యెహెజ్కేలు 13:1-23

  • అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా (1-16)

    • సున్నం పూసిన గోడలు పడిపోతాయి (10-12)

  • అబద్ధాలు ప్రవచించే స్త్రీలకు వ్యతిరేకంగా (17-23)

13  యెహోవా వాక్యం మళ్లీ నా ​దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ప్రవక్తలకు వ్యతిరే​కంగా ప్రవచించు,+ సొంత ఆలోచనల్ని ప్రవచనా​లుగా చెప్పేవాళ్లతో+ ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేది వినండి.  సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఏ దర్శనం చూడకపోయినా, సొంత ఆలోచనల ప్రకారం ప్రవచించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ!+  ఇశ్రాయేలూ, నీ ప్రవక్తలు శిథిలాల మధ్య ఉన్న నక్కల్లా తయారయ్యారు.  యెహోవా రోజున జరిగే యుద్ధంలో+ ఇశ్రాయేలు స్థిరంగా నిలబడేలా, ఇశ్రాయేలు ఇంటివాళ్ల కోసం మీరు రాతి ​గోడల్లోని పగుళ్ల దగ్గరికి వెళ్లి వాటిని బాగుచేయరు.”+  “వాళ్లు వ్యర్థమైన దర్శనాలు చూసి, అబద్ధాన్ని ప్రవచించారు; యెహోవా వాళ్లను పంపకపోయినా, ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్లు అంటున్నారు; అంతేకాదు తమ మాటలు నెరవేరతాయని ఎదురుచూశారు.+  నేను ఏమీ చెప్పకపోయినా, మీరు ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని ​అంటున్నప్పుడు మీరు చూసిన దర్శనాలు వ్యర్థమైన దర్శనాలు కావా? మీరు ప్రవచించింది అబద్ధాన్ని కాదా?” ’  “ ‘అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘మీ మాటలు, మీ దర్శనాలు అబద్ధం కాబట్టి నేను మీకు వ్యతిరేకంగా ఉన్నాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”+  వ్యర్థమైన దర్శనాలు చూసే, అబద్ధాన్ని ప్రవచించే ప్రవక్తలకు+ వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతాను. నా సన్నిహిత ప్రజల గుంపులో వాళ్లు ఉండరు; ​ఇశ్రాయేలు ఇంటివాళ్ల జాబితాలో వాళ్ల పేర్లు ఉండవు; వాళ్లు ఇశ్రాయేలు దేశానికి తిరిగిరారు; అప్పుడు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 10  శాంతి లేకపోయినా, “శాంతి ఉంది!” అని చెప్తూ+ వాళ్లు నా ప్రజల్ని తప్పుదారి పట్టించారు కాబట్టే ఇదంతా జరుగుతుంది. బలహీనమైన మధ్యగోడ కట్ట​బడినప్పుడు, వాళ్లు దానికి సున్నం పూస్తున్నారు.’*+ 11  “అది పడిపోతుందని సున్నం పూసేవాళ్లకు చెప్పు. కుండపోత వర్షం కురుస్తుంది, వడగండ్లు పడతాయి, బలమైన ఈదురు గాలులు దానిని పడగొడతాయి.+ 12  గోడ పడిపోయినప్పుడు, ‘మీరు పూసిన సున్నం పూత ఏమైంది?’ అని మిమ్మల్ని అడుగుతారు.+ 13  “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నేను ఆగ్రహంతో బల​మైన ఈదురు గాలుల్ని, కోపంతో కుండపోత వర్షాన్ని, ఉగ్రతతో నాశనం చేసే వడగండ్లను రప్పిస్తాను. 14  మీరు సున్నం పూసిన గోడను నేను పడగొట్టి నేలమట్టం చేస్తాను, దాని పునాదులు బయటికి కనిపిస్తాయి. నగరం నాశనమైనప్పుడు మీరు దానిలోనే నశించిపోతారు; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసు​కుంటారు.’ 15  “ ‘నేను గోడమీద, దానికి సున్నం పూసిన​వాళ్ల మీద నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కిన​ప్పుడు, నేను మీతో ఇలా అంటాను: “గోడా లేదు, దానికి సున్నం పూసినవాళ్లూ లేరు.+ 16  యెరూషలేము గురించి ప్రవచించి, దానికి శాంతి లేకపోయినా శాంతి ఉన్నట్టు దర్శనాలు చూసిన ఇశ్రాయేలు ప్రవక్తలు+ ఇక లేరు” ’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 17  “మానవ కుమారుడా, సొంత ఆలోచనల్ని ప్రవచనాలుగా చెప్పే నీ ప్రజల్లోని స్త్రీలకు వ్యతిరేకంగా ముఖం తిప్పుకొని, వాళ్లకు వ్యతిరేకంగా ప్రవచించు. 18  వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ప్రజల ప్రాణాల్ని వేటాడడానికి, ప్రతీ ఒక్కరి చేతికి తగ్గట్టుగా తాయెత్తులు, రకరకాల తలలకు సరిపోయేలా ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ! మీరు నా ప్రజల ప్రాణాల్ని వేటాడుతూ, మీ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారా? 19  మీరు మీ అబ​ద్ధాల్ని వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పడం ద్వారా బ్రతకాల్సినవాళ్లను చంపుతూ, బ్రతక​కూడనివాళ్లను సజీవంగా ఉంచుతూ గుప్పెడు బార్లీ గింజల కోసం, రొట్టె ముక్కల కోసం+ నా ప్రజల మధ్య నన్ను అపవిత్రపరుస్తారా?” ’+ 20  “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘స్త్రీలారా, పక్షుల్ని వేటాడినట్టు ప్రజల్ని వేటాడడానికి మీరు ఉపయోగించే మీ తాయెత్తులకు నేను వ్యతిరేకంగా ఉన్నాను; నేను వాటిని మీ చేతుల నుండి తెంచేసి, మీరు పక్షుల్ని వేటాడినట్టు వేటాడుతున్న వాళ్లను విడిపిస్తాను. 21  మీ ముసుగుల్ని చించేసి, మీ చేతిలో నుండి నా ప్రజల్ని రక్షిస్తాను; మీరిక వాళ్లను వేటాడి పట్టుకోలేరు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 22  నీతిమంతునికి బాధ కలిగించాలనే ఉద్దేశం నాకు లేకపోయినా మీరు అతనికి అబద్ధాలు చెప్పి+ అతని ధైర్యాన్ని పోగొట్టారు; మీరు దుష్టుడి చేతుల్ని బలపర్చారు,+ అలా అతను తన చెడు మార్గం నుండి పక్కకుమళ్లి, జీవించకుండా చేశారు.+ 23  కాబట్టి స్త్రీలారా, మీరు ఇక అబద్ధ దర్శనాలు చూడరు, సోదె చెప్పరు;+ నేను నా ప్రజల్ని మీ చేతుల్లో నుండి రక్షిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”

అధస్సూచీలు

అంటే, ఒక బలహీనమైన లోపలి గోడను కట్టి, అది బలంగా కనిపించేలా చేయడానికి సున్నం వేస్తున్నారు.