యెహెజ్కేలు 14:1-23

  • విగ్రహపూజ చేసేవాళ్లు ఖండించబడడం (1-11)

  • యెరూషలేము తీర్పును తప్పించుకోలేదు (12-23)

    • నీతిమంతులైన నోవహు, దానియేలు, యోబు (1420)

14  తర్వాత ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమంది వచ్చి నా ముందు కూర్చు​న్నారు.+  అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఈ మనుషులు తమ అసహ్యమైన విగ్రహాల్ని* అనుసరించాలని నిశ్చయించుకున్నారు, ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యే అడ్డురాయిని నిలబెట్టారు. నేను వాళ్లను నా దగ్గర విచారణ చేయనివ్వాలా?+  కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఒక ఇశ్రాయేలీయుడు తన అసహ్యమైన విగ్రహాల్ని అనుసరించాలని నిశ్చయించుకొని, ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యే అడ్డురాయిని నిలబెట్టి, తర్వాత ప్రవక్త దగ్గర విచారణ చేయడానికి వస్తే, యెహోవానైన నేను అతని లెక్కలేనన్ని అసహ్యమైన విగ్రహాలకు తగినట్టు అత​నికి జవాబిస్తాను.  నేను ఇశ్రాయేలు ఇంటివాళ్ల హృదయాల్లో భయం పుట్టిస్తాను, ఎందుకంటే వాళ్లంతా నన్ను విడిచిపెట్టి తమ అసహ్యమైన విగ్రహాల వెంట వెళ్లారు.” ’+  “కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా దగ్గరికి తిరిగిరండి, మీ అస​హ్యమైన విగ్రహాల్ని విడిచిపెట్టండి, మీ హేయమైన పనులన్నిటి నుండి మీ ముఖం పక్కకు తిప్పుకోండి.+  ఒక ఇశ్రాయేలీయుడు గానీ, ఇశ్రాయేలులో నివసించే పరదేశి గానీ నన్ను విడిచిపెట్టి, తన అసహ్యమైన విగ్రహాల్ని అనుసరించాలని నిశ్చయించుకొని, ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యే అడ్డురాయిని నిలబెట్టి, తర్వాత నా ప్రవక్త దగ్గర విచారణ చేయడానికి వస్తే,+ యెహోవానైన నేనే స్వయంగా అతనికి జవాబిస్తాను.  నేను నా ముఖాన్ని అతనికి వ్యతిరేకంగా తిప్పుకుంటాను; అతన్ని ఒక హెచ్చరికగా, సామెతగా చేస్తాను, నా ప్రజల్లో నుండి అతన్ని కొట్టివేస్తాను;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’  “ ‘అయితే ఆ ప్రవక్త మోసపోయి ఒక జవాబు చెప్తే, యెహోవానైన నేనే అతన్ని వెర్రివాణ్ణి చేసినట్టు.+ అప్పుడు నేను అతనికి వ్యతిరేకంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో నుండి అతన్ని పూర్తిగా నాశనం చేస్తాను. 10  వాళ్లు తమ దోషాన్ని భరించాలి; ప్రవక్త దోషం ఎంతో, విచారణ చేసినవాడి దోషం కూడా అంతే; 11  అప్పుడే ఇశ్రాయేలు ఇంటివాళ్లు నన్ను విడిచి అటూఇటూ తిరగకుండా, తమ అపరాధాలన్నిటితో తమను మలినం చేసుకోకుండా ఉంటారు. వాళ్లు నా ప్రజలుగా ఉంటారు, నేను వాళ్ల దేవునిగా ఉంటాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.” 12  తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 13  “మానవ కుమారుడా, ఒక దేశం నమ్మకద్రోహంగా ప్రవర్తించి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే, నేను దానికి వ్యతిరేకంగా నా చెయ్యి చాపి దాని ఆహార సరఫరాను నాశనం చేస్తాను;*+ దానిమీదికి కరువు రప్పించి+ అందులో మనిషి గానీ, జంతువు గానీ లేకుండా చేస్తాను.”+ 14  “ ‘నోవహు,+ ​దానియేలు,+ యోబు+ అనే ముగ్గురు మనుషులు దానిలో ఉన్నా, వాళ్లు తమ నీతి వల్ల కేవలం తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” 15  “ ‘ఒకవేళ నేను ఆ దేశం గుండా క్రూరమృగాల్ని పంపించినప్పుడు, అవి దానిలోని ప్రజల్ని* చంపి, దాన్ని పాడుబడ్డ భూమిగా మారిస్తే, వాటివల్ల ఎవరూ దానిలో సంచరించకపోతుంటే,+ 16  నా జీవం తోడు, ఈ ముగ్గురు మనుషులు ఆ దేశంలో ఉన్నా, వాళ్లు తమ కుమారుల్ని గానీ, కూతుళ్లను గానీ రక్షించుకోలేరు; తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు; దేశం నిర్జనంగా మారుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.” 17  “ ‘ఒకవేళ నేను, “ఈ దేశమంతటా ఖడ్గం తిరగాలి” అని అంటూ దేశం మీదికి ఖడ్గం రప్పించి,+ అందులోని మనుషుల్ని, జంతువుల్ని చంపేస్తే,+ 18  ఈ ముగ్గురు మనుషులు ఆ దేశంలో ఉన్నా, నా జీవం తోడు, వాళ్లు తమ కుమారుల్ని గానీ, కూతుళ్లను గానీ రక్షించుకోలేరు; తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.” 19  “ ‘ఒకవేళ నేను ఆ దేశంలోకి తెగులును పంపి,+ నా ఆగ్రహాన్ని దానిమీద కుమ్మరించి, అందులోని మనుషుల్ని, జంతువుల్ని చంపి రక్తపాతం సృష్టిస్తే, 20  నోవహు,+ దానియేలు,+ యోబు+ అందులో ఉన్నా, నా జీవం తోడు, వాళ్లు తమ కుమారుల్ని గానీ, కూతుళ్లను గానీ రక్షించుకోలేరు; వాళ్లు తమ నీతితో తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.” 21  “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను యెరూషలేములోని మనుషుల్ని, జంతువుల్ని చంపడానికి+ దాని మీదికి నా నాలుగు శిక్షల్ని+ అంటే ఖడ్గాన్ని, కరువును, క్రూరమృగాన్ని, తెగులును+ పంపించినప్పుడు ఇలా జరుగుతుంది. 22  అయితే వాళ్లలో కొంతమంది కుమారులు, కూతుళ్లు మిగులుతారు; వాళ్లు బయటికి తీసు​కురాబడతారు.+ వాళ్లు మీ దగ్గరికి వస్తారు; మీరు వాళ్ల మార్గాల్ని, పనుల్ని చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన విప​త్తును బట్టి, నేను దానికి చేసిన దానంతటిని బట్టి మీరు తప్పకుండా ఓదార్పు పొందుతారు.’ ” 23  “ ‘మీరు వాళ్ల మార్గాల్ని, పనుల్ని చూసినప్పుడు మీకు ఊరట కలుగుతుంది; నేను దానికి ఏదైతే చేయాల్సి వచ్చిందో, అది సరైన కారణాన్ని బట్టే చేశానని అప్పుడు మీరు తెలుసుకుంటారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”

అధస్సూచీలు

ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అక్ష., “దాని రొట్టెల కర్రల్ని విరగ్గొడతాను.” ఇవి రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రల్ని సూచిస్తుండవచ్చు.
లేదా “పిల్లల్ని.”