యెహెజ్కేలు 23:1-49

  • నమ్మకద్రోహులైన అక్కాచెల్లెళ్లు (1-49)

    • ఒహొలా అష్షూరుతో (5-10)

    • ఒహొలీబా బబులోనుతో, ఐగుప్తుతో (11-35)

    • ఇద్దరు అక్కాచెల్లెళ్లకు శిక్ష (36-49)

23  యెహోవా వాక్యం మళ్లీ నా ​దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు ఉండేవాళ్లు.+  వాళ్లు ఐగుప్తులో వేశ్యలు అయ్యారు;+ తమ ​యౌవనకాలం నుండి వాళ్లు వేశ్యల్లా ప్రవర్తిస్తూ వచ్చారు. అక్కడ వాళ్ల రొమ్ముల్ని నొక్కారు, వాళ్ల కన్యాత్వపు రొమ్ముల్ని నలిపారు.  వాళ్లలో పెద్దదాని పేరు ఒహొలా,* ఆమె చెల్లి పేరు ఒహొలీబా.* ఇద్దరూ నాకు సొంతమై, కుమారులనూ కూతుళ్లనూ కన్నారు. ఒహొలా సమరయ,+ ఒహొలీబా యెరూషలేము.  “ఒహొలా నాకు భార్యగా ఉంటూనే వ్యభిచారం చేసింది.+ ఆమె తన ప్రియుల్ని అంటే తన పొరుగువాళ్లయిన అష్షూరీయుల్ని+ మోహించింది.+  వాళ్లు ఎవరంటే, నీలంరంగు బట్టలు వేసుకున్న అధిపతులు, ఉప పాలకులు; వాళ్లందరూ తమ గుర్రాల మీద తిరిగే అందమైన యువకులు.  ఆమె అష్షూరీయుల్లో శ్రేష్ఠులైన వాళ్లందరితో వ్యభిచారం చేస్తూ వచ్చింది, తాను మోహించిన వాళ్ల అసహ్యమైన విగ్రహాలతో* తనను తాను అపవిత్రపర్చుకుంది.+  తాను ఐగుప్తులో నేర్చుకున్న వేశ్యాతనాన్ని ఆమె విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఆమె యౌవనంలో వాళ్లు ఆమెతో పడుకున్నారు, వాళ్లు ఆమె కన్యాత్వపు రొమ్ముల్ని నలిపి తమ కామోద్రేకాన్ని ఆమె మీద కుమ్మరించారు.+  కాబట్టి నేను ఆమెను ఆమె ప్రియుల చేతికి అంటే ఆమె మోహించిన అష్షూరీయుల చేతికి అప్పగించాను.+ 10  వాళ్లు ఆమె మానాన్ని బట్ట​బయలు చేసి,+ ఆమె కుమారులనూ కూతు​ళ్లనూ పట్టుకొని,+ ఆమెను కత్తితో చంపేశారు. అలా ఆమె స్త్రీలలో అపకీర్తి పాలైంది, వాళ్లు ఆమెను శిక్షించారు. 11  “అది చూసి, ఆమె చెల్లి ఒహొలీబా ఇంకా దిగజారిపోయింది; ఆమె తన అక్క కన్నా ఘోరంగా వ్యభిచారం చేసింది.+ 12  ఆమె తన పొరుగువాళ్లయిన అష్షూరీయుల్ని అంటే వాళ్లలోని అధిపతుల్ని, ఉప పాలకుల్ని మోహించింది.+ వాళ్లందరూ శ్రేష్ఠమైన బట్టలు వేసుకుని, గుర్రాల మీద తిరిగే అందమైన యువకులు. 13  ఆమె తనను తాను అపవిత్రపర్చుకున్నప్పుడు, వాళ్లిద్దరూ ఒకే దారిలో నడిచారని+ నేను గ్రహించాను. 14  అయితే ఆమె ఇంకా ఎక్కువగా వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చింది. గోడమీద చెక్కబడిన పురుషుల బొమ్మల్ని, ఎర్రరంగు వేసిన కల్దీయుల చెక్కడాల్ని ఆమె చూసింది. 