యెహెజ్కేలు 20:1-49

  • ఇశ్రాయేలు తిరుగుబాటు చరిత్ర (1-32)

  • ఇశ్రాయేలు పునరుద్ధరణ వాగ్దానం (33-44)

  • దక్షిణ భాగానికి వ్యతిరేకంగా ప్రవచనం (45-49)

20  ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజున కొంతమంది ఇశ్రాయేలు పెద్దలు యెహోవా దగ్గర విచారణ చేయడానికి నా దగ్గరికి వచ్చి నా ముందు కూర్చున్నారు.  అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు నా దగ్గరికి విచారణ చేయడానికి వచ్చారా? ‘నా జీవం తోడు, నేను మీకు జవాబు ఇవ్వను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” ’  “వాళ్లకు తీర్పు తీర్చడానికి* నువ్వు సిద్ధంగా ఉన్నావా? మానవ కుమారుడా, వాళ్లకు తీర్పు తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాళ్ల పూర్వీకులు చేసిన హేయమైన పనుల్ని వాళ్లకు తెలియజేయి.+  వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలును ఎంచుకున్న రోజున,+ యాకోబు ఇంటివాళ్ల సంతానంతో* ఒక ప్రమాణం చేశాను; ఐగుప్తు దేశంలో నన్ను నేను వాళ్లకు వెల్లడిచేసుకున్నాను.+ అవును, ‘నేను మీ దేవుడైన యెహోవాను’ అంటూ వాళ్లతో ప్రమాణం చేశాను.  వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి, నేను వాళ్లకోసం వెదికిపెట్టిన* దేశానికి, అంటే పాలుతేనెలు ప్రవహించే దేశానికి వాళ్లను తీసుకొస్తానని ఆ రోజు వాళ్లకు ప్రమాణం చేశాను.+ అది దేశాలన్నిట్లో అతి సుందరమైన దేశం.*  అప్పుడు నేను వాళ్లకు ఇలా చెప్పాను, ‘మీలో ప్రతి ఒక్కరూ మీ కళ్ల ముందున్న హేయమైనవాటిని తీసిపారేయండి; ఐగుప్తు అసహ్యమైన విగ్రహాలతో* మిమ్మల్ని అపవిత్రపర్చుకోకండి.+ నేను మీ దేవుడైన యెహోవాను.’+  “ ‘ “కానీ వాళ్లు నాకు ఎదురుతిరిగారు, నా మాట వినడానికి ఇష్టపడలేదు. తమ కళ్ల ముందున్న అసహ్యమైనవాటిని తీసిపారేయలేదు, ఐగుప్తు హేయమైన విగ్రహాల్ని విడిచిపెట్టలేదు.+ కాబట్టి ఐగుప్తు దేశంలో వాళ్లమీద నా ఆగ్రహాన్ని కుమ్మరిస్తానని, నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కుతానని నేను చెప్పాను.  అయితే వాళ్లు ఎవరి మధ్య నివసిస్తున్నారో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ ఎందుకంటే నేను వాళ్లను* ఐగుప్తు దేశం నుండి బయటికి ​తీసుకొచ్చేటప్పుడు ఆ జనాల ముందు నన్ను నేను వాళ్లకు* వెల్లడిచేసుకున్నాను.+ 10  కాబట్టి నేను వాళ్లను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చి ఎడారి​లోకి నడిపించాను.+ 11  “ ‘ “తర్వాత నేను వాళ్లకు నా ​శాసనాల్ని ఇచ్చాను, నా న్యాయనిర్ణయాల్ని తెలియజేశాను;+ ఎందుకంటే వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు.+ 12  అంతేకాదు, యెహోవానైన నేనే వాళ్లను పవిత్రపరుస్తున్నానని వాళ్లు తెలుసుకునేలా నాకూ వాళ్లకూ మధ్య సూచ​నగా విశ్రాంతి రోజుల్ని*+ కూడా వాళ్లకు ఇచ్చాను.+ 13  “ ‘ “అయితే ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఎడారిలో నాకు ఎదురుతిరిగారు.