యెహెజ్కేలు 37:1-28
37 తర్వాత, యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది, యెహోవా తన పవిత్రశక్తి* ద్వారా నన్ను తీసుకుపోయి ఒక లోయ మైదానం మధ్యలో దించాడు,+ దాని నిండా ఎముకలు ఉన్నాయి.
2 ఆయన వాటికి అన్నివైపులా నన్ను నడిపించాడు, ఆ లోయ మైదానంలో లెక్కలేనన్ని ఎముకలు ఉన్నాయి. అవి బాగా ఎండిపోయి ఉన్నాయి.+
3 ఆయన నన్ను, “మానవ కుమారుడా, ఈ ఎముకలు మళ్లీ బ్రతకగలవా?” అని అడిగాడు. అందుకు నేను, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.+
4 అప్పుడు ఆయన నాకు ఇలా చెప్పాడు: “ఈ ఎముకల గురించి ప్రవచించు, వాటితో ఇలా అను, ‘ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా చెప్పేది వినండి.
5 “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఈ ఎముకలతో ఇలా అంటున్నాడు: “నేను మీలోకి ఊపిరి వచ్చేలా చేస్తాను, మీరు బ్రతుకుతారు.+
6 నేను మీకు నరాల్ని, మాంసాన్ని ఇచ్చి చర్మంతో మిమ్మల్ని కప్పుతాను; మీలో ఊపిరి ఊదుతాను, మీరు బ్రతుకుతారు; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’ ”
7 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను ప్రవచించాను. నేను ప్రవచిస్తుండగా, టపటప కొట్టుకుంటున్న శబ్దం వినిపించింది, ఆ ఎముకలు ఒకదాని దగ్గరికి ఒకటి రావడం మొదలుపెట్టాయి.
8 నేను ఇంకా చూస్తుండగా వాటి మీదికి నరాలు, మాంసం వచ్చాయి, చర్మం వాటిమీద కప్పుకుంది. కానీ వాటిలో ఇంకా ఊపిరి లేదు.
9 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “గాలితో ప్రవచించు. మానవ కుమారుడా, గాలితో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “గాలీ,* నలుదిక్కుల నుండి వచ్చి, చంపబడిన ఈ ప్రజలు బ్రతికేలా వాళ్ల మీద వీచు.” ’ ”
10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను ప్రవచించాను, అప్పుడు వాటిలోకి ఊపిరి* వచ్చింది; వాళ్లు బ్రతికి తమ పాదాల మీద నిలబడ్డారు,+ వాళ్లంతా పెద్ద సైన్యంగా ఉన్నారు.
11 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ+ ఈ ఎముకల్లా ఉన్నారు. వాళ్లు ఇలా అనుకుంటున్నారు, ‘మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ నశించిపోయింది.+ మనం పూర్తిగా వేరుచేయబడ్డాం.’
12 కాబట్టి వాళ్లతో ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా ప్రజలారా, నేను మీ సమాధులు తెరిచి,+ మీ సమాధుల్లో నుండి మిమ్మల్ని లేపి, ఇశ్రాయేలు దేశానికి మిమ్మల్ని తీసుకొస్తాను.+
13 నా ప్రజలారా, నేను మీ సమాధులు తెరిచి, మీ సమాధుల్లో నుండి మిమ్మల్ని లేపినప్పుడు, నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’+
14 ‘నేను నా పవిత్రశక్తిని* మీలో ఉంచుతాను, మీరు బ్రతుకుతారు,+ నేను మిమ్మల్ని మీ దేశంలో స్థిరపడేలా చేస్తాను; అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్పానని, నేనే దాన్ని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
15 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
16 “మానవ కుమారుడా, ఒక కర్ర తీసుకుని దానిమీద, ‘యూదాకు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెందినది’+ అని రాయి. ఇంకో కర్ర తీసుకుని దానిమీద, ‘ఎఫ్రాయిము కర్ర, యోసేపుకు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ చెందినది’+ అని రాయి.