15  వాళ్ల నడుము చుట్టూ దట్టీలు, తలల మీద పొడవాటి తలపాగాలు ఉన్నాయి; వాళ్లు యోధుల్లా కనిపిస్తున్నారు, వాళ్లంతా కల్దీయుల దేశంలో పుట్టిన బబులోనీయుల్లా ఉన్నారు. 16  వాటిని చూడగానే ఆమె వాళ్లను మోహించి, వాళ్ల కోసం కల్దీయ దేశానికి సందే​శకుల్ని పంపించింది.+ 17  దాంతో బబులోనీయులు ఆమెతో పడుకోవడానికి రావడం మొద​లుపెట్టారు, తమ కామోద్రేకంతో ఆమెను అప​విత్రపర్చారు. వాళ్లు తనను అపవిత్రపర్చాక ఆమె అసహ్యంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. 18  “ఆమె సిగ్గులేకుండా వ్యభిచారం చేస్తూ, తన మానాన్ని వెల్లడి చేసుకుంటున్నప్పుడు+ నేను ఆమె అక్క దగ్గర నుండి అసహ్యంతో వెళ్లిపోయినట్టే ఆమె దగ్గర నుండి కూడా అసహ్యంతో వెళ్లిపోయాను.+ 19  అయితే ఆమె ఐగుప్తు దేశంలో వ్యభిచారం చేసిన తన యౌవన రోజుల్ని గుర్తుచేసుకుంటూ,+ ఇంకా ఎక్కువగా వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చింది. 20  గాడిదలకు, గుర్రాలకు ఉన్నలాంటి జననేంద్రియాలు గల పురుషుల ఉంపుడుగత్తెల్లా ఆమె వాళ్లను మోహించింది. 21  నువ్వు యౌవనంలో ఉండగా ఐగుప్తీయులు నీ యౌవనకాల రొమ్ముల్ని నలిపినప్పటి+ అసభ్య పనుల కోసం నువ్వు ఎంతో తపించావు.+ 22  “కాబట్టి ఒహొలీబా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు ఎవరి దగ్గరి నుండైతే అసహ్యంతో వెళ్లిపోయావో ఆ ప్రియుల్ని నీ మీదికి రేపుతు​న్నాను,+ వాళ్లను అన్నివైపుల నుండి నీ మీదికి రప్పిస్తాను;+ 23  బబులోనీయుల్ని,+ కల్దీయులందర్నీ,+ పెకోదు,+ శోయ, కోయ ప్రాంతాల వాళ్లను, అష్షూరీయులందర్నీ నీ మీదికి రప్పిస్తాను; వాళ్లందరూ అందమైన ​యువకులు, అధిపతులు, ఉప పాలకులు, యోధులు, ఎంపిక చేయబడ్డవాళ్లు, గుర్రాల మీద తిరిగేవాళ్లు. 24  వాళ్లు అనేక యుద్ధ రథాలతో, చక్రాలతో, సైన్యాలతో, పెద్ద డాళ్లతో, చిన్న డాళ్లతో,* శిరస్త్రాణాలతో* వచ్చి నీ మీద దాడి చేస్తారు. వాళ్లు నిన్ను చుట్టుముడతారు; నేను వాళ్లకు తీర్పు తీర్చే అధికారం ఇస్తాను, వాళ్లు తమ ​పద్ధతిలో నీకు తీర్పు తీరుస్తారు. 25  నా ఉగ్రతను నీ మీద చూపిస్తాను, వాళ్లు విపరీతమైన కోపంతో నీ మీదికి వస్తారు. వాళ్లు నీ ముక్కును, చెవుల్ని కోసేస్తారు; నీలో మిగిలినవాళ్లు కత్తి వల్ల చనిపోతారు. వాళ్లు నీ కుమారుల్ని, కూతుళ్లను తీసుకెళ్లిపోతారు, నీలో మిగిలినవాళ్లను అగ్ని దహించేస్తుంది.+ 26  వాళ్లు నీ బట్టల్ని ఊడదీసి,+ నీ అందమైన నగల్ని లాక్కుంటారు.+ 27  ఐగుప్తు దేశంలో ​మొదలైన నీ అసభ్య ప్రవర్తనను, నీ వేశ్యాత​నాన్ని+ నేను అంతం చేస్తాను.