యెహెజ్కేలు 41:1-26

  • ఆలయ పవిత్రమైన స్థలం (1-4)

  • గోడ, పక్కగదులు (5-11)

  • పడమటి వైపున్న భవనం (12)

  • భవనాల్ని కొలవడం (13-15ఎ)

  • పవిత్రమైన స్థలం లోపల (15బి-26)

41  తర్వాత అతను నన్ను పవిత్రమైన స్థలం బయటి గదిలోకి* తీసుకొచ్చి, పక్కస్తంభాల్ని కొలిచాడు; ఒకటి కుడివైపున ఉంది, ఇంకొకటి ఎడమవైపున ఉంది. ప్రతీ స్తంభం మందం ఆరు మూరలు,*  వెడల్పు ఐదు మూరలు. ప్రవేశం వెడల్పు పది మూరలు. అతను ఆలయం పొడవును, వెడల్పును కొలిచాడు; దాని పొడవు 40 మూరలు, వెడల్పు 20 మూరలు.  తర్వాత అతను లోపలికి* వెళ్లి, ప్రవేశం రెండు పక్కస్తంభాల్ని కొలిచాడు; వాటి మందం రెండు మూరలు, వెడల్పు ఏడు మూరలు. ప్రవేశం వెడల్పు ఆరు మూరలు.  తర్వాత అతను పవిత్రమైన స్థలం బయటి గదికి ఎదురుగా ఉన్న గదిని కొలిచాడు; దాని పొడవు 20 మూరలు, వెడల్పు 20 మూరలు.+ అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఇది అతి పవిత్ర స్థలం.”+  తర్వాత అతను ఆలయ గోడను కొలిచాడు, దాని మందం ఆరు మూరలు. ఆలయం చుట్టూ ఉన్న గదుల వెడల్పు నాలుగు మూరలు.+  పక్కన ఉన్న ఆ గదులు మూడు అంతస్తుల్లో ఉన్నాయి, ప్రతీ అంతస్తులో 30 గదులు ఉన్నాయి. ఆ పక్కగదుల దూలాలు ఆలయ గోడ లోపలికి చొచ్చుకెళ్లకుండా, అవి ఆలయ గోడకు ఉన్న ఆధారాల మీద ఆనుకున్నాయి.+  కింది అంతస్తు నుండి పై అంతస్తులకు వెళ్లే కొద్దీ ఆ గదుల వెడల్పు పెరుగుతుంది.+ కింది అంతస్తు నుండి రెండో అంతస్తుకి, అక్కడి నుండి మూడో అంతస్తుకి వెళ్లడానికి ఆలయానికి రెండు వైపులా వలయాకారంలో మెట్లు ఉన్నాయి.  ఆలయం కింద, చుట్టూ ఎత్తైన గచ్చు ఉంది, దాని పక్కగదుల పునాదులు నేల నుండి పై మూల వరకు ఆరు మూరల కొలకర్ర అంత ఉన్నాయి.  పక్కగదుల బయటి గోడ మందం ఐదు మూరలు. ఆ గచ్చు మీద పక్కగదుల పొడవునా ఒక ఖాళీ స్థలం ఉంది,* అది కూడా ఆలయంలో భాగమే. 10  ఆలయానికి, భోజనాల గదులకు+ మధ్య రెండువైపులా 20 మూరల స్థలం ఉంది. 11  పక్కగదులకు, ఖాళీ స్థలానికి మధ్య ఉత్తరం వైపు ఒక ప్రవేశం ఉంది, అలాగే దక్షిణం వైపు ఇంకో ప్రవేశం ఉంది. చుట్టూ ఆ ఖాళీ స్థలం వెడల్పు ఐదు మూరలు ఉంది. 12  పడమటి వైపు ఖాళీ ప్రదేశానికి ఎదురుగా ఉన్న భవనం వెడల్పు 70 మూరలు, పొడవు 90 మూరలు; చుట్టూ ఆ భవనం గోడ మందం ఐదు మూరలు. 13  అతను ఆలయాన్ని కొలిచాడు, దాని పొడవు 100 మూరలు. ఖాళీ ప్రదేశం, ఆ భవనం,* దాని గోడలు కలిపి 100 మూరల పొడవు ఉన్నాయి. 14  తూర్పు వైపు ఆలయ ముందుభాగం, ఖాళీ ప్రదేశం మొత్తం వెడల్పు 100 మూరలు. 15  అతను వెనక ఖాళీ ప్రదేశం వైపు భవనం పొడవును కొలిచాడు, రెండువైపులా ఉన్న దాని వరండాలతో పాటు అది 100 మూరలు ఉంది. అతను పవిత్రమైన స్థలం బయటి గదిని, పవిత్రమైన స్థలం లోపలి గదిని,+ ప్రాంగణ వసారాల్ని కూడా కొలిచాడు, 16  అలాగే గడపల్ని, కిటికీల్ని,*+ ఆ మూడు స్థలాల్లో ఉన్న వరండాల్ని కొలిచాడు. గడప దగ్గర నేల నుండి కిటికీల వరకు చెక్క పలకలతో+ కప్పబడివుంది, కిటికీలు కూడా కప్ప​బడివున్నాయి. 