యెహెజ్కేలు 1:1-28

 • యెహెజ్కేలు బబులోనులో దేవుని దర్శనాలు చూడడం (1-3)

 • యెహోవా పరలోక రథ దర్శనం (4-28)

  • భయంకరమైన గాలి, మేఘం, అగ్ని (4)

  • నాలుగు జీవులు (5-14)

  • నాలుగు చక్రాలు (15-21)

  • మంచులాంటి తళతళలాