యెహెజ్కేలు 40:1-49

 • దర్శనంలో యెహెజ్కేలును ఇశ్రాయేలుకు తీసుకురావడం (1, 2)

 • యెహెజ్కేలు ఆలయ దర్శనం చూడడం (3, 4)

 • ప్రాంగణాలు, ద్వారాలు (5-47)

  • తూర్పు వైపున్న బయటి ద్వారం (6-16)

  • బయటి ప్రాంగణం; ఇతర ద్వారాలు (17-26)

  • లోపలి ప్రాంగణం, ద్వారాలు (27-37)

  • ఆలయ సేవ చేసేవాళ్ల గదులు (38-46)

  • బలిపీఠం (47)

 • ఆలయం వసారా (48, 49)

40  అది మేము చెరలోకి వెళ్లిన 25వ సంవత్సరం.+ ఆ సంవత్సరం ఆరంభంలో, నెల పదో రోజున, అంటే నగరం కూలిపోయిన 14వ సంవత్సరంలో,+ అదే రోజున యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది, ఆయన నన్ను నగరానికి తీసుకెళ్లాడు.+  దేవుని దర్శనాల ద్వారా ఆయన నన్ను ఇశ్రాయేలు దేశంలోకి తీసుకొచ్చి, చాలా ఎత్తైన ఒక పర్వతం మీద ఉంచాడు;+ దానిమీద దక్షిణం వైపున నగరం లాంటి ఒక నిర్మాణం కనిపించింది.  ఆయన నన్ను అక్కడికి తీసుకొచ్చినప్పుడు, రాగిలా మెరుస్తున్న ఒక మనిషి నాకు కనిపించాడు.+ అతను చేతిలో కొలనూలు, కొలకర్ర* పట్టుకొని+ ద్వారంలో నిలబడివున్నాడు.  అతను నాతో ఇలా అన్నాడు: “మానవ ​కుమారుడా, జాగ్రత్తగా గమనించు, శ్రద్ధగా విను, నేను చూపించే ప్రతీదాని మీద మనసుపెట్టు; అందుకే నువ్వు ఇక్కడికి తీసుకురాబడ్డావు. నువ్వు చూసే ప్రతీది ఇశ్రాయేలు ఇంటివాళ్లకు చెప్పాలి.”+  నేను చూసినప్పుడు, ఆలయం* బయట చుట్టూ ఒక గోడ కనిపించింది. ఆ మనిషి చేతిలో ఆరు మూరల (ప్రతీ మూరకు ఒక బెత్తెడు జతచేయబడింది)* పొడవు ఉన్న ఒక కొలకర్ర ఉంది. అతను ఆ గోడను కొలవడం మొదలుపెట్టాడు, అది ఒక కొలకర్ర మందం, ఒక కొలకర్ర ఎత్తు ఉంది.  తర్వాత అతను తూర్పు వైపున్న ద్వారం ​దగ్గరికి వచ్చి,+ దాని మెట్లు ఎక్కాడు. అతను ఆ ద్వారం గడపను కొలిచినప్పుడు అది ఒక కొలకర్ర వెడల్పు ఉంది, మరో గడప కూడా ఒక ​కొలకర్ర వెడల్పు ఉంది.  కాపలాదారుల గదుల్లో ఒక్కొక్కటి ఒక కొలకర్ర పొడవు, ఒక కొలకర్ర వెడల్పు ఉంది; కాపలాదారుల గదుల్లో+ ఒకదానికీ ఇంకోదానికీ మధ్య ఐదు మూరల దూరం ఉంది. ఆలయం వైపున్న ద్వారం వసారా పక్కన ఉన్న ద్వారం గడప ఒక కొలకర్ర ఉంది.  అతను ఆలయం వైపున్న ద్వారం వసారాను కొలిచాడు, అది ఒక కొలకర్ర ఉంది.  తర్వాత అతను ద్వారం వసారాను కొలిచాడు, అది ఎనిమిది మూరలు ఉంది; అతను దాని పక్కస్తంభాల్ని కొలిచాడు, అవి రెండు మూరలు ఉన్నాయి; ద్వారం వసారా ఆలయం వైపు ఉంది. 10  తూర్పు ద్వారానికి ఇటువైపు మూడు కాపలాదారుల గదులు, అటువైపు మూడు కాపలాదారుల గదులు ఉన్నాయి. ఆ మూడు గదుల కొలత ఒక్కటే, రెండు వైపులా ఉన్న వాటి పక్క​స్తంభాల కొలత కూడా ఒక్కటే. 