+ వాళ్లు నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు; నిజానికి వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు. వాళ్లు నా విశ్రాంతి రోజుల్ని ఘోరంగా అపవిత్రపర్చారు. కాబట్టి ఎడారిలో వాళ్లమీద నా ఉగ్రతను కుమ్మరించి వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తానని అన్నాను.+ 14  నేను ఎవరి కళ్లముందు వాళ్లను* బయటికి తీసుకొచ్చానో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ 15  అంతేకాదు, నేను వాళ్లకు ఇచ్చిన దేశానికి, అంటే దేశాలన్నిట్లో అతి సుందరమైన* దేశానికి, పాలుతేనెలు ప్రవ​హించే ​దేశానికి+ వాళ్లను తీసుకెళ్లనని ఎడారిలో వాళ్లతో ప్రమాణం చేశాను.+ 16  ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు, నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు; ఎందుకంటే వాళ్ల మనసు తమ అసహ్యమైన ​విగ్రహాల పైనే ఉంది.+ 17  “ ‘ “అయితే నేను* వాళ్లమీద జాలి​పడ్డాను, అందుకే వాళ్లను నాశనం చేయలేదు; ఎడారిలో వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేయ​లేదు. 18  ఎడారిలో నేను వాళ్ల పిల్లలతో+ ఇలా చెప్పాను, ‘మీ పూర్వీకుల కట్టుబాట్ల ప్రకారం ​నడుచుకోకండి,+ వాళ్ల న్యాయనిర్ణయాల్ని ​పాటించకండి, వాళ్ల అసహ్యమైన విగ్రహాలతో మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకోకండి. 19  నేను మీ దేవుడైన యెహోవాను. నా శాసనాల్ని అనుసరించండి, నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ వాటి ప్రకారం జీవించండి.+ 20  నా విశ్రాంతి రోజుల్ని పవిత్రంగా ఎంచండి,+ నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకు​నేలా అవి నాకూ మీకూ మధ్య సూచనగా ఉంటాయి.’+ 21  “ ‘ “కానీ వాళ్ల పిల్లలు కూడా నాకు ​ఎదురుతిరగడం మొదలుపెట్టారు.+ వాళ్లు నా ​శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు, వాటి ప్రకారం జీవించలేదు; నిజానికి వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు. వాళ్లు నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు. కాబట్టి ఎడారిలో వాళ్లమీద నా ఆగ్రహాన్ని కుమ్మరిస్తానని, నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కుతానని చెప్పాను.+ 22  కానీ నేను అలా చేయలేదు;+ నేను ఎవరి కళ్లముందు వాళ్లను* బయటికి తీసుకొచ్చానో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడ​దని నా పేరు కోసం చర్య తీసుకు​న్నాను.+ 23  అంతేకాదు, నేను వాళ్లను జనాల మధ్యకు చెదరగొడతానని, దేశాల మధ్యకు వెళ్లగొడతానని ఎడా​రిలో వాళ్లతో ప్రమాణం చేశాను.+ 24  ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు, నా శాసనాల్ని ​తిరస్కరించారు,+ నా విశ్రాంతి రోజుల్ని అపవిత్ర​పర్చారు, తమ పూర్వీకుల ​అసహ్యమైన విగ్ర​హాల్ని అనుసరించారు.+ 25  అంతేకాదు, నేను వాళ్లను మంచివి​కాని కట్టుబాట్లను, జీవాన్ని ​ఇవ్వలేని న్యాయ​నిర్ణయాల్ని అనుసరించనిచ్చాను.