యెహెజ్కేలు 29:1-21

  • ఫరోకు వ్యతిరేకంగా ప్రవచనం (1-16)

  • బబులోనుకు జీతం ఐగుప్తు (17-21)

29  పదో సంవత్సరం పదో నెల 12వ రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, నువ్వు ఐగుప్తు రాజైన ఫరో వైపుకు నీ ముఖం తిప్పి, అతనికీ ఐగుప్తు అంతటికీ వ్యతిరేకంగా ప్రవచించు.+  నువ్వు ఇలా చెప్పు: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఐగుప్తు రాజువైన ఫరో, నేను నీకు ​వ్యతిరేకంగా ఉన్నాను,+నువ్వు నీ నైలు* కాలువల్లో పడుకొని ఉన్న భారీ సముద్రప్రాణివి.+నువ్వు, ‘నైలు నది నాది. నేనే దాన్ని నా కోసం చేసుకున్నాను’ అని చెప్పుకున్నావు.+   కానీ నేను నీ దవడలకు కొక్కేలు తగిలించి, నీ నైలు నదిలోని చేపలు నీ పొలుసులకు అంటుకునేలా చేస్తాను. నీ పొలుసులకు అంటుకున్న నైలు నది చేపలన్నిటితో పాటు నిన్ను నైలు నదిలో నుండి బయటికి లాగుతాను.   నిన్నూ నీ నైలు నది చేపలన్నిటినీ నేను ఎడారిలో విడిచిపెడతాను. నువ్వు బయట నేలమీద చచ్చి ​పడివుంటావు, ఎవరూ నిన్ను తీసి ​పాతిపెట్టరు.+ నేను నిన్ను అడవి జంతువులకు, ఆకాశ​పక్షులకు ఆహారంగా ఇస్తాను.+   అప్పుడు ఐగుప్తు నివాసులందరూ నేను యెహోవానని తెలుసుకుంటారు,ఎందుకంటే వాళ్లు ఇశ్రాయేలు ఇంటివాళ్లకు గడ్డిపోచ* కన్నా ఏమాత్రం అండగా నిలవలేదు.+   వాళ్లు* నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు నలిగిపోయావు,నీ వల్ల వాళ్ల భుజం విరిగిపోయింది. వాళ్లు నీమీద ఆనుకున్నప్పుడు నువ్వు ​విరిగిపోయావు,దాంతో వాళ్ల కాళ్లు తడబడ్డాయి.”+  “ ‘కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో నేను నీ మీదికి ఒక ఖడ్గాన్ని రప్పించి,+ నీలో ​మనుషులు గానీ ​జంతువులు గానీ లేకుండా చేస్తాను.  ఐగుప్తు దేశం నిర్జనంగా, పాడైన స్థలంగా తయారౌతుంది;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు; ఎందుకంటే నువ్వు,* ‘నైలు నది నాది. నేనే దాన్ని చేశాను’ అని చెప్పుకున్నావు.+ 10  కాబట్టి నేను నీకూ నీ నైలు నదికీ వ్యతిరేకంగా ఉన్నాను; నేను మిగ్దోలు+ నుండి సెవేనే+ వరకు, ఇతియోపియా సరిహద్దు వరకు ఐగుప్తు దేశాన్ని ఎండిపోయిన పాడుబడ్డ స్థలంగా, పనికిరాని నిర్జన ప్రాంతంగా చేస్తాను.+ 11  మనుషులు గానీ పశువులు గానీ దానిలో తిరగరు,+ 40 సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు. 12  నేను 40 ఏళ్లపాటు ఐగుప్తు దేశాన్ని దేశాలన్నిట్లో అత్యంత నిర్జన దేశంగా చేస్తాను, దాని నగరాలు అత్యంత నిర్మానుష్య నగరాలు అవుతాయి;+ నేను ఐగుప్తీయుల్ని జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను.”+ 13  “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఆ 40 సంవత్సరాల తర్వాత నేను ఐగుప్తీయుల్ని వాళ్లు చెదిరిపోయిన జనాల మధ్య నుండి తిరిగి సమకూరుస్తాను.+ 14  బందీలుగా వెళ్లిన ఐగుప్తు ప్రజల్ని పత్రోసు+ దేశానికి, తమ స్వదేశానికి తిరిగి తీసుకొస్తాను; అక్కడ వాళ్లు ఏమాత్రం ప్రాముఖ్యత​లేని రాజ్యంగా తయారౌతారు. 15  ఐగుప్తు మిగతా రాజ్యాల కన్నా తక్కువగా ఉంటుంది, అది ఇక వేరే జనాల మీద అధికారం చెలాయించదు;+ నేను వాళ్లను ఎంత తక్కువ స్థాయికి తెస్తానంటే వాళ్లు ఇక వేరే జనాల్ని లోబర్చుకోలేరు.+ 16  అది ఇంకెప్పుడూ ఇశ్రాయేలు ఇంటివాళ్లు దానిమీద నమ్మకం పెట్టుకునే స్థితిలో ఉండదు,+ బదులుగా అది కేవలం వాళ్ల తప్పును, అంటే సహాయం కోసం ఐగుప్తీయుల వైపు చూడడం అనే తప్పును వాళ్లకు గుర్తు చేస్తుంది. అప్పుడు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.” ’ ” 17  27వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18  “మానవ కుమారుడా, బబులోను రాజైన నెబుకద్నెజరు*+ తూరు మీద దాడి చేసేటప్పుడు తన సైన్యం చేత చాలా కష్టమైన పని చేయించాడు.+ ప్రతీ తల బోడి అయింది, ప్రతీ భుజం ఒరుచుకుపోయింది. కానీ తూరు విషయంలో పడ్డ కష్టానికి అతనికి గానీ, అతని సైన్యానికి గానీ జీతం దొరకలేదు. 19  “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘ఇదిగో, నేను ఐగుప్తు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు* ఇస్తున్నాను,+ అతను దాని సంపదను పట్టుకెళ్లిపోతాడు, దాని నుండి ఎంతో దోపుడుసొమ్మును, కొల్లసొమ్మును తీసుకెళ్తాడు; అది అతని సైన్యానికి జీతం అవుతుంది.’ 20  “ ‘తూరును* నాశనం చేసే విషయంలో వాళ్లు నా కోసమే పనిచేశారు కాబట్టి అతను పడ్డ శ్రమకు జీతంగా నేను ఐగుప్తు దేశాన్ని అతనికి ఇస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు. 21  “ఆ రోజున ఇశ్రాయేలు ఇంటివాళ్ల కోసం ఒక కొమ్మును మొలిపిస్తాను,*+ వాళ్ల మధ్య మాట్లాడే అవకాశం నీకు ఇస్తాను; అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.”

అధస్సూచీలు

ఇక్కడ, ఇకముందు “నైలు” అనేది నైలు నదిని, దాని సాగునీటి కాలువల్ని సూచిస్తుంది.
అక్ష., “రెల్లు.”
అంటే, ఇశ్రాయేలు ప్రజలు.
అక్ష., “అతను.”
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “నెబుకద్రెజరుకు.”
అక్ష., “దాన్ని.”
లేదా “ఇశ్రాయేలు ఇంటివాళ్లకు బలాన్ని చేకూరుస్తాను.”