+ నువ్వు వాళ్లవైపు చూడడం మానేస్తావు, ఐగుప్తును ఇక గుర్తుచేసుకోవు.’ 28  “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు ఎవరినైతే ద్వేషించావో, ఎవరి దగ్గర నుండి అస​హ్యంతో వెళ్లిపోయావో వాళ్ల చేతికి నిన్ను అప్ప​గించబోతున్నాను.+ 29  వాళ్లు ద్వేషంతో నీ మీద చర్య తీసుకుంటారు, నీ కష్టార్జితమంతా లాగేసుకుని+ నిన్ను బట్టలు లేకుండా దిగం​బరంగా వదిలేస్తారు. నీ అవమానకరమైన దిగంబరత్వం, నీ అసభ్య ప్రవర్తన, నీ వ్యభిచారం బట్టబయలౌతాయి.+ 30  నువ్వు ఒక వేశ్యలా జనాల వెంటపడి,+ వాళ్ల అసహ్యమైన విగ్రహాలతో నిన్ను అపవిత్రపర్చుకున్నావు+ కాబట్టి నీకు ఇలా జరుగుతుంది. 31  నువ్వు నీ సహోదరి నడిచిన దారిలోనే నడిచావు+ కాబట్టి, నేను ఆమె గిన్నెను నీ చేతిలో  పెడతాను.’+ 32  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘లోతుగా, వెడల్పుగా ఉన్న నీ సహోదరి గిన్నెలోనిది నువ్వు తాగుతావు,+ప్రజలు నిన్ను చూసి నవ్వుతారు, ​ఎగాతాళి చేస్తారు;+ ఆ గిన్నె నిండా అవే ఉన్నాయి. 33  నువ్వు నీ సహోదరి సమరయ ​గిన్నెలోనిది తాగి,మత్తులో, దుఃఖంలో మునిగిపోతావు,నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు, నువ్వు నిర్జనంగా తయారౌతావు. 34  నువ్వు దానిలోనిది పూర్తిగా తాగి,+ దాని మట్టి పెంకుల్ని కొరుకుతావు,తర్వాత దుఃఖంతో నీ రొమ్ముల్ని ​కోసేసుకుంటావు. “ఎందుకంటే నేనే ఈ మాట చెప్పాను” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.’ 35  “కాబట్టి, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు+ కాబట్టి, నీ అసభ్య ప్రవర్తన పర్యవసానాల్ని, నీ వ్యభిచార క్రియల పర్యవసానాల్ని అనుభవిస్తావు.’ ” 36  తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు ఒహొలా మీద, ఒహొలీబా+ మీద తీర్పు ప్రకటించి, వాళ్ల హేయమైన పనుల్ని వాళ్లకు చెప్తావా? 37  వాళ్లు వ్యభిచారం* చేశారు,+ వాళ్ల చేతులకు రక్తం అంటుకుంది. వాళ్లు తమ అసహ్యమైన విగ్రహాల్ని పూజించడమే* కాదు, వాళ్లు నాకు కన్న కుమారుల్ని తమ విగ్రహాలకు ఆహారంగా అగ్నిలో వేసి కాల్చారు.*+ 38  అంతేకాదు, వాళ్లు నా విషయంలో ఇలా చేశారు: ఆ రోజున వాళ్లు నా పవిత్రమైన స్థలాన్ని మలినం చేసి, నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు. 39  వాళ్లు తమ కుమారుల్ని తమ అసహ్యమైన విగ్రహాలకు బలి ఇచ్చాక,+ అదే రోజున నా పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపర్చడానికి దానిలోకి వచ్చారు.