యెహెజ్కేలు 12:1-28

  • చెరలోకి వెళ్తారని చూపించడం (1-20)

    • చెరలోకి వెళ్లడానికి సామాను (1-7)

    • ప్రధానుడు చీకట్లో బయల్దేరతాడు (8-16)

    • ఆందోళనతో రొట్టె తినాలి, భయంభయంగా నీళ్లు తాగాలి (17-20)

  • అబద్ధపు మాటలు తప్పని నిరూపించ​బడడం (21-28)

    • “నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు” (28)

12  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, నువ్వు తిరుగుబాటు చేసే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లు కళ్లు ఉన్నా చూడరు, చెవులు ఉన్నా వినరు,+ ఎందుకంటే వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.+  మానవ కుమారుడా, నువ్వు చెరలోకి వెళ్లడానికి నీ సామాను సర్దుకో. పగలు వాళ్లు చూస్తుండగా నువ్వు చెరలోకి వెళ్లాలి. వాళ్లు చూస్తుండగా నీ ఇంటి నుండి ఇంకో చోటికి చెరగా వెళ్లు. వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలే అయినా, బహుశా దాని అర్థాన్ని గ్రహిస్తారేమో.  పగలు వాళ్లు చూస్తుండగా, చెరలోకి వెళ్లడానికి సర్దుకున్న నీ సామాను బయటికి తీసుకురా; సాయంత్రం వాళ్లు చూస్తుండగా, చెరలోకి వెళ్తున్నవాడిలా నువ్వు అక్కడి నుండి బయల్దేరాలి.+  “వాళ్లు చూస్తుండగా గోడకు కన్నం చేసి, దాని గుండా నీ సామాను బయటికి తీయి.+  వాళ్లు చూస్తుండగా నీ సామాను భుజం మీద వేసుకొని చీకట్లో దాన్ని మోసుకెళ్లు. నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో, ఎందుకంటే నేను నిన్ను ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఒక సూచనగా చేస్తున్నాను.”+  ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే నేను చేశాను. పగలు నేను చెరలోకి వెళ్తున్నవాడిలా నా సామాను బయటికి తెచ్చాను, సాయంత్రం నా చేతితో గోడకు ఒక కన్నం చేశాను. చీకటి పడినప్పుడు, వాళ్లు చూస్తుండగా నా సామాను తీసుకొని, భుజం మీద పెట్టుకుని బయల్దేరాను.  ఉదయం యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ఇంటివాళ్లు, ‘నువ్వు ఏం చేస్తున్నావు?’ అని నిన్ను అడిగారు కదా. 10  వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ సందేశం యెరూషలేములో ఉన్న ప్రధానుడికి,+ నగరంలో ఉన్న ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ సంబంధించినది.” ’ 11  “ఇలా చెప్పు, ‘నేను మీకు సూచనగా ఉన్నాను.+ నేను ఏం చేశానో అదే వాళ్లకు జరుగుతుంది. వాళ్లు బందీలుగా చెరలోకి వెళ్తారు.+ 12  వాళ్ల మధ్య ఉన్న ప్రధానుడు తన వస్తువుల్ని భుజం మీద పెట్టుకుని చీకట్లో బయల్దేరతాడు. అతను గోడకు ఒక కన్నం చేసి దాని గుండా తన వస్తువుల్ని తీసుకెళ్తాడు.+ నేల కనబడకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.’ 13  నేను అతని మీదికి నా వల విసురుతాను, అతను దానిలో చిక్కుకుంటాడు.+ తర్వాత నేను అతన్ని బబులోనుకు అంటే కల్దీయుల దేశానికి తీసుకెళ్తాను, కానీ అతను ఆ దేశాన్ని చూడడు; అక్కడే అతను చనిపోతాడు.+ 14  అతని చుట్టూ ఉండేవాళ్లను అంటే అతని సహాయకుల్ని, అతని సైన్యాల్ని అన్ని దిక్కులకు చెదరగొడతాను;+ కత్తి తీసి వాళ్లను తరుముతాను.+ 15  నేను వాళ్లను జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొట్టినప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 16  అయితే వాళ్లలో కొంతమంది ఖడ్గాన్ని, కరువును, తెగులును తప్పించుకునేలా చేస్తాను; వాళ్లు తమ అసహ్యమైన పనులన్నిటి గురించి తాము వెళ్లే జనాలకు చెప్పడానికి అలా చేస్తాను; అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.” 17  తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18  “మానవ కుమారుడా, నువ్వు భయంతో వణికిపోతూ నీ రొట్టె తినాలి; కంగారుతో, ఆందోళనతో నీ నీళ్లు తాగాలి.+ 19  దేశ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేము నివాసులతో సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “వాళ్లు ఆందోళనతో తమ రొట్టె తింటారు, భయంభయంగా తమ నీళ్లు తాగుతారు; ఎందుకంటే దేశంలో నివసిస్తున్న వాళ్లందరి దౌర్జన్యం కారణంగా+ దేశం పూర్తిగా నిర్జనమౌతుంది.+ 20  ప్రజలు నివసించే నగరాలు నాశనమౌతాయి, దేశం పాడుబడ్డ భూమిలా తయారౌతుంది;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’ ”+ 21  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 22  “మానవ కుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, కానీ ఏ దర్శనం నెరవేరట్లేదు’ అని ఇశ్రాయేలులో సామెత చెప్పుకుంటున్నారేంటి?+ 23  కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇక ఇశ్రాయేలులో ఎవరూ ఈ సామెతను చెప్పుకోకుండా నేను దాన్ని తీసేస్తాను.” ’ అయితే వాళ్లతో ఇలా చెప్పు: ‘రోజులు దగ్గరపడ్డాయి,+ ప్రతీ దర్శనం నెరవేరుతుంది.’ 24  ఎందుకంటే ఇక నుండి ఇశ్రాయేలు ప్రజల్లో అబద్ధ దర్శనాలు గానీ, సోదె చెప్పేవాళ్ల మోసపు మాటలు గానీ ఉండవు.+ 25  ‘ “ఎందుకంటే, యెహోవానైన నేను మాట్లాడతాను. నేను చెప్పే ప్రతీ మాట ఏమాత్రం ఆలస్యం లేకుండా నెరవేరుతుంది.+ తిరుగుబాటు చేసే ప్రజలారా, మీ రోజుల్లో+ నేను ఒక మాట చెప్పి దాన్ని నెరవేరుస్తాను” అని సర్వోన్నత ​ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.’ ” 26  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 27  “మానవ ​కుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు,* ‘అతను చూసే దర్శనం ఎప్పటికో నెరవేరుతుంది, అతను ​చాలాకాలం తర్వాత జరిగే విషయాల గురించి ప్రవచిస్తున్నాడు’ అని చెప్పుకుంటున్నారు.+ 28  కాబట్టి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పే ప్రతీది జరుగుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటు​న్నాడు.” ’ ”

అధస్సూచీలు

అక్ష., “ఇంటివాళ్లు.”