మానేసి ఆ బలిపీఠం మీద దహనబలులు, ధాన్యార్పణలు, సమాధాన బలులు అర్పించడానికి మేము దాన్ని కట్టివుంటే, యెహోవా మమ్మల్ని శిక్షిస్తాడు.+
24 కానీ మేము వేరే కారణంతో, అంటే భవిష్యత్తులో మీ పిల్లలు మా పిల్లలతో ఇలా అంటారేమో అనే భయంతోనే ఈ పని చేశాం: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకు సంబంధమేమిటి?
25 రూబేనీయులారా, గాదీయులారా, మీకూ మాకూ మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా ఉంచాడు. మీకు యెహోవాలో వంతు లేదు.” అలా మీ పిల్లలు మా పిల్లల్ని యెహోవాను ఆరాధించకుండా* అడ్డుకుంటారేమో.
26 “అందుకే మేము ఇలా చెప్పుకున్నాం, ‘మనం ఒక బలిపీఠాన్ని కట్టుకుందాం. అయితే అది దహనబలుల కోసమో బలుల కోసమో కాదుగానీ,
27 మా దహనబలులతో, బలులతో, సమాధాన బలులతో+ యెహోవాను సేవిస్తామని మీకూ మాకూ మధ్య, అలాగే మన తర్వాత వచ్చే మన వంశస్థులకూ* మధ్య ఒక సాక్షిగా ఉండడానికి.+ అప్పుడు, భవిష్యత్తులో మీ పిల్లలు మా పిల్లలతో, “మీకు యెహోవాలో వంతు లేదు” అని అనకుండా ఉంటారు.’
28 అందుకే మేము ఇలా అనుకున్నాం, ‘భవిష్యత్తులో వాళ్లు మాతో, మా వంశస్థులతో అలా అంటే, మేము ఈ విధంగా చెప్తాం: “యెహోవా బలిపీఠం లాంటి ఈ బలిపీఠాన్ని చూడండి. దీన్ని మా పూర్వీకులు కట్టారు. వాళ్లు దాన్ని దహనబలుల కోసమో, బలుల కోసమో కాదుగానీ మీకూ మాకూ మధ్య సాక్షిగా ఉండడానికి కట్టారు.” ’
29 మన దేవుడైన యెహోవా గుడారం ఎదుట ఉన్న ఆయన బలిపీఠానికి బదులుగా దహనబలులు, ధాన్యార్పణలు, బలుల కోసం వేరే బలిపీఠాన్ని కట్టి+ యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, నేడు యెహోవాను అనుసరించడాన్ని మానేయడం+ మా ఊహకందని విషయం!”
30 రూబేను, గాదు, మనష్షే వంశస్థులు చెప్పిన మాటల్ని యాజకుడైన ఫీనెహాసు, సమాజ ప్రధానులు, అతనితో ఉన్న ఇశ్రాయేలు వేలమందిలో పెద్దలైనవాళ్లు విన్నప్పుడు వాళ్లు సంతృప్తిపడ్డారు.+
31 అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు రూబేను, గాదు, మనష్షే వంశస్థులతో ఇలా అన్నాడు: “యెహోవా మన మధ్య ఉన్నాడని ఈ రోజు మాకు తెలిసింది, ఎందుకంటే మీరు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించారు.”
32 ఆ తర్వాత, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, ప్రధానులు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేనీయుల, గాదీయుల దగ్గర నుండి కనాను దేశానికి తిరిగొచ్చి, వాళ్లు చెప్పిన మాటల్ని మిగతా ఇశ్రాయేలీయులకు తెలియజేశారు.
33 అది విని ఇశ్రాయేలీయులు సంతృప్తిపడ్డారు. తర్వాత వాళ్లు దేవుణ్ణి స్తుతించారు. రూబేనీయులు, గాదీయులు ఉంటున్న ప్రాంతాన్ని నాశనం చేసేందుకు వాళ్ల మీదికి యుద్ధానికి వెళ్లడం గురించి వాళ్లు ఇంకేమీ మాట్లాడలేదు.
34 కాబట్టి రూబేనీయులు, గాదీయులు ఆ బలిపీఠానికి పేరు పెట్టి,* “యెహోవాయే సత్యదేవుడు అని చెప్పడానికి ఇది మన మధ్య సాక్షి” అని అన్నారు.
అధస్సూచీలు
^ అంటే, తూర్పు వైపున.
^ అక్ష., “భయపడకుండా.”
^ అక్ష., “తరాలకూ.”
^ సందర్భాన్ని బట్టి చూస్తే, ఆ బలిపీఠానికి “సాక్షి” అని పేరు పెట్టివుంటారు.