+ నా మందిరంలో వాళ్లు అదే చేశారు. 40  దూరం నుండి మనుషుల్ని రప్పించడానికి వాళ్లు ఒక సందేశకుణ్ణి కూడా పంపించారు.+ వాళ్లు వస్తున్నప్పుడు, నువ్వు స్నానం చేసి, కళ్లకు కాటుక పెట్టుకొని, నగలతో అలంకరించుకున్నావు.+ 41  ఒక అందమైన మంచం మీద కూర్చున్నావు,+ నీ ముందున్న బల్ల+ మీద నా ధూపద్రవ్యాన్ని,+ నా తైలాన్ని పెట్టావు.+ 42  జల్సా చేసే పురుషుల గుంపు సందడి అక్కడ వినిపించింది, వాళ్లలో ఎడారి నుండి తీసుకొచ్చిన తాగుబోతులు ఉన్నారు. వాళ్లు ఈ స్త్రీల చేతులకు గాజులు తొడిగి, వాళ్ల తలల మీద అందమైన కిరీటాలు  పెట్టారు. 43  “అప్పుడు నేను, వ్యభిచారం వల్ల నీరసించిపోయిన స్త్రీ గురించి ఇలా అన్నాను: ‘ఇప్పటికీ ఆమె వ్యభిచారం చేయడం మానదు.’ 44  వాళ్లు ఒక వేశ్య దగ్గరికి వెళ్తున్నట్టుగా ఆమె దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. అసభ్యంగా ప్రవర్తించే ఆ స్త్రీల దగ్గరికి అంటే ఒహొలా ​దగ్గరికి, ఒహొలీబా దగ్గరికి వాళ్లు అలాగే వెళ్లారు. 45  అయితే నీతిమంతులు వ్యభిచారం చేసేవాళ్లకు,+ రక్తం చిందించేవాళ్లకు+ విధించే శిక్షను ఆమెకు విధిస్తారు; ఎందుకంటే వాళ్లు వ్యభిచారం చేసే స్త్రీలు, వాళ్ల చేతులకు రక్తం అంటుకుంది.+ 46  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్ల మీదికి ఒక సైన్యం వస్తుంది; ఆ సైనికులు వాళ్లను భయంకరంగా మారుస్తారు; వాళ్ల వస్తువులు దోచుకోబడతాయి.+ 47  ఆ సైనికులు వాళ్ల మీదికి రాళ్లు రువ్వి,+ వాళ్లను కత్తులతో నరికేస్తారు. వాళ్ల కుమారుల్ని, కూతుళ్లను చంపేసి+ వాళ్ల ఇళ్లను అగ్నితో కాల్చేస్తారు.+ 48  నేను దేశంలోని అసభ్య ప్రవర్తనను అంతం చేస్తాను, అప్పుడు స్త్రీలందరూ గుణపాఠం నేర్చుకొని, మీలా అసభ్యంగా ప్రవర్తించకుండా ఉంటారు.+ 49  మీ అసభ్య ప్రవర్తన పర్యవసానాల్ని, మీ అసహ్యమైన విగ్రహాలతో మీరు చేసిన పాపాల పర్యవసానాల్ని వాళ్లు మీ మీదికి రప్పిస్తారు; అప్పుడు, నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”+

అధస్సూచీలు

“ఆమె డేరా” అని అర్థం.
“నా డేరా ఆమెలో ఉంది” అని అర్థం.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “కేడెములతో.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
అంటే, హెల్మెట్‌.
అంటే, ఆధ్యాత్మిక వ్యభిచారం.
లేదా “విగ్రహాలతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడమే.”
అక్ష., “అగ్ని గుండా దాటించారు.”