11  తర్వాత అతను ద్వారప్రవేశం వెడల్పును కొలిచాడు, అది 10 మూరలు ఉంది; ద్వారం పొడవు 13 మూరలు. 12  రెండువైపులా ఉన్న కాపలాదారుల గదుల ముందు చుట్టుగోడ ఉన్న ప్రాంతం ఒక మూర ఉంది. రెండువైపులా ఉన్న కాపలాదారుల గదుల్లో ప్రతీది ఆరు మూరలు ఉంది. 13  తర్వాత అతను, ​కాపలాదారుల గదుల్లో ఒకదాని పైకప్పు* నుండి ​మరోదాని పైకప్పు వరకు ద్వారం వెడల్పు కొలిచాడు, అది 25 మూరలు ఉంది; ఆ గదులు ఒకదాని​కొకటి ​ఎదురెదురుగా ఉన్నాయి.+ 14  తర్వాత అతను పక్కస్తంభాల్ని కొలిచాడు, వాటి ఎత్తు 60 మూరలు; తర్వాత అతను ప్రాంగణం చుట్టూ ఉన్న ద్వారాల్లోని పక్కస్తంభాల్ని కొలిచాడు. 15  ద్వారప్రవేశం ముందుభాగం నుండి ఆలయం వైపున్న ద్వారం వసారా ముందుభాగం వరకు 50 మూరలు ఉంది. 16  ద్వారం లోపల రెండువైపులా ఉన్న కాపలాదారుల గదులకు, వాటి స్తంభాలకు కిటికీలు*+ ఉన్నాయి. వసారాల లోపల కూడా ​అన్నివైపులా కిటికీలు ఉన్నాయి, పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు+ ఉన్నాయి. 17  తర్వాత అతను నన్ను బయటి ప్రాంగణంలోకి తీసుకొచ్చాడు; నేను అక్కడ ​భోజనాల గదుల్ని,+ ప్రాంగణం చుట్టూ రాళ్లు పరిచిన దారిని చూశాను. దానిమీద 30 భోజనాల గదులు ఉన్నాయి. 18  ద్వారాల పక్కన ఉన్న ఈ దారి వెడల్పు, ద్వారాల పొడవుతో సమానం. ఇది దిగువ దారి. 19  తర్వాత అతను, కింది ద్వారం ముందుభాగం నుండి లోపలి ప్రాంగణానికి వెళ్లే ద్వారం వరకు దూరం* కొలిచాడు. అది తూర్పు వైపు, ఉత్తరం వైపు 100 మూరలు ఉంది. 20  బయటి ప్రాంగణానికి ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంది; అతను దాని పొడవును, వెడల్పును కొలిచాడు. 21  దాని రెండువైపులా మూడుమూడు కాపలాదారుల గదులు ఉన్నాయి. దాని పక్కస్తంభాల కొలత, వసారా కొలత మొదటి ద్వారంలోని వాటి కొలతలతో సమానం. ఈ ద్వారం పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 22  దాని కిటికీల కొలత, వసారా కొలత, ఖర్జూర చెట్ల+ కొలత తూర్పు ద్వారంలోని వాటి కొలతతో సమానం. దాన్ని ఎక్కడానికి ఏడు మెట్లు ఉన్నాయి, దాని వసారా వాటికి ఎదురుగా ఉంది. 23  ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ప్రాంగణంలో ఒక ద్వారం ఉంది, అలాగే తూర్పు ద్వారానికి ఎదురుగా కూడా ఒక ద్వారం ఉంది. అతను ద్వారానికీ ద్వారానికీ మధ్య దూరం కొలిచాడు, అది 100 మూరలు ఉంది. 24  తర్వాత అతను నన్ను దక్షిణం వైపుకు తీసుకొచ్చాడు, నాకు దక్షిణం వైపు ఒక ద్వారం+ కనిపించింది. అతను దాని పక్కస్తంభాల్ని, వసారాను కొలిచాడు; వాటి కొలత మిగతావాటి కొలతతో సమానం. 