యెహెజ్కేలు 21:1-32
21 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
2 “మానవ కుమారుడా, యెరూషలేము వైపు తిరిగి, పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా ప్రకటించు, ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా ప్రవచించు.
3 ఇశ్రాయేలు దేశంతో ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నా ఖడ్గాన్ని ఒరలో నుండి తీసి,+ నీలో ఉన్న నీతిమంతుల్నీ దుష్టుల్నీ చంపేస్తాను.
4 నేను నీలో ఉన్న నీతిమంతుల్నీ దుష్టుల్నీ చంపేస్తాను కాబట్టి దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు మనుషులందర్నీ చంపడానికి నా ఖడ్గం ఒరలో నుండి తీయబడుతుంది.
5 యెహోవానైన నేను నా ఖడ్గాన్ని ఒరలో నుండి తీశానని ప్రజలందరూ తెలుసుకుంటారు. అది మళ్లీ ఒరలోకి వెళ్లదు.” ’+
6 “మానవ కుమారుడా, నువ్వు వణుకుతూ నిట్టూర్చు; అవును, వాళ్ల ముందు విపరీతంగా నిట్టూర్చు.+
7 ‘నువ్వు ఎందుకు నిట్టూరుస్తున్నావు?’ అని వాళ్లు నిన్ను అడిగితే, ‘ఒక వార్తను బట్టి నిట్టూరుస్తున్నాను’ అని చెప్పు. ఎందుకంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, భయంతో ప్రతీ గుండె నీరుగారిపోతుంది, ప్రతీ చెయ్యి చచ్చుబడిపోతుంది, ప్రతీ హృదయం కృంగిపోతుంది, ప్రతీ మోకాలు మీదుగా నీళ్లు కారతాయి.*+ ‘ఇదిగో! అది తప్పకుండా వస్తుంది, జరిగి తీరుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
8 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
9 “మానవ కుమారుడా, ఇలా ప్రవచించు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నువ్వు ఇలా చెప్పు, ‘ఇదిగో ఒక ఖడ్గం! ఒక ఖడ్గం+ పదునుచేయబడి, మెరుగుపెట్టబడింది.
10 అది ఘోరంగా హతం చేయడానికి పదునుపెట్టబడింది; మెరుపులా మెరవడానికి మెరుగుపెట్టబడింది.’ ” ’ ”
“మనం సంతోషించాలి కదా?”
“ ‘ప్రతీ కర్రను* తిరస్కరించినట్టు, అది* నా కుమారుడి రాజదండాన్ని+ కూడా తిరస్కరిస్తుందా?
11 “ ‘చేతితో పట్టుకునేలా దాన్ని మెరుగుపెట్టడానికి ఇచ్చారు. హతం చేసే వ్యక్తి చేతిలో పెట్టడం కోసం ఆ ఖడ్గానికి పదునుపెట్టారు, మెరుగుపెట్టారు.+
12 “ ‘మానవ కుమారుడా, కేకలు వేస్తూ ఏడువు,+ ఎందుకంటే అది నా ప్రజల మీదికి వచ్చింది; అది ఇశ్రాయేలు ప్రధానులందర్నీ చంపుతుంది.+ నా ప్రజలతో పాటు వాళ్లు కూడా ఖడ్గం బారినపడతారు. కాబట్టి దుఃఖంతో తొడ చరుచుకో.
13 ఎందుకంటే ఖడ్గాన్ని పరీక్షించడం జరిగింది,+ ఆ ఖడ్గం రాజదండాన్ని తిరస్కరిస్తే ఏమౌతుంది? ఆ దండం లేకుండా పోతుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
14 “మానవ కుమారుడా, ప్రవచించు; నీ చేతులు చరుచుకొని, ‘ఒక ఖడ్గం!’ అని మూడుసార్లు అను. అది హతం చేసే ఖడ్గం, ఘోరంగా హతం చేసే ఖడ్గం, అన్నివైపులా సంహరించే ఖడ్గం.+
15 వాళ్ల గుండెలు భయంతో నీరుగారిపోతాయి,+ చాలామంది తమ నగర ద్వారాల దగ్గర కూలతారు; నేను ఖడ్గంతో హతం చేస్తాను. అవును, అది మెరుపులా మెరుస్తుంది, హతం చేయడానికి మెరుగుపెట్టబడింది!
16 ఖడ్గమా, కుడివైపు నరుకు! ఎడమవైపుకు తిరుగు! నీ అంచు ఎటు ఉంటే అటు వెళ్లు!
17 నేను కూడా నా చేతులు చరుచుకుంటాను, నా ఆగ్రహం చల్లారుతుంది.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.”
