యెహోషువ 20:1-9

  • ఆశ్రయపురాలు (1-9)

20  అప్పుడు యెహోవా యెహోషువకు ఇలా చెప్పాడు:  “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు, ‘నేను మోషే ద్వారా మీకు చెప్పిన ఆశ్రయపురాల్ని+ మీ కోసం ఎంపిక చేసుకోండి.  ఎందుకంటే ఒక వ్యక్తి అనుకోకుండా లేదా పొరపాటున ఎవరినైనా చంపితే అక్కడికి పారిపోవచ్చు. ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి* నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.+  అతను ఆ నగరాల్లో ఒకదానికి పారిపోయి,+ నగర ద్వార+ ప్రవేశం దగ్గర నిలబడి ఆ నగర పెద్దలకు తన విషయం చెప్పాలి. అప్పుడు వాళ్లు అతన్ని నగరంలోకి తీసుకెళ్లి, అతనికి ఒక స్థలం ఇవ్వాలి. అతను వాళ్లతోపాటు నివసిస్తాడు.  ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి అతన్ని తరుముతుంటే, వాళ్లు అతన్ని తరిమే వ్యక్తి చేతికి అప్పగించకూడదు; ఎందుకంటే అతను తన తోటివాణ్ణి పొరపాటున చంపాడు, కానీ అంతకుముందు అతనిపై ద్వేషం లేదు.+  విచారణ కోసం అతను సమాజం ముందు హాజరయ్యేంత వరకు ఆ నగరంలోనే ఉండాలి.+ ఆ సమయంలో ప్రధానయాజకునిగా సేవచేస్తున్న వ్యక్తి చనిపోయేంత వరకు అతను అక్కడే నివసించాలి.+ తర్వాత, అతను ఏ నగరం నుండి పారిపోయి వచ్చాడో ఆ నగరానికి తిరిగెళ్లవచ్చు; తన నగరానికి, తన ఇంటికి వెళ్లిపోవచ్చు.’ ”  కాబట్టి ఇశ్రాయేలీయులు నఫ్తాలి పర్వత ప్రాంతంలోని గలిలయలో ఉన్న కెదెషును,+ ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో ఉన్న షెకెమును,+ యూదా పర్వత ప్రాంతంలో ఉన్న కిర్యతర్బాను,+ అంటే హెబ్రోనును ప్రత్యేకపర్చారు.*  అలాగే యెరికోకు తూర్పున యొర్దాను ప్రాంతంలో రూబేను గోత్రంలో నుండి పీఠభూమి మీది ఎడారిలో ఉన్న బేసెరును,+ గాదు గోత్రంలో నుండి గిలాదులో ఉన్న రామోతును,+ మనష్షే గోత్రంలో నుండి బాషానులో ఉన్న గోలానును+ ఎంపిక చేశారు.+  ఇవి ఇశ్రాయేలీయులందరి కోసం, వాళ్ల మధ్య నివసిస్తున్న విదేశీయుల కోసం నియమించబడిన నగరాలయ్యాయి. అనుకోకుండా ఎవరినైనా చంపిన వ్యక్తి ఆ నగరాలకు పారిపోయి, అతను విచారణ కోసం సమాజం ముందు హాజరయ్యేలోపు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి చేతిలో చావకుండా ఉండవచ్చు.+

అధస్సూచీలు

అక్ష., “రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి.”
లేదా “పవిత్రపర్చారు.”