యెహెజ్కేలు 33:1-33

  • కావలివాడి బాధ్యతలు (1-20)

  • యెరూషలేము నాశనం గురించి వార్త (21, 22)

  • శిథిలాల్లో నివసించేవాళ్లకు సందేశం (23-29)

  • ప్రజలు సందేశం ప్రకారం ప్రవర్తించరు (30-33)

    • “మధురమైన స్వరంతో ప్రణయగీతం పాడే వ్యక్తిలా” యెహెజ్కేలు (32)

    • ‘వాళ్ల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు’ (33)

33  తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2  “మానవ కుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి+ వాళ్లతో ఇలా అను,“ ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గం రప్పిస్తే,+ ఆ దేశ ప్రజలందరూ ఒక మనిషిని ఎంచుకొని, అతన్ని తమ కావలివాడిగా నియమించుకుంటే, 3  అతను ఆ దేశం మీదికి ఖడ్గం రావడం చూసి, బూర* ఊది ప్రజల్ని హెచ్చరించినప్పుడు,+ 4  ఎవరైనా బూర శబ్దం విని కూడా హెచ్చరికను పట్టించుకోకపోతే,+ ఖడ్గం వచ్చి అతన్ని చంపేస్తే, అతని చావుకు* అతనే బాధ్యుడు.+ 5  అతను బూర శబ్దం విన్నాడు కానీ హెచ్చరికను పట్టించుకోలేదు. అతని చావుకు* అతనే బాధ్యుడు. అతను హెచ్చరికను పట్టించుకునివుంటే ప్రాణాన్ని కాపాడుకునేవాడు. 6  “ ‘అయితే ఆ కావలివాడు ఖడ్గం రావడం చూసి కూడా బూరను ఊదకుండా,+ ప్రజల్ని హెచ్చరించకుండా ఉంటే, ఖడ్గం వచ్చి వాళ్లలో ఒకరి ప్రాణాలు తీసినప్పుడు, ఆ వ్యక్తి తన దోషం వల్ల చనిపోతాడు, అయితే అతని రక్తానికి ఆ కావలివాణ్ణి బాధ్యునిగా ఎంచుతాను.’*+ 7  “మానవ కుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలు ఇంటివాళ్లకు కావలివాడిగా నియమించాను; కాబట్టి నువ్వు నా నోటి నుండి ఏదైనా మాట విన్నప్పుడు, నా హెచ్చరికను వాళ్లకు చెప్పాలి.+ 8  నేను దుష్టుడితో, ‘దుష్టుడా, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు!’+ అని అన్నప్పుడు, ఆ దుష్టుడు తన ప్రవర్తన మార్చుకునేలా నువ్వు నోరు తెరిచి అతన్ని హెచ్చరించకపోతే, అతను తన దోషాన్ని బట్టి దుష్టుడిగానే చనిపోతాడు,+ కానీ అతని రక్తానికి నేను నిన్ను బాధ్యునిగా ఎంచుతాను. 9  అయితే, తన ప్రవర్తనను మార్చుకోమని నువ్వు దుష్టుణ్ణి హెచ్చరించినా అతను మారడానికి ఇష్టపడకపోతే, అతను తన దోషాన్ని బట్టి చనిపోతాడు;+ నువ్వు మాత్రం తప్పకుండా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.+ 10  “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘ “మేము చేసిన తిరుగుబాట్లు, మా పాపాలు మామీద భారంగా ఉన్నాయి, వాటివల్ల మేము నశించిపోతున్నాం;+ అలాంటప్పుడు మేము ఎలా జీవిస్తూ ఉంటాం?”+ అని మీరు అంటున్నారు.’ 11  వాళ్లతో ఇలా చెప్పు, ‘ “నా జీవం తోడు, దుష్టుడు చనిపోవడం వల్ల నాకు సంతోషం కలగదు,+ కానీ అతను తన ప్రవర్తన మార్చుకుని+ జీవిస్తూ ఉంటేనే నాకు సంతోషం”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. “మీ చెడు మార్గాల్ని విడిచిపెట్టి వెనక్కి తిరగండి;+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఎందుకు చనిపోవాలి?” ’+ 12  “మానవ కుమారుడా, నీ ప్రజలతో ఇలా అను, ‘నీతిమంతుడు తిరుగుబాటు చేసినప్పుడు, అతని నీతి అతన్ని రక్షించదు;+ అలాగే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడు, అతని దుష్టత్వం అతన్ని తడబడేలా చేయదు;+ అలాగే నీతిమంతుడు పాపం చేసిన రోజున అతను తన నీతిని బట్టి జీవిస్తూ ఉండలేడు.+ 13  నేను నీతిమంతునితో, “నువ్వు తప్పకుండా బ్రతికేవుంటావు” అని చెప్పినప్పుడు, అతను తన నీతిని నమ్ముకుని తప్పు* చేస్తే,+ అతను చేసిన నీతికార్యాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు; తాను చేసిన తప్పును బట్టి అతను చనిపోతాడు.+ 14  “ ‘నేను దుష్టునితో, “నువ్వు ఖచ్చితంగా చనిపోతావు” అని అన్నప్పుడు, అతను తన పాపాల్ని విడిచిపెట్టి, నీతిన్యాయాలతో నడుచుకుంటే,+ 15  తాకట్టు సొమ్మును తిరిగిచ్చేస్తే, దోచుకున్నదాన్ని తిరిగి చెల్లిస్తే,+ జీవాన్ని ఇచ్చే శాసనాల ప్రకారం నడుచుకుంటూ ఏ తప్పూ చేయకుండా ఉంటే, అతను తప్పకుండా బ్రతికేవుంటాడు.+ అతను చనిపోడు. 