17 తర్వాత, ఆ రెండు కర్రలు నీ చేతిలో ఒక్క కర్ర అయ్యేలా వాటిని కలిపి పట్టుకో.+
18 నీ ప్రజలు, ‘వీటి అర్థం ఏంటో మాకు చెప్తావా?’ అని నిన్ను అడిగినప్పుడు,
19 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో ఉన్న ఇశ్రాయేలు గోత్రాల్ని తీసుకుని వాళ్లను యూదా కర్రతో కలుపుతాను; నేను వాటిని ఒకే కర్రగా చేస్తాను,+ అవి నా చేతిలో ఒకే కర్ర అవుతాయి.” ’
20 నువ్వు రాసే కర్రలు వాళ్లు చూడగలిగేలా అవి నీ చేతిలో ఉండాలి.
21 “తర్వాత వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలీయుల్ని వాళ్లు వెళ్లిన జనాల్లో నుండి తీసుకొస్తాను, అన్ని దిక్కుల నుండి వాళ్లను సమకూర్చి వాళ్ల దేశానికి వాళ్లను తీసుకొస్తాను.+
22 దేశంలో, ఇశ్రాయేలు పర్వతాల మీద వాళ్లను ఒకే జనాంగంగా చేస్తాను,+ వాళ్లందరి మీద ఒకే రాజు పరిపాలిస్తాడు,+ వాళ్లు ఇక రెండు జనాలుగా ఉండరు; రెండు రాజ్యాలుగా విడిపోయి ఉండరు.+
23 ఇక తమ అసహ్యమైన విగ్రహాలతో,* హేయమైన పనులతో, తమ తప్పులన్నిటితో తమను తాము అపవిత్రపర్చుకోరు.+ వాళ్లు పాపం చేయడానికి కారణమైన వాళ్ల నమ్మకద్రోహం అంతటి నుండి నేను వాళ్లను కాపాడతాను, వాళ్లను శుద్ధి చేస్తాను. వాళ్లు నా ప్రజలుగా ఉంటారు, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను.+
24 “ ‘ “నా సేవకుడైన దావీదు వాళ్లకు రాజుగా ఉంటాడు,+ వాళ్లందరికీ ఒకే కాపరి ఉంటాడు.+ వాళ్లు నా న్యాయనిర్ణయాల ప్రకారం నడుచుకుంటారు, నా శాసనాల్ని జాగ్రత్తగా పాటిస్తారు.+
25 నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన దేశంలో, అంటే మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్లు నివసిస్తారు; వాళ్లూ, వాళ్ల పిల్లలూ,* వాళ్ల పిల్లల పిల్లలూ ఎప్పటికీ అందులో నివసిస్తారు;+ నా సేవకుడైన దావీదు ఎప్పటికీ వాళ్ల ప్రధానుడిగా* ఉంటాడు.+
26 “ ‘ “నేను వాళ్లతో ఒక శాంతి ఒప్పందం చేస్తాను; అది శాశ్వత ఒప్పందంగా ఉంటుంది. నేను వాళ్లను స్థిరపర్చి, ఎక్కువమందిని చేస్తాను,+ నా పవిత్రమైన స్థలాన్ని ఎప్పటికీ వాళ్లమధ్య ఉంచుతాను.
27 నా డేరా* వాళ్లతోపాటు* ఉంటుంది, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.+
28 నా పవిత్రమైన స్థలం ఎప్పటికీ వాళ్ల మధ్య ఉన్నప్పుడు, యెహోవానైన నేనే ఇశ్రాయేలును పవిత్రపరుస్తున్నానని జనాలు తెలుసుకుంటాయి.” ’ ”+
అధస్సూచీలు
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “ఊపిరీ.” పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
^ అక్ష., “కుమారులూ.”
^ లేదా “అధిపతిగా.”
^ లేదా “నివాస స్థలం; ఇల్లు.”
^ లేదా “వాళ్లమీద.”