యెహెజ్కేలు 7:1-27

  • అంతం వచ్చింది (1-27)

    • ఒక అసాధారణ విపత్తు (5)

    • వెండిని వీధుల్లో పడేస్తారు (19)

    • ఆలయాన్ని అపవిత్రపరుస్తారు (22)

7  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశం గురించి ఇలా అంటున్నాడు: ‘అంతం వచ్చింది! దేశం నలుమూలల మీదికి అంతం వచ్చేసింది.  అంతం ఇప్పుడు నీ మీదికి వచ్చేసింది, నేను నీ మీద నా ఆగ్రహాన్ని పూర్తిగా వెళ్లగక్కుతాను, నీ మార్గాల ప్రకారం నీకు తీర్పు తీర్చి, నీ అసహ్యమైన పనులన్నిటిని బట్టి నిన్ను లెక్క అడుగుతాను.  నా కన్ను నీ మీద జాలిపడదు, నేను కనికరపడను.+ నేను నీ మార్గాల ఫలితాల్ని నీ మీదికి రప్పిస్తాను, నీ అసహ్యమైన పనుల పర్యవసానాల్ని నువ్వు అనుభవిస్తావు.+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’+  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇదిగో! ఒక విపత్తు, ఒక అసాధారణ విపత్తు వస్తోంది.+  ఒక అంతం రాబోతుంది; అది వస్తుంది; అది హఠాత్తుగా నీ మీదికి వస్తుంది. ఇదిగో! అది వస్తోంది.  దేశ నివాసీ, నీ వంతు* వచ్చేసింది. ఆ సమయం వస్తోంది, ఆ రోజు దగ్గరపడింది.+ పర్వతాల మీద సంతోష కేకలకు బదులు అల్లకల్లోలం వినిపిస్తోంది.  “ ‘అతి త్వరలో నేను నీ మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను,+ నీ మీద నా ఆగ్రహాన్ని పూర్తిగా వెళ్లగక్కుతాను,+ నీ మార్గాల ప్రకారం నీకు తీర్పు తీర్చి, నీ అసహ్యమైన పనులన్నిటిని బట్టి నిన్ను లెక్క అడుగుతాను.  నా కన్ను జాలిపడదు, నేను కనికరపడను.+ నేను నీ మార్గాల ఫలితాల్ని నీ మీదికి రప్పిస్తాను, నీ అసహ్యమైన పనుల పర్యవసానాల్ని నువ్వు అనుభవిస్తావు. అప్పుడు యెహోవానైన నేను నిన్ను శిక్షిస్తున్నానని నువ్వు తెలుసుకుంటావు.+ 10  “ ‘ఇదిగో, ఆ రోజు! ఇదిగో, అది వస్తోంది!+ నీ వంతు* వచ్చేసింది; దండం మొగ్గ తొడిగింది, అహంకారం మొలకెత్తింది. 11  దౌర్జన్యం దుష్ట దండంగా మారింది.+ వాళ్లు గానీ, వాళ్ల సంపద గానీ, వాళ్ల సమూహాలు గానీ, వాళ్ల ఘనత గానీ మిగలవు. 12  ఆ సమయం వస్తుంది, ఆ రోజు వస్తుంది. కొనేవాడు సంతోషించకూడదు, అమ్మేవాడు ఏడ్వకూడదు, ఎందుకంటే వాళ్ల సమూహమంతటి మీద నా ఆగ్రహం రగులుకుంది.*+ 13  అమ్మినవాడు ప్రాణాలతో తప్పించుకున్నా తాను అమ్మినదాని దగ్గరికి తిరిగిరాడు, ఎందుకంటే ఈ దర్శనంలోని విషయాలు సమూహమంతటి మీదికి వస్తాయి. ఎవ్వరూ తిరిగిరారు, తన దోషం కారణంగా* ఎవ్వరూ ప్రాణాలు కాపాడుకోలేరు. 14  “ ‘వాళ్లు బాకా ఊదారు,+ ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉన్నారు, కానీ ఎవ్వరూ యుద్ధానికి వెళ్లడం లేదు; ఎందుకంటే నా ఆగ్రహం సమూహమంతటి మీద రగులుకుంది.+ 15  బయట ఖడ్గం ఉంది,+ లోపలేమో తెగులు, కరువు ఉన్నాయి. పొలంలో ఉన్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు, నగరంలో ఉన్నవాళ్లను కరువు, తెగులు మింగేస్తాయి.