+ 26  తమ బలుల ద్వారా, అంటే తమ మొదటి సంతా​నాన్ని అగ్నిలో వేసి కాల్చడం* ద్వారా+ వాళ్లను ​అపవిత్రం కాని​చ్చాను; నేను ​యెహోవానని వాళ్లు తెలుసుకునేలా వాళ్లను నాశనం చేయడా​నికి అలా జరగనిచ్చాను.” ’ 27  “కాబట్టి మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ పూర్వీకులు కూడా ఇదే విధంగా, నాపట్ల నమ్మకద్రోహంగా ప్రవర్తించడం ద్వారా నన్ను దూషించారు. 28  నేను వాళ్లకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి వాళ్లను తీసుకొచ్చాను.+ అయితే వాళ్లు ప్రతీ ఎత్తైన కొండను, ప్రతీ పచ్చని చెట్టును+ చూసి బలులు, అర్పణలు ​అర్పించడం మొదలుపెట్టి నాకు కోపం తెప్పించారు. వాళ్లు అక్కడ తమ బలుల ఇంపైన* ​సువాసనల్ని, ​పానీయార్పణల్ని అర్పించారు. 29  కాబట్టి నేను వాళ్లను ఇలా అడిగాను: ‘మీరు ఈ ఉన్నత స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? (అది ఈ రోజు వరకు ఉన్నత స్థలం అని పిలవ​బడుతోంది.)’ ” ’+ 30  “ఇప్పుడు ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ పూర్వీకుల అసహ్యమైన ​విగ్రహాల్ని పూజించడానికి* వాటి వెంట వెళ్తూ వాళ్లలాగే+ మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకుంటున్నారా? 31  మీ అసహ్యమైన విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ, మీ పిల్లల్ని అగ్నిలో వేసి కాలుస్తూ,*+ మీరు ఈ రోజు వరకు మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకుంటున్నారా? ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఇలా చేస్తున్నా, మీరు ​విచారణ చేసినప్పుడు నేను జవాబివ్వాలా?” ’+ “ ‘నా జీవం తోడు, నేను మీకు జవాబివ్వను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.+ 32  ‘మీరు మీ మనసుల్లో, “మనం చెక్కలనూ రాళ్లనూ పూజించే జనాల్లా, వేరే దేశాల ప్రజల్లా తయారౌదాం” అని అను​కుంటున్నారు కదా?+ అది ఎప్పటికీ జరగదు.’ ” 33  “ ‘నా జీవం తోడు, నేను బలమైన చేతితో, చాచిన బాహువుతో, కోపాన్ని కుమ్మరిస్తూ+ మీ మీద రాజుగా పరిపాలిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 34  ‘నేను మిమ్మల్ని ఆయా జనాల మధ్య నుండి బయటికి తీసుకొస్తాను, మీరు చెదిరిపోయిన దేశాల మధ్య నుండి మిమ్మల్ని బలమైన చేతితో, చాచిన ​బాహువుతో, కోపాన్ని కుమ్మరిస్తూ సమకూరుస్తాను.+ 35  మిమ్మల్ని జనాల ఎడారిలోకి తీసుకొచ్చి అక్కడ ముఖాముఖిగా మీతో వాదిస్తాను.+ 36  “ ‘నేను ఐగుప్తు దేశ ఎడారిలో మీ పూర్వీకులతో వాదించినట్టే మీతో కూడా వాదిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 37  ‘మిమ్మల్ని కాపరి కర్ర కింద నుండి వెళ్లేలా చేసి,+ మిమ్మల్ని ఒప్పందం కిందికి తెస్తాను. 38  అయితే మీలో నుండి తిరుగుబాటుదారుల్ని, నాకు వ్యతిరేకంగా పాపం చేసేవాళ్లను తీసేస్తాను.+ తాము పరదేశులుగా నివసిస్తున్న దేశం నుండి వాళ్లను బయటికి రప్పిస్తాను, కానీ వాళ్లు ఇశ్రాయేలు దేశంలో అడుగుపెట్టరు;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ 39  “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీలో ప్రతి ఒక్కరూ వెళ్లి, మీ అసహ్యమైన విగ్రహాల్ని పూజించుకోండి.