యెహెజ్కేలు 30:1-26

  • ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-19)

    • నెబుకద్నెజరు దాడి చేస్తాడు (10)

  • ఫరో బలం విరగ్గొట్టబడుతుంది (20-26)

30  తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా ​దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఇలా ప్రవచించు, ‘సర్వోన్నత ​ప్రభువైన యెహోవా ఇలా అంటు​న్నాడు: “ ‘అయ్యో, ఆ రోజు వచ్చేస్తోంది!’ అని ఏడ్వండి.   ఎందుకంటే ఆ రోజు దగ్గరపడింది, అవును, యెహోవా రోజు దగ్గరపడింది.+ అది కారుమబ్బులు కమ్ముకునే రోజు,+ జనాలకు తీర్పుతీర్చే రోజు.+   ఐగుప్తు మీదికి ఒక ఖడ్గం వస్తుంది, ఐగుప్తులో శవాలు పడి​వున్నప్పుడు ​ఇతియోపియాకు భయం ​పట్టుకుంటుంది;ఐగుప్తు సంపద దోచుకోబడుతుంది, దాని పునాదులు కూలిపోతాయి.+   ఇతియోపియా,+ పూతు,+ లూదు అలాగే ఇతర జనాల ప్రజలందరూ,కూబు, ఒప్పంద దేశ ప్రజలు*అందరూ ఖడ్గం వల్ల చనిపోతారు.” ’   యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఐగుప్తు మద్దతుదారులు కూడా ​చనిపోతారు,గర్వానికి కారణమైన దాని బలం ​అణచివేయబడుతుంది.’+ “ ‘మిగ్దోలు+ నుండి సెవేనే+ వరకు వాళ్లు దేశంలో ఖడ్గం వల్ల చనిపోతారు’ అని సర్వో​న్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.  ‘అది దేశాలన్నిట్లో అత్యంత నిర్జన దేశంగా చేయబడుతుంది, దాని నగరాలు అత్యంత నిర్మానుష్య నగరాలు అవుతాయి.+  నేను ఐగుప్తులో అగ్ని రాజేసినప్పుడు, దానితో పొత్తు పెట్టుకున్నవాళ్లంతా నలగ్గొట్టబడినప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.  ఆ రోజు నేను ఓడల మీద సందేశకుల్ని పంపించి, తనమీద తాను నమ్మకం పెట్టుకున్న ఇతియోపియా భయంతో వణికిపోయేలా చేస్తాను; ఐగుప్తు మీదికి ఆ రోజు వచ్చినప్పుడు వాళ్లకు భయం పట్టుకుంటుంది, ఎందుకంటే అది ఖచ్చితంగా వస్తుంది.’ 10  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను బబులోను రాజైన నెబుకద్నెజరు* ద్వారా ఐగుప్తు సైన్యాల్ని అంతం చేస్తాను.+ 11  అతనూ, జనాల్లో అత్యంత కిరాతకమైన అతని దండ్లూ+ ఆ దేశంలోకి వచ్చి దాన్ని నాశనం చేస్తారు. వాళ్లు ఐగుప్తు మీదికి కత్తులు దూసి, దేశాన్ని శవాలతో నింపేస్తారు.+ 12  నేను నైలు కాలువల్ని+ ఎండిన నేలగా చేస్తాను, ఆ దేశాన్ని దుష్టుల చేతికి అప్పగిస్తాను.* నేను విదేశీయుల చేత ఆ దేశాన్ని, దానిలోని సమస్తాన్ని నిర్మానుష్యం చేస్తాను.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.’ 13  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను అసహ్యమైన విగ్రహాల్ని* కూడా నాశనం చేసి, నోఫులో* ఉన్న ​వ్యర్థమైన దేవుళ్లను అంతం చేస్తాను.+ ఇక ఐగుప్తు దేశంలో ఒక్క అధిపతి* కూడా ఉండడు, నేను ఐగుప్తు దేశంలో భయం పుట్టిస్తాను.+ 14  పత్రోసును+ నిర్మానుష్యం చేస్తాను, సోయనులో నిప్పు అంటి​స్తాను, నో* మీద శిక్ష విధిస్తాను.+ 15  ఐగు​ప్తుకు బలమైన దుర్గంలా ఉన్న సీను మీద నా ఉగ్రత కుమ్మరిస్తాను, నో జనాభాను నాశనం చేస్తాను. 16  ఐగుప్తులో అగ్ని రాజేస్తాను; సీనుకు భయం పట్టుకుంటుంది, నోలో శత్రువులు చొరబడతారు, నోఫు* పట్ట​పగలే దాడికి గురౌతుంది! 17  ఓను,* పిబేసెతు యువకులు ఖడ్గం వల్ల చనిపోతారు, ఆ నగరాలు చెరపట్టబడతాయి. 18  నేను తహపనేసులో ఐగుప్తు కాడిని విరగ్గొట్టినప్పుడు పగలే చీకటి అవుతుంది.+ గర్వానికి కారణమైన దాని బలం అంతమౌతుంది,+ మేఘాలు దాన్ని కమ్ముకుంటాయి, దాని పట్టణాలు చెరపట్టబడతాయి.+ 19  నేను ఐగుప్తుకు శిక్ష విధిస్తాను, అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ” 20  11వ సంవత్సరం మొదటి నెల ఏడో రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 21  “మానవ కుమారుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో చేతిని విరగ్గొట్టాను; అది బాగయ్యేలా దానికి కట్టుకట్టరు, అది మళ్లీ ఖడ్గం పట్టుకునేంత బలంగా తయారయ్యేలా దానికి పట్టీలు చుట్టరు.” 22  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను ఐగుప్తు రాజైన ఫరోకు వ్యతిరేకంగా ఉన్నాను,+ నేను అతని రెండు చేతుల్నీ అంటే బలమైనదాన్ని, విరిగినదాన్ని విరగ్గొట్టి,+ అతని చేతిలో నుండి ఖడ్గం పడిపోయేలా చేస్తాను.+ 23  తర్వాత నేను ఐగుప్తీయుల్ని జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను.+ 24  నేను బబులోను రాజు చేతుల్ని బలపర్చి,+ నా ఖడ్గాన్ని అతని చేతిలో ఉంచుతాను;+ అయితే ఫరో చేతుల్ని నేను విరగ్గొడతాను, ఫరో అతని ముందు* చనిపోతున్నవాడిలా గట్టిగా మూల్గుతాడు. 25  నేను బబులోను రాజు చేతుల్ని బలపరుస్తాను, అయితే ఫరో చేతులు చచ్చుబడిపోతాయి; నేను బబులోను రాజు చేతిలో నా ఖడ్గాన్ని పెట్టిన​ప్పుడు, అతను ఐగుప్తు దేశం మీదికి దాన్ని దూసినప్పుడు+ నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 26  నేను ఐగుప్తీయుల్ని జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”

అధస్సూచీలు

బహుశా, ఐగుప్తుతో పొత్తు పెట్టుకున్న ఇశ్రాయేలీయుల్ని సూచిస్తుండవచ్చు.
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “అమ్మేస్తాను.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “మెంఫిస్‌లో.”
లేదా “ప్రధానుడు.”
అంటే, థీబ్స్‌.
లేదా “మెంఫిస్‌.”
అంటే, హీలియోపొలిస్‌.
అంటే, బబులోను రాజు ముందు.