+ 16  ఏదోరకంగా తప్పించుకున్నవాళ్లు పర్వతాలకు వెళ్తారు, లోయల్లో నివసించే పావురాల్లా ప్రతీ వ్యక్తి తన దోషాన్ని బట్టి మూల్గుతాడు.+ 17  వాళ్లందరి చేతులు చచ్చుబడిపోతాయి, వాళ్లందరి మోకాళ్ల మీదుగా నీళ్లు కారతాయి.*+ 18  వాళ్లు గోనెపట్ట కట్టుకున్నారు,+ వాళ్లకు భయం పట్టుకుంది. ప్రతీ ఒక్కరు అవమానాలపాలు అవుతారు, ప్రతీ తల బోడి అవుతుంది.*+ 19  “ ‘వాళ్లు తమ వెండిని వీధుల్లో పడేస్తారు, తమ బంగారాన్ని అసహ్యించుకుంటారు. యెహోవా ఉగ్రత రోజున వాళ్ల వెండి గానీ, బంగారం గానీ వాళ్లను రక్షించలేదు.+ వాళ్లకు తృప్తి ఉండదు, వాళ్ల కడుపు నిండదు, ఎందుకంటే అది* వాళ్లకు అడ్డుగా తయారై వాళ్ల దోషానికి కారణమైంది. 20  వాళ్లు తమ ఆభరణాల అందాన్ని చూసుకొని గర్వపడ్డారు, వాటితో* తమ అసహ్యమైన ప్రతిమల్ని, హేయమైన విగ్రహాల్ని చేసుకున్నారు.+ అందుకే వాళ్లు దాన్ని అసహ్యించుకునేలా చేస్తాను. 21  నేను దాన్ని* విదేశీయులకు దోపుడుసొమ్ముగా, భూమ్మీది దుష్టులకు కొల్లసొమ్ముగా ఇస్తాను, వాళ్లు దాన్ని అపవిత్రపరుస్తారు. 22  “ ‘నేను వాళ్ల నుండి నా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాను,+ వాళ్లు నా చాటైన చోటును* అపవిత్రపరుస్తారు, దోపిడీదారులు దానిలోకి ప్రవేశించి దాన్ని అపవిత్రపరుస్తారు.+ 23  “ ‘సంకెళ్లు*+ తయారుచేయండి; ఎందుకంటే దేశం రక్తసిక్తమైన తీర్పులతో,+ నగరం దౌర్జన్యంతో నిండిపోయాయి.+ 24  జనాలన్నిట్లో అత్యంత ఘోరమైనవాళ్లను నేను రప్పిస్తాను,+ వాళ్లు దేశ నివాసుల ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు,+ నేను బలాఢ్యుల గర్వాన్ని పూర్తిగా అణచివేస్తాను, వాళ్ల పవిత్రమైన స్థలాలు అపవిత్రపర్చబడతాయి.+ 25  వేదన వచ్చినప్పుడు వాళ్లు శాంతి కోసం వెదుకుతారు, కానీ అది దొరకదు.+ 26  ఒక విపత్తు తర్వాత మరో విపత్తు, ఒక నివేదిక తర్వాత మరో నివేదిక వస్తుంటాయి, ప్రజలు ప్రవక్త దగ్గర దర్శనం కోసం చూస్తారు,+ అయితే యాజకుల దగ్గర ఉపదేశం,* పెద్దల దగ్గర సలహా* లేకుండా పోతాయి.+ 27  రాజు ఏడుస్తుంటాడు,+ ప్రధానుడు నిరాశలో మునిగిపోతాడు, దేశ ప్రజల చేతులు భయంతో వణికిపోతాయి. నేను వాళ్ల మార్గాల ప్రకారం వాళ్లతో వ్యవహరిస్తాను, వాళ్లు తీర్పు తీర్చినట్టే వాళ్లకు తీర్పు తీరుస్తాను. అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”+

అధస్సూచీలు

లేదా “పూలదండ” అయ్యుంటుంది.
లేదా “పూలదండ” అయ్యుంటుంది.
అంటే, నాశనం అందరి మీదికి వస్తుంది కాబట్టి ఆస్తిని కొనేవాడు గానీ అమ్మేవాడు గానీ లాభం పొందడు.
లేదా “తన దోషం ద్వారా” అయ్యుంటుంది.
అంటే, భయంతో మూత్ర విసర్జన వల్ల.
అంటే, దుఃఖంతో గుండు చేసుకుంటారు.
అంటే, వాళ్ల వెండిబంగారాలు.
అంటే, తమ వెండిబంగారు వస్తువులతో.
అంటే, విగ్రహాలు చేయడానికి ఉపయోగించిన వాళ్ల వెండిబంగారాల్ని.
యెహోవా పవిత్రమైన స్థలంలోని అత్యంత లోపలి భాగాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.
అంటే, చెరగా తీసుకెళ్లడానికి.
లేదా “ధర్మశాస్త్రం.”
లేదా “ఆలోచన.”