+ కానీ ఆ తర్వాత మీరు నా మాట వినకపోతే, ఇకమీదట మీ బలుల ద్వారా, మీ అసహ్యమైన విగ్రహాల ద్వారా మీరు నా పవిత్రమైన  పేరును అపవిత్రపర్చలేరు.’+ 40  “ ‘ఎందుకంటే, నా పవిత్ర పర్వతం మీద, అంటే ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతం+ మీద ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ దేశంలో నన్ను సేవిస్తారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. ‘అక్కడ నేను వాళ్లను బట్టి సంతోషిస్తాను; మీ కానుకల్ని, మీ అర్పణల్లోని ప్రథమఫలాల్ని, మీ పవిత్రమైన వాటన్నిటినీ స్వీకరిస్తాను.+ 41  నేను మిమ్మల్ని ఆయా జనాల మధ్య నుండి బయటికి తీసుకొచ్చి, మీరు చెదిరిపోయిన దేశాల మధ్య నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు+ మీ బలుల ఇంపైన* సువాసనను బట్టి నేను మీ విషయంలో సంతోషిస్తాను; జనాల కళ్లముందు, మీ మధ్య నన్ను నేను పవిత్రపర్చుకుంటాను.’+ 42  “ ‘నేను మిమ్మల్ని ఇశ్రాయేలు దేశంలోకి అంటే మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి తీసుకొచ్చినప్పుడు+ నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 43  అక్కడ మీరు మీ ప్రవర్తనను, మిమ్మల్ని అపవిత్రపర్చిన మీ పనుల్ని గుర్తుచేసుకుంటారు,+ మీరు చేసిన చెడ్డ పనులన్నిటిని బట్టి మీ మీద మీకే అసహ్యం వేస్తుంది.+ 44  ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీ దుష్ట ప్రవర్తన బట్టో, మీ తప్పుడు పనుల బట్టో కాకుండా, నా పేరు కోసం నేను చర్య తీసుకున్నప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”+ 45  తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 46  “మానవ కుమారుడా, దక్షిణ భాగం వైపు తిరిగి, దక్షిణం వైపు ప్రకటించు; దక్షిణం వైపున్న అడవి ప్రాంతానికి ప్రవచించు. 47  దక్షిణం వైపున్న అడవితో ఇలా అను, ‘యెహోవా చెప్పేది విను. సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను నీలో అగ్ని రాజేస్తున్నాను,+ అది నీలో ఉన్న ప్రతీ పచ్చని చెట్టును, ఎండిన చెట్టును దహించేస్తుంది. ఆ మంటలు ఆరిపోవు,+ దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు వరకు ప్రతి ఒక్కరికీ ఆ సెగ తగులుతుంది. 48  యెహోవానైన నేనే దానికి ఆరిపోని నిప్పు అంటించానని మనుషులందరూ ​తెలుసుకుంటారు.” ’ ”+ 49  అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! వాళ్లు నా గురించి, ‘ఇతను పొడుపు కథలు చెప్తున్నాడు’ అని మాట్లాడుకుంటున్నారు.”

అధస్సూచీలు

లేదా “వాళ్లమీద తీర్పు ప్రకటించడానికి.”
అక్ష., “విత్తనంతో.”
లేదా “వేగుచూసిన.”
లేదా “ఆభరణంలా ఉండేది.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అంటే, ఇశ్రాయేలీయుల్ని.
అంటే, ఇశ్రాయేలీయులకు.
లేదా “సబ్బాతు రోజుల్ని.”
అంటే, ఇశ్రాయేలీయుల్ని.
లేదా “ఆభరణం లాంటి.”
అక్ష., “నా కన్ను.”
అంటే, ఇశ్రాయేలీయుల్ని.
అక్ష., “అగ్ని గుండా దాటించడం.”
లేదా “శాంతపర్చే.”
లేదా “విగ్రహాలతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడానికి.”
అక్ష., “అగ్ని గుండా దాటిస్తూ.”
లేదా “శాంతపర్చే.”