25  దానికి రెండువైపులా, అలాగే దాని వసారాకు మిగతా వాటికున్న కిటికీల లాంటి కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 26  దాన్ని ఎక్కడానికి ఏడు మెట్లు ఉన్నాయి,+ దాని వసారా వాటికి ఎదురుగా ఉంది. రెండువైపులా పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి. 27  లోపలి ప్రాంగణంలో దక్షిణం వైపుకు ఒక ద్వారం ఉంది; అతను దక్షిణం వైపు ద్వారానికీ ద్వారానికీ మధ్య దూరం కొలిచాడు, అది 100 మూరలు ఉంది. 28  ఆ తర్వాత అతను నన్ను దక్షిణ ద్వారం గుండా లోపలి ప్రాంగణంలోకి ​తీసుకొచ్చాడు; అతను దక్షిణ ద్వారాన్ని కొలిచాడు, దాని కొలత మిగతావాటి కొలతతో సమానం. 29  దాని కాపలాదారుల గదుల, పక్కస్తంభాల, వసారా కొలత మిగతావాటి కొలతతో సమానం. దానికి రెండువైపులా, అలాగే దాని వసారాకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు.+ 30  చుట్టూ ఉన్న ద్వారాలన్నిటికీ వసారాలు ఉన్నాయి; వాటి పొడవు 25 మూరలు, వెడల్పు 5 మూరలు. 31  దాని వసారా బయటి ప్రాంగణం వైపుకు ఉంది, దాని పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి;+ దాన్ని ఎక్కడానికి ఎనిమిది మెట్లు ఉన్నాయి.+ 32  అతను తూర్పు దిక్కు నుండి నన్ను లోపలి ప్రాంగణంలోకి తెచ్చినప్పుడు ఆ ద్వారాన్ని కొలిచాడు, దాని కొలత మిగతావాటి కొలతతో సమానం. 33  దాని కాపలాదారుల గదుల, పక్కస్తంభాల, వసారా కొలత మిగతావాటి కొలతతో సమానం. దానికి రెండువైపులా, అలాగే దాని వసారాకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 34  దాని వసారా బయటి ప్రాంగణం వైపుకు ఉంది, దాని రెండు పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి; దాన్ని ఎక్కడానికి ఎనిమిది మెట్లు ఉన్నాయి. 35  తర్వాత అతను నన్ను ఉత్తర ద్వారంలోకి తెచ్చి,+ దాన్ని కొలిచాడు; దాని కొలత మిగతావాటి కొలతతో సమానం. 36  దాని కాపలాదారుల గదుల, పక్కస్తంభాల, వసారా కొలత మిగతావాటి కొలతతో సమానం. దానికి రెండు​వైపులా కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 25 మూరలు. 37  దాని పక్కస్తంభాలు బయటి ప్రాంగణం వైపుకు ఉన్నాయి, దాని రెండు పక్కస్తంభాల మీద ఖర్జూర చెట్ల రూపాలు ఉన్నాయి; దాన్ని ఎక్కడానికి ఎనిమిది మెట్లు ఉన్నాయి. 38  ద్వారాల పక్కస్తంభాలకు దగ్గర్లో ఒక భోజనాల గది ఉంది, దానికి ఒక గుమ్మం ఉంది; అక్కడ సంపూర్ణ దహనబలి జంతువుల మాంసం కడుగుతారు.