యెహెజ్కేలు 26:1-21

  • తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-21)

    • “వలలు ఆరబెట్టుకునే చోటు” (514)

    • రాళ్లను, మట్టిని సముద్రంలో పడేయడం (12)

26  11వ సంవత్సరం, నెల మొదటి రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, తూరు నగరం యెరూషలేము గురించి,+ ‘ఆహా! జనా​లకు ద్వారంలా ఉన్న నగరం పడగొట్టబడింది!+ ఇప్పుడు అన్నీ నా దగ్గరికే వస్తాయి, నేను ధనవంతురాల్ని అవుతాను, ఎందుకంటే అది పాడైపోయింది’ అని అనుకుంది;  కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘తూరూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను; సముద్రం అలల్ని ఉప్పొంగజే​సినట్టు నేను అనేక జనాల్ని నీ మీదికి రప్పిస్తాను.  వాళ్లు తూరు ప్రాకారాల్ని నాశనం చేస్తారు, దాని బురుజుల్ని పడగొడతారు,+ నేను దాని మట్టిని తుడిచేసి, దాన్ని మెరిసే బండగా చేస్తాను.  అది సముద్రం మధ్యలో వలలు ఆరబెట్టుకునే చోటుగా తయారౌతుంది.’+ “ ‘స్వయంగా నేనే ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు, ‘అది జనాలకు దోపుడుసొమ్ము అవుతుంది.  దాని చుట్టుపక్కల పట్టణాలు* కత్తిపాలౌతాయి, అప్పుడు నేను యెహోవానని ప్రజలు తెలుసుకుంటారు.’  “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇదిగో నేను తూరు మీదికి ఉత్తరం నుండి బబులోను రాజైన ​నెబుకద్నెజరును* రప్పిస్తున్నాను;+ అతను గుర్రాలు,+ యుద్ధ రథాలు,+ గుర్రపురౌతులు, ఎంతోమంది సైనికుల* సైన్యం ఉన్న రాజాధిరాజు.+  అతను నీ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్ని కత్తితో నాశనం చేస్తాడు; నీ ఎదురుగా ముట్టడిగోడ కడతాడు, ముట్టడిదిబ్బ వేస్తాడు, డాళ్లతో ఒక పెద్ద కవచం ఏర్పాటుచేస్తాడు.  తన యుద్ధ* యంత్రంతో నీ ప్రాకారాల్ని పడగొడతాడు, గొడ్డళ్లతో* నీ బురుజుల్ని కూలగొడతాడు. 10  అతని విస్తారమైన గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కప్పేస్తుంది; ప్రాకారాలు బీటలు​వారిన నగరం మీద సైనికులు విరుచుకుపడినట్టు అతను నీ ద్వారాల్లో ప్రవేశించినప్పుడు గుర్రపురౌతుల, చక్రాల, రథాల శబ్దానికి నీ ప్రాకారాలు కంపిస్తాయి. 11  అతని గుర్రాల డెక్కలు నీ వీధులన్నిటినీ తొక్కేస్తాయి;+ అతను నీ ప్రజల్ని కత్తితో చంపుతాడు, నీ బలమైన స్తంభాలు నేలమట్టం అవుతాయి. 12  వాళ్లు నీ సంపదల్ని దోచుకుంటారు, నీ వ్యాపారాన్ని కొల్లగొడతారు,+ నీ ప్రాకారాల్ని పడగొడతారు, నీలోని శ్రేష్ఠమైన ఇళ్లను కూలగొడతారు; తర్వాత నీ రాళ్లను, కలపను, మట్టిని సముద్రంలో పడేస్తారు.’ 13  “ ‘నేను నీలో పాటలు వినబడకుండా చేస్తాను, వీణల* శబ్దం ఇక నీలో వినిపించదు.+ 14  నిన్ను మెరిసే బండగా చేస్తాను, నువ్వు వలలు ఆరబెట్టుకునే చోటువి అవుతావు.+ నువ్వు మళ్లీ ఎప్పటికీ కట్టబడవు, యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 15  “సర్వోన్నత ప్రభువైన యెహోవా తూరుతో ఇలా అంటున్నాడు: ‘నువ్వు కూలిపోతున్న శబ్దం వినిపించినప్పుడు, చనిపోతున్నవాళ్లు మూలుగుతున్నప్పుడు, నీలో ప్రజలు చంపబడుతున్నప్పుడు ద్వీపాలు భయంతో వణి​కిపోవా?+ 16  సముద్ర అధిపతులందరూ* తమ సింహాసనాల మీద నుండి దిగి, తమ అంగీల్ని,* బుట్టాపని* చేసిన వస్త్రాల్ని తీసేసి భయంతో వణికిపోతారు. వాళ్లు నేలమీద కూర్చొని, భయంతో వణికిపోతూ నీ వైపు ఆశ్చర్యంగా చూస్తారు.+ 17  వాళ్లు నీ గురించి ఒక శోకగీతం పాడి,+ నీతో ఇలా అంటారు: “సముద్ర ప్రజలు నివసించే నగరమా, ఖ్యాతిగల నగరమా, నువ్వు నాశనం అయ్యావేంటి?+నువ్వూ, నీ నివాసులూ సముద్రం మీద బలవంతులు,+మీరు భూమ్మీది ప్రజలందరికీ భయం పుట్టించారు! 18  నువ్వు కూలిపోయిన రోజున ద్వీపాలు భయంతో వణుకుతాయి,నువ్వు లేకుండా పోయినప్పుడు సముద్రంలోని దీవులు కలవరపడతాయి.” ’+ 19  “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను పాడుచేసి, నివాసులు లేని నగరాల్లా చేసినప్పుడు, ఉప్పొంగే జలాలతో నిన్ను ముంచెత్తి, విస్తార జలాలతో నిన్ను కప్పేసినప్పుడు,+ 20  నేను నిన్నూ నీతోపాటు గోతిలోకి* దిగిపోతున్న వాళ్లనూ ప్రాచీనకాల ప్రజల దగ్గరికి చేరుస్తాను; నాశనమైన ఇతర ప్రాచీన నగరాల్లా నిన్ను అత్యంత అడుగున ఉన్న స్థలంలో నివసించేలా చేస్తాను, నువ్వు గోతిలోకి దిగిపోతున్న వాళ్లతో పాటు ఉంటావు;+ దానివల్ల ఇక నీలో ఎవరూ నివసించరు. తర్వాత నేను సజీవుల దేశాన్ని మహిమపరుస్తాను.* 21  “ ‘నీ మీదికి అకస్మాత్తుగా భయం రప్పిస్తాను, నువ్వు ఇక ఉండవు.+ వాళ్లు నీ కోసం వెదుకుతారు కానీ నువ్వు ఇంకెప్పటికీ ​కనిపించవు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”

అధస్సూచీలు

అక్ష., “కూతుళ్లు.”
అక్ష., “నెబుకద్రెజరును.”
లేదా “దేశదేశాల.”
లేదా “దాడిచేసే.”
లేదా “ఖడ్గాలతో.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “ప్రధానులందరూ.”
లేదా “చేతు​ల్లేని నిలువుటంగీల్ని.”
అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “సమాధిలోకి.”
లేదా “అలంకరిస్తాను.”