యెహెజ్కేలు 22:1-31

  • యెరూషలేము రక్తపాతంతో నిండిన నగరం (1-16)

  • ఇశ్రాయేలు పనికిరాని మష్టు (17-22)

  • ఇశ్రాయేలు నాయకుల్ని, ప్రజల్ని ఖండించడం (23-31)

22  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, రక్తపాతంతో నిండిన నగరానికి+ తీర్పు ప్రకటించడానికి, దాని అసహ్యమైన పనులన్నిటినీ+ దానికి తెలియజేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?  నువ్వు ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “రక్తపాతంతో నిండిన నగరమా, అసహ్యమైన విగ్రహాలతో* అపవిత్రమైన నగరమా,+ నీ సమయం వస్తోంది.+  నీ రక్తపాతం వల్ల నువ్వు దోషివి అయ్యావు,+ నీ అసహ్యమైన విగ్రహాల వల్ల అపవిత్రం అయ్యావు.+ నువ్వు నీ ఆయుష్షును తగ్గించుకున్నావు, నీ అంతం వచ్చేసింది. అందుకే నిన్ను జనాలకు నిందగా, దేశాలన్నిటికీ ఎగతాళిగా చేస్తాను.+  అపవిత్రమైన పేరుగల నగరమా, అల్లరితో నిండిన నగరమా, దగ్గరగా ఉన్నవాళ్లు, దూరంగా ఉన్నవాళ్లు నిన్ను హేళన చేస్తారు.  ఇదిగో! నీలో ఉన్న ఇశ్రాయేలు ప్రధానుల్లో ప్రతీ ఒక్కరు తమ అధికారాన్ని రక్తం చిందించడానికి ఉపయోగిస్తున్నారు.+  నీలో ప్రజలు తమ తండ్రిని, తల్లిని నీచంగా చూస్తున్నారు.+ పరదేశిని మోసం చేస్తున్నారు, తండ్రిలేని పిల్లవాణ్ణి,* విధవరాలిని బాధిస్తున్నారు.” ’ ”+  “ ‘నా పవిత్ర స్థలాన్ని నీచంగా చూస్తున్నారు, నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపరుస్తున్నారు.+  రక్తం చిందించడానికి లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు+ నీలో ఉన్నారు. పర్వతాల మీద బలి ఇచ్చిన వాటిని ​తినేవాళ్లు, అసభ్యమైన పనులు చేసేవాళ్లు+ నీ మధ్య ఉన్నారు. 10  తమ తండ్రి భార్యతో పడుకునేవాళ్లు,*+ రుతుస్రావం వల్ల అపవిత్రమైన స్త్రీతో పడుకునేవాళ్లు+ నీ మధ్య ఉన్నారు. 11  నీలో, ఒకడు తన పొరుగువాడి భార్యతో అసహ్యమైన పనులు చేస్తాడు,+ ఇంకొకడు తన కోడలితో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను అపవిత్రపరుస్తాడు,+ మరొకడు స్వయాన తన తండ్రికి పుట్టిన తన సహోదరిని చెరుస్తాడు.+ 12  రక్తం చిందించడానికి లంచం తీసుకునేవాళ్లు నీలో ఉన్నారు.+ నువ్వు వడ్డీ కోసం, లాభం* కోసం అప్పిస్తావు,+ నీ పొరుగువాళ్లను దోచుకుంటావు.+ అవును, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 13  “ ‘ఇదిగో! నీ అక్రమ సంపాదనను బట్టి, నీలో జరిగిన రక్తపాతాన్ని బట్టి నేను అస​హ్యంతో చేతులు చరుచుకుంటున్నాను. 14  నేను నీ మీద చర్య తీసుకున్నప్పుడు నీ గుండె నిబ్బరంగా ఉంటుందా? నీ చేతులు బలంగా ఉంటాయా?+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను, నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. 15  నేను నిన్ను జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొడతాను,+ నీ అపవి​త్రత అంతమయ్యేలా చేస్తాను.+ 16  నువ్వు జనాల ఎదుట అవమానాలపాలు అవుతావు, అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసు​కుంటావు.’ ”+ 17  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18  “మానవ ​కుమారుడా, ​ఇశ్రాయేలు ఇంటివాళ్లు నా దృష్టికి పనికి​రాని మష్టులా తయారయ్యారు. వాళ్లందరూ ​కొలిమిలో ఉన్న రాగి, తగరం, ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్లు వెండి మష్టులా ​తయారయ్యారు.+ 19  “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘మీరంతా పనికిరాని మష్టులా తయారయ్యారు+ కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేము లోపల సమకూరుస్తున్నాను. 20  వెండిని, రాగిని, ఇనుమును, సీసాన్ని, తగరాన్ని కొలిమిలో పోగుచేసి, వాటిమీద నిప్పు రగిలించి వాటిని కరిగించినట్టే, నేను కోపంతో, ఉగ్రతతో మిమ్మల్ని సమకూర్చి, మీ మీద అగ్ని ఊది మిమ్మల్ని కరిగిస్తాను.+ 21  మిమ్మల్ని పోగుచేసి మీ మీద నా కోపాగ్నిని ఊదుతాను,+ మీరు మీ నగరం లోపల కరిగిపోతారు.+ 22  వెండిని కొలిమిలో వేసి కరిగించినట్టు, మీరు దాని లోపల కరిగించబడతారు; అప్పుడు, యెహోవానైన నేను నా ఉగ్రతను మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.’ ” 23  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 24  “మానవ ​కుమారుడా, దానితో ఇలా చెప్పు, ‘నువ్వు శుభ్రంకాని దేశానివి, ఉగ్రత రోజున నీ మీద వర్షం కురవదు. 25  గర్జించే సింహం జంతువును చీల్చేసినట్టు+ దాని ప్రవక్తలు దాని మధ్య కుట్రలు పన్నుతున్నారు.+ వాళ్లు ప్రజల్ని మింగేస్తున్నారు. వాళ్లు సంపదను, విలువైనవాటిని లాక్కుంటున్నారు. వాళ్లు దానిలో చాలామందిని విధవరాళ్లుగా చేశారు. 26  దాని యాజకులు నా ధర్మశా​స్త్రాన్ని మీరారు,+ వాళ్లు నా పవిత్ర స్థలాల్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు.+ వాళ్లు పవిత్రమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా చూడరు; ఏవి అశుద్ధమైనవో, ఏవి ​శుద్ధమైనవో ప్రజలకు తెలియజేయరు;+ నా విశ్రాంతి రోజుల్ని పాటించడం వాళ్లకు ఇష్టంలేదు, వాళ్ల మధ్య నేను అపవిత్రపర్చబడుతున్నాను. 27  దానిలోని అధిపతులు జంతు​వుల్ని చీల్చేసే తోడేళ్ల లాంటివాళ్లు; వాళ్లు అక్రమ లాభం కోసం రక్తం చిందిస్తారు, ప్రజల్ని చంపేస్తారు.+ 28  దాని ప్రవక్తలేమో వాళ్ల పనులమీద సున్నం పూసి కప్పేస్తారు. వాళ్లు అబద్ధపు దర్శనాలు చూస్తారు, తప్పుడు సోదె చెప్తారు;+ యెహోవా ఏమీ చెప్పకపోయినా, “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు” అని వాళ్లు అంటారు. 29  ప్రజలు మోసం చేశారు, దోచుకున్నారు;+ అవసరంలో ఉన్నవాళ్లను, పేదవాళ్లను బాధపెట్టారు; పరదేశుల్ని మోసం చేసి వాళ్లకు న్యాయం జరగకుండా చేశారు.’ 30  “ ‘దేశం నాశనం కాకుండా రాతిగోడను బాగుచేసేవాడు గానీ, దాని తరఫున నా ముందు గోడబీటలో నిలబడేవాడు గానీ వాళ్లమధ్య ​ఉన్నాడేమో అని నేను వెతుకుతూ వచ్చాను,+ కానీ అలాంటివాళ్లు ఒక్కరు కూడా కనిపించలేదు. 31  కాబట్టి నా ఉగ్రతను వాళ్లమీద కుమ్మరించి, నా కోపాగ్నితో వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తాను. వాళ్ల మార్గాల పర్యవసానాల్ని వాళ్ల తలల మీదికే రప్పిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”

అధస్సూచీలు

ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “అనాథను.”
అక్ష., “తమ తండ్రి మానాన్ని వెల్లడిచేసేవాళ్లు.”
లేదా “అక్రమ వడ్డీ కోసం.”