+ 39  ద్వారం వసారాకు రెండువైపులా రెండురెండు బల్లలు ఉన్నాయి, వాటిమీద సంపూర్ణ దహనబలి జంతువుల్ని,+ పాపపరిహారార్థ బలి జంతువుల్ని,+ అపరాధ పరిహారార్థ బలి జంతువుల్ని+ వధిస్తారు. 40  ఉత్తర ద్వారానికి వెళ్లే దారిలో, ద్వారప్రవేశం బయట రెండురెండు బల్లలు ఉన్నాయి. అంతేకాదు ద్వారం వసారా ​అవతలి వైపు కూడా రెండురెండు బల్లలు ఉన్నాయి. 41  ద్వారానికి ఒక్కోవైపు నాలుగు బల్లల చొప్పున మొత్తం ఎనిమిది బల్లలు ఉన్నాయి, ​వాటిమీద బలి జంతువుల్ని వధిస్తారు. 42  సంపూర్ణ దహనబలుల కోసం ఉపయోగించే నాలుగు బల్లలు రాతి బల్లలు. వాటి పొడవు మూరన్నర, వెడల్పు మూరన్నర, ఎత్తు మూర. దహనబలి జంతువుల్ని, బలుల్ని వధించే పనిముట్లను వాటిమీద ఉంచుతారు. 43  లోపలి గోడల నిండా బెత్తెడు వెడల్పు ఉన్న పిడులు ఉన్నాయి; బల్లల మీద అర్పణల మాంసం ఉంచుతారు. 44  లోపలి ద్వారం బయట గాయకుల+ భోజనాల గదులు ఉన్నాయి; అవి లోపలి ప్రాంగణంలో ఉత్తర ద్వారం దగ్గర ఉన్నాయి, వాటి గుమ్మాలు దక్షిణం వైపుకు ఉన్నాయి. తూర్పు ద్వారం దగ్గర మరో భోజనాల గది ఉంది, దాని గుమ్మం ఉత్తరం వైపుకు ఉంది. 45  అతను నాతో ఇలా అన్నాడు: “దక్షిణం వైపుకు గుమ్మం ఉన్న ఈ భోజనాల గది, ఆలయ సేవల్ని చూసుకునే యాజకులది.+ 46  ఉత్తరం వైపుకు గుమ్మం ఉన్న భోజనాల గది, బలిపీఠం దగ్గరి సేవల్ని చూసుకునే యాజకులది.+ వాళ్లు సాదోకు కుమారులు,+ యెహోవాను సమీపించి ఆయనకు పరిచారం చేయడానికి నియమించబడిన లేవీయులు.”+ 47  తర్వాత అతను లోపలి ప్రాంగణాన్ని కొలిచాడు. దాని పొడవు 100 మూరలు, వెడల్పు 100 మూరలు; అది చతురస్రాకారంలో ఉంది. ఆలయం ముందు బలిపీఠం ఉంది. 48  తర్వాత అతను నన్ను ఆలయ వసారాలోకి+ తీసుకొచ్చి, వసారా ప్రవేశం దగ్గరున్న పక్కస్తంభాల్ని కొలిచాడు; ఒక్కో స్తంభం మందం ఐదు మూరలు, వెడల్పు మూడు మూరలు. ఒక స్తంభం కుడివైపున ఉంది, ఇంకో స్తంభం ఎడమ​వైపున ఉంది. 49  వసారా పొడవు 20 మూరలు, వెడల్పు 11* మూరలు. ప్రజలు మెట్లు ఎక్కి దానిలోకి వచ్చేవాళ్లు. రెండువైపులా ఉన్న ఆ పక్కస్తంభాల పక్కన మరో రెండు స్తంభాలు ఉన్నాయి.+

అధస్సూచీలు

అనుబంధం B14 చూడండి.
అక్ష., “మందిరం.” 40-48 అధ్యాయాల్లో “మందిరం” అనే మాట ఆలయ భవన సముదాయాన్ని గానీ, అసలు ఆలయ భవనాన్ని గానీ సూచించినప్పుడు అలా చెప్పబడింది.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
కాపలాదారుల గది గోడ పైభాగాన్ని సూచిస్తుండవచ్చు.
లేదా “బయటివైపు ఇరుకుగా, లోపలివైపు వెడల్పుగా ఉండే కిటీకీలు.”
అక్ష., “వెడల్పు.”
లేదా “12” అయ్యుంటుంది.