16  అతను చేసిన పాపాల్లో ఏదీ గుర్తుచేసుకోబడదు,+ అతను నీతిన్యాయాలతో నడుచుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా బ్రతికేవుంటాడు.’+ 17  “కానీ నీ ప్రజలు, ‘యెహోవా మార్గం సరిగ్గా లేదు’ అని అన్నారు, కానీ నిజానికి సరిగ్గా లేనిది వాళ్ల మార్గమే. 18  “నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి తప్పు చేస్తే, అతను దాన్ని బట్టి చనిపోవాలి.+ 19  అలాగే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి, న్యాయంగా నీతిగా నడుచుకుంటే, అతను అలా నడుచుకుంటున్నందుకు బ్రతికేవుంటాడు.+ 20  “కానీ మీరు, ‘యెహోవా మార్గం సరిగ్గా లేదు’ అని అన్నారు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీలో ప్రతీ ఒక్కరికి మీ మీ మార్గాల ప్రకారం తీర్పు తీరుస్తాను.” 21  చివరికి, మేము చెరగా వెళ్లిన 12వ సంవత్సరం పదో నెల ఐదో రోజున, యెరూషలేము నుండి పారిపోయిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి,+ “నగరం ఆక్రమించబడింది!”+ అని చెప్పాడు. 22  అతను రావడానికి ముందురోజు సాయంత్రం యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది; ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రావడానికి ముందు ఆయన నా నోరు తెరిచాడు. కాబట్టి నేను మళ్లీ మాట్లాడగలిగాను, ఇక మౌనంగా లేను.+ 23  తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 24  “మానవ కుమారుడా, ఈ శిథిలాల మధ్య నివసిస్తున్నవాళ్లు+ ఇశ్రాయేలు దేశం గురించి ఇలా చెప్పుకుంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే అయినా అతను దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు.+ కానీ మనం చాలామందిమి ఉన్నాం; దేశం ఖచ్చితంగా మనకు స్వాస్థ్యంగా ఇవ్వబడింది.’ 25  “కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు రక్తం ఒలికించని మాంసం తింటున్నారు,+ మీ అసహ్యమైన విగ్రహాల* వైపు చూస్తున్నారు, రక్తం చిందిస్తూ ఉన్నారు.+ అలాంటప్పుడు ఈ దేశం మీకు ఎలా ఇవ్వబడుతుంది? 26  మీరు మీ ఖడ్గాన్ని నమ్ముకుంటున్నారు,+ అసహ్యమైన పనులు చేస్తున్నారు, మీలో ప్రతీ వ్యక్తి తన పొరుగువాడి భార్యను అపవిత్రపర్చాడు.+ అలాంటప్పుడు ఈ దేశం మీకు ఎలా ఇవ్వబడుతుంది?” ’+ 27  “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా జీవం తోడు, శిథిలాల మధ్య నివసిస్తున్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు; బయట పొలంలో ఉన్నవాళ్లను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను; కోటల్లో, గుహల్లో నివసించేవాళ్లు రోగాలతో చనిపోతారు.+ 28  నేను దేశాన్ని ఎందుకూ పనికిరాని నిర్జన ప్రదేశంగా మారుస్తాను,+ గర్వానికి కారణమైన దాని బలం అంతమౌతుంది, ఇశ్రాయేలు పర్వతాలు ఎవ్వరూ సంచరించకుండా నిర్మానుష్యంగా తయారౌతాయి.+ 29  వాళ్లు చేసిన అసహ్యమైన పనులన్నిటిని బట్టి+ నేను దేశాన్ని ఎందుకూ పనికిరాని నిర్జన ప్రదేశంగా మార్చినప్పుడు+ నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.” ’ 30  “మానవ కుమారుడా, నీ ప్రజలు గోడల పక్కన, ఇంటి గుమ్మాల దగ్గర నీ గురించి మాట్లాడుకుంటున్నారు.+ వాళ్లలో ప్రతీ ఒక్కరు తన సహోదరుడితో, ‘రా, యెహోవా ఏం చెప్తాడో విందాం’ అని అంటున్నారు. 31  వాళ్లు ఎప్పటిలా నీ దగ్గరికి వచ్చి, నా ప్రజల్లా నీ ముందు కూర్చుంటారు; నువ్వు చెప్పే మాటలు వింటారు, కానీ వాటిని పాటించరు.+ తమ నోటితో నిన్ను విపరీతంగా పొగుడుతారు, కానీ వాళ్ల హృదయం అక్రమ లాభం కోసం తహతహలాడుతుంది. 32  ఇదిగో! నువ్వు వాళ్లకు, నేర్పుగా తంతివాద్యం వాయిస్తూ, మధురమైన స్వరంతో ప్రణయగీతం పాడే వ్యక్తిలా ఉన్నావు. వాళ్లు నీ మాటలు వింటారు, కానీ ఒక్కరు కూడా వాటిని పాటించరు. 33  అయితే ఆ మాటలు ఖచ్చితంగా నెరవేరతాయి, అవి నెరవేరినప్పుడు, తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్లు తెలుసుకుంటారు.”+

అధస్సూచీలు

అక్ష., “కొమ్ము.”
అక్ష., “రక్తానికి.”
అక్ష., “రక్తానికి.”
లేదా “లెక్క అడుగుతాను.”
లేదా “అన్యాయం.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.