యెహెజ్కేలు 45:1-25

  • పవిత్రమైన కానుక, నగరం (1-6)

  • ప్రధానుడి భూభాగం (7, 8)

  • ప్రధానులు నిజాయితీగా నడుచుకోవాలి (9-12)

  • ప్రజల కానుకలు, ప్రధానుడు (13-25)

45  “ ‘మీరు దేశాన్ని స్వాస్థ్యంగా పంచి ​ఇచ్చేటప్పుడు,+ దేశంలో ఒక పవిత్రమైన భాగాన్ని యెహోవాకు కానుకగా ఇవ్వాలి.+ దాని పొడవు 25,000 మూరలు,* వెడల్పు 10,000 మూరలు ఉండాలి.+* ప్రాంత​మంతా పవిత్రమైన భాగంగా ఉంటుంది.  అందులో చతురస్రాకారంలో ఒక పవిత్ర స్థలం ఉంటుంది, దాని పొడవు 500 మూరలు, వెడల్పు 500 మూరలు;+ దానికి అన్నివైపులా 50 మూరల వెడల్పు గల ఒక పచ్చిక మైదానం ఉంటుంది.+  ఈ ప్రాంతం నుండి నువ్వు 25,000 మూరల పొడవు, 10,000 మూరల వెడల్పు ఉన్న స్థలాన్ని కొలవాలి; అందులో ఆలయం* ఉంటుంది, అది అతి పవిత్రమైన స్థలం.  అది యాజకులకు, అంటే యెహోవాకు పరిచారం చేయడానికి ఆయన్ని సమీపించే ఆలయ* పరిచారకులకు+ చెందిన పవిత్రమైన భాగంగా ఉంటుంది.+ ఈ స్థలం వాళ్లు ఇళ్లు కట్టుకునే స్థలంగా, ఆలయం కోసం పవిత్ర స్థలంగా ఉంటుంది.  “ ‘అలాగే ఆలయంలో పరిచారం చేసే లేవీయుల కోసం 25,000 మూరల పొడవు, 10,000 మూరల వెడల్పు గల ఒక స్థలం ఉంటుంది;+ వాళ్లు 20 భోజనాల గదుల్ని+ తమ స్వాస్థ్యంగా పొందుతారు.  “ ‘నువ్వు నగర స్వాస్థ్యంగా 25,000 మూరల పొడవు (పవిత్రమైన కానుకకు సమాంతరంగా), అలాగే 5,000 మూరల వెడల్పు గల ఒక ప్రాంతాన్ని ఇవ్వాలి.+ అది ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ చెందుతుంది.  “ ‘పవిత్రమైన కానుకకు, నగరానికి నియమించబడిన స్థలానికీ రెండువైపులా ప్రధానుడి స్థలం ఉంటుంది. అది పవిత్రమైన కానుకకు, నగర స్వాస్థ్యానికి పక్కన ఉంటుంది. అది పడమటి వైపు, తూర్పు వైపు ఉంటుంది. పడమటి సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు దాని పొడవు ఒక గోత్రానికి చెందిన ప్రాంతమంత ఉంటుంది.+  ఈ ప్రాంతం ఇశ్రాయేలులో అతని స్వాస్థ్యంగా ఉంటుంది. నా ప్రధానులు ఇక నా ప్రజల్ని బాధించరు;+ వాళ్లవాళ్ల గోత్రాల ప్రకారం ఇశ్రాయేలు ఇంటివాళ్లకు దేశాన్ని ఇస్తారు.’+  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇశ్రాయేలు ప్రధానులారా, మీరు చాలా దూరం వెళ్లారు!’ “ ‘దౌర్జన్యం చేయడం, అణచివేయడం ఆపి, నీతిన్యాయాల్ని జరిగించండి.+ నా ప్రజల ఆస్తిని లాక్కోవడం మానేయండి’+ అని సర్వోన్నత ​ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 10  ‘మీరు ఖచ్చితమైన త్రాసుల్ని, ఖచ్చితమైన ఈఫా కొలతను,* ఖచ్చితమైన బాత్‌ కొలతను* ఉపయో​గించాలి.+ 11  ఈఫా కొలతకు, బాత్‌ కొలతకు ఖచ్చితమైన కొలమానం ఉండాలి. బాత్‌ కొలత హోమర్‌లో* పదోవంతు ఉండాలి, ఈఫా కొలత హోమర్‌లో పదోవంతు ఉండాలి. హోమర్‌ ప్రామాణిక కొలమానంగా ఉంటుంది. 12  ఒక షెకెల్‌*+ 20 గీరాలు* ఉండాలి. 20 షెకెల్‌లు, 25 షెకెల్‌లు, 15 షెకెల్‌లు కలిపి మీకు ఒక మనెగా* ఉండాలి.’ 13  “ ‘మీరు అర్పించాల్సిన కానుక ఇది: ప్రతీ హోమర్‌ గోధుమల్లో నుండి ఈఫాలో ఆరోవంతు, ప్రతీ హోమర్‌ బార్లీలో నుండి ఈఫాలో ఆరోవంతు ఇవ్వాలి. 