18 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
19 “మానవ కుమారుడా, బబులోను రాజు ఖడ్గం రావడానికి రెండు దారులు గీయి. రెండు దారులూ ఒకే దేశం నుండి మొదలవ్వాలి. అవి రెండూ రెండు నగరాలకు వెళ్తాయి, అవి విడిపోయే చోట ఒక దారిగుర్తు పెట్టు.
20 ఖడ్గం కోసం నువ్వు అమ్మోనీయుల రబ్బాకు ఒక దారి,+ యూదాలోని ప్రాకారాలుగల యెరూషలేముకు+ ఒక దారి గీయి.
21 ఎందుకంటే, బబులోను రాజు ఆ రెండు దారులు విడిపోయే చోట ఆగి శకునం చూస్తాడు. బాణాల్ని అటూఇటూ ఆడిస్తాడు. తన విగ్రహాల* దగ్గర విచారణ చేస్తాడు; జంతు కాలేయాన్ని పరిశీలిస్తాడు.
22 అతని కుడిచేతిలోని శకునం యెరూషలేము వైపు చూపిస్తుంది; యుద్ధ యంత్రాలు నిలబెట్టమని, హతం చేయమనే ఆజ్ఞ ఇవ్వమని, యుద్ధకేక వినిపించమని, ద్వారాల ఎదురుగా యుద్ధ యంత్రాలు ఉంచమని, ముట్టడిదిబ్బ నిలబెట్టమని, ముట్టడిగోడ కట్టమని+ అది సూచిస్తుంది.
23 అయితే వాళ్లతో ప్రమాణాలు చేసుకున్నవాళ్లకు*+ అది తప్పుడు శకునంలా కనిపిస్తుంది. కానీ అతను వాళ్ల దోషాన్ని గుర్తుచేసుకుని, వాళ్లను పట్టుకుంటాడు.+
24 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘మీరు మీ అపరాధాల్ని బట్టబయలు చేసుకున్నారు, మీ పనులన్నిట్లో మీ పాపాలు కనబడేలా చేశారు; అలా మీరు మీ దోషాన్ని గుర్తుచేసుకునేలా చేశారు. ఇప్పుడు మీరు గుర్తుచేసుకోబడ్డారు కాబట్టి మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తారు.’
25 “తీవ్రంగా గాయపడ్డ ఇశ్రాయేలు దుష్ట ప్రధానుడా,+ నీ రోజు వచ్చేసింది, నీ చివరి శిక్షకు సమయం వచ్చేసింది.
26 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘తలపాగా తీసి పక్కనపెట్టు, కిరీటం తీసేయి.+ ఇప్పుడున్నట్టు ఇక ముందు ఉండదు.+ కింద ఉన్నవాణ్ణి* హెచ్చించు,+ పైన ఉన్నవాణ్ణి కిందికి దించు.+
27 నేను దాన్ని పడదోస్తాను, పడదోస్తాను, పడదోస్తాను. చట్టబద్ధమైన హక్కుదారుడు* వచ్చే వరకు అది ఎవరికీ చెందదు,+ అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.’+
28 “మానవ కుమారుడా, నువ్వు ఇలా ప్రవచించు, ‘అమ్మోనీయుల గురించి, వాళ్లు చేసిన అవమానాల గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. ఖడ్గం! హతం చేయడానికి ఒక ఖడ్గం దూయబడి ఉంది. అది మెరుపులా మెరవడానికి, చంపడానికి మెరుగుపెట్టబడింది.
29 నీ గురించి అబద్ధ దర్శనాలు చూశారు, తప్పుడు సోదె చెప్పారు; అయినాసరే నువ్వు చంపబడినవాళ్ల మీద, అంటే తమ రోజు, తమ చివరి శిక్షా సమయం వచ్చిన దుష్టులమీద కుప్పగా వేయబడతావు.
30 ఖడ్గం దాని ఒరలోకి తిరిగెళ్లాలి. నువ్వు సృష్టించబడిన స్థలంలోనే, నువ్వు పుట్టిన దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను.
31 నా ఉగ్రత నీమీద కుమ్మరిస్తాను. నా కోపాగ్ని నీమీద వెళ్లగక్కుతాను, నాశనం చేయడంలో ఆరితేరిన కిరాతకుల చేతికి నిన్ను అప్పగిస్తాను.+
32 నువ్వు నిప్పుకు కట్టె అవుతావు;+ దేశంలో నీ రక్తం చిందించబడుతుంది, ఇక నువ్వు జ్ఞాపకం చేసుకోబడవు; యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.’ ”
అధస్సూచీలు
^ అంటే, భయంతో మూత్ర విసర్జన వల్ల.
^ అక్ష., “చెట్టును.”
^ అంటే, యెహోవా ఖడ్గం.
^ అక్ష., “గృహదేవతల.”
^ అంటే, యెరూషలేము నివాసులు.
^ లేదా “ఉన్నదాన్ని.”
^ లేదా “స్వాస్థ్యకర్త.”