17  ప్రవేశం పైభాగం కొలతల్ని, ఆలయం లోపలి కొలతల్ని, బయటి కొలతల్ని, చుట్టూ ఉన్న గోడ కొలతల్ని తీసుకోవడం జరిగింది. 18  దాని మీద కెరూబులు,+ ఖర్జూర చెట్లు+ చెక్కబడివున్నాయి; ప్రతీ రెండు కెరూబుల మధ్య ఒక ఖర్జూర చెట్టు ఉంది, ప్రతీ కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి. 19  ఒకపక్క ఉన్న ఖర్జూర చెట్టు వైపు మనిషి ముఖం, ఇంకోపక్క ఉన్న ఖర్జూర చెట్టు వైపు సింహం ముఖం ఉన్నాయి.+ ఆలయం అంతటా అవి అలాగే చెక్కబడివున్నాయి. 20  అడుగుభాగం నుండి ప్రవేశం పైభాగం వరకు పవిత్రమైన స్థలం గోడ మీద కెరూబులు, ఖర్జూర చెట్లు చెక్కబడివున్నాయి. 21  పవిత్రమైన స్థల ద్వారబంధాలు* చతురస్రాకారంలో ఉన్నాయి.+ పవిత్ర స్థలం* ముందు భాగంలో, 22  చెక్క బలిపీఠం+ లాంటిది ఒకటి ఉంది; దాని ఎత్తు మూడు మూరలు, పొడవు రెండు మూరలు. దానికి మూల కర్రలు ఉన్నాయి; దాని అడుగుభాగం,* పక్క భాగాలు చెక్కతో చేయబడ్డాయి. అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఇది యెహోవా ఎదుట ఉన్న బల్ల.”+ 23  పవిత్రమైన స్థలం బయటి గదికీ, అతి పవిత్ర స్థలానికీ రెండేసి తలుపులు ఉన్నాయి.+ 24  ఆ తలుపులకు మడత రెక్కలు ఉన్నాయి, ప్రతీ తలుపుకు రెండు రెక్కలు ఉన్నాయి. 25  గోడల మీద ఉన్నట్టే పవిత్రమైన స్థలం తలుపుల మీద కూడా కెరూబుల, ఖర్జూర చెట్ల రూపాలు చెక్కబడివున్నాయి.+ అంతేకాదు, వసారాకు బయటివైపు చెక్కతో చేసిన చూరు ఉంది. 26  వసారాకు రెండువైపులా, ఆలయ పక్క​గదుల పొడవునా, చూరుల మీద కిటికీలు,*+ ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి.

అధస్సూచీలు

అక్ష., “ఆలయం.” 41, 42 అధ్యాయాల్లో ఈ పదం పవిత్రమైన స్థలం బయటి గదిని (పవిత్ర స్థలాన్ని); లేదా పవిత్రమైన స్థలం మొత్తాన్ని (పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలంతో పాటు ఆలయాన్ని) సూచిస్తుంది.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
అంటే, పవిత్రమైన స్థలం లోపలి గదిలోకి, లేదా అతి పవిత్ర స్థలంలోకి.
ఆలయం చుట్టూ నడవడానికి సన్నని దారి అని తెలుస్తోంది.
అంటే, పవిత్రమైన స్థలానికి పడమటి వైపున్న భవనం.
లేదా “బయటివైపు ఇరుకుగా, లోపలివైపు వెడల్పుగా ఉండే కిటికీల్ని.”
అక్ష., “ద్వారబంధం.” ఇది పవిత్ర స్థలం గుమ్మాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.
అతి పవిత్ర స్థలాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.
అక్ష., “పొడవు.”
లేదా “బయటివైపు ఇరుకుగా, లోపలివైపు వెడల్పుగా ఉండే కిటికీలు.”