14  నూనెను బాత్‌ కొలత ప్రకారం ఇవ్వాలి. ఒక బాత్‌ ఒక కొర్‌లో* పదోవంతుతో సమానం, పది బాత్‌లు ఒక హోమర్‌ అవుతాయి, ఎందుకంటే పది బాత్‌లు ఒక హోమర్‌తో సమానం. 15  ఇశ్రాయేలు పశు సంపదలో, ప్రతీ 200 గొర్రెల్లో నుండి ఒక గొర్రెను ఇవ్వాలి. ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి+ ఇవి ధాన్యార్పణగా,+ సంపూర్ణ దహనబలిగా,+ సమాధాన బలులుగా+ ఉపయోగించబడతాయి’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 16  “ ‘దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని ప్రధానుడికి ఈ కానుక ఇవ్వాలి.+ 17  పండుగ సమయాల్లో, అమావాస్య రోజుల్లో, విశ్రాంతి రోజుల్లో,+ ఇశ్రాయేలు ఇంటివాళ్ల నియామక పండుగ రోజులన్నిట్లో+ అర్పించే సంపూర్ణ దహనబలుల,+ ధాన్యార్పణల,+ పానీయార్పణల+ బాధ్యత ఆ ప్రధానుడిదే. ఇశ్రాయేలు ​ఇంటివాళ్ల తరఫున ప్రాయశ్చిత్తం ​చేయడానికి పాపపరిహారార్థ బలి, ధాన్యార్పణ, సంపూర్ణ దహనబలి, సమాధాన బలులు ఏర్పాటు చేయాల్సింది అతనే.’ 18  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మొదటి నెల, మొదటి రోజున, నువ్వు మందలో నుండి ఏ లోపంలేని ఒక కోడెదూడను తీసుకుని, పవిత్రమైన స్థలాన్ని పాపం నుండి శుద్ధి చేయాలి.+ 19  యాజకుడు పాపపరిహారార్థ బలి రక్తంలో నుండి కొంచెం తీసుకుని, దాన్ని ఆలయ ద్వారబంధాల+ మీద, బలిపీఠం చుట్టూ ఉన్న అంచు నాలుగు మూలల మీద, లోపలి ప్రాంగణ ద్వారపు ద్వారబంధం మీద పూస్తాడు. 20  పొరపాటున లేదా తెలియక పాపం చేసినవాళ్ల కోసం+ నువ్వు ఆ నెల ఏడో రోజున ఇలా చేయాలి; అలా నువ్వు ఆలయాన్ని శుద్ధి చేయాలి.+ 21  “ ‘మొదటి నెల, 14వ రోజున మీరు పస్కా పండుగ ఆచరించాలి.+ మీరు ఏడురోజుల పాటు పులవని రొట్టెలు తినాలి.+ 22  ఆ రోజున ప్రధానుడు తన కోసం, దేశంలోని ప్రజలందరి కోసం పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను ఇస్తాడు.+ 23  పండుగ జరిగే ఏడురోజుల్లో ప్రతీరోజు అతను ఏ లోపంలేని ఏడు కోడెదూడల్ని, ఏ లోపంలేని ఏడు పొట్టేళ్లను యెహోవాకు సంపూర్ణ దహనబలిగా ఇస్తాడు;+ అలాగే పాపపరిహారార్థ బలిగా ప్రతీరోజు ఒక మేకపోతును ఇస్తాడు. 24  అంతేకాదు అతను ధాన్యార్పణగా ప్రతీ కోడెదూడతో పాటు ఒక ఈఫా పిండిని, ప్రతీ పొట్టేలుతో పాటు ఒక ఈఫా పిండిని ఇవ్వాలి; అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్‌* నూనెను ఇవ్వాలి. 25  “ ‘ఏడో నెల 15వ రోజు నుండి, పండుగ జరిగే ఏడురోజుల పాటు+ అతను ఇలాంటి పాపపరిహారార్థ బలిని, సంపూర్ణ దహనబలిని, ధాన్యార్పణను, నూనెను ఇవ్వాలి.’ ”

అధస్సూచీలు

ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
లేదా “దాని సరిహద్దుల లోపల ఉన్న.”
లేదా “పవిత్రమైన స్థలం.”
లేదా “పవిత్రమైన స్థలం.”
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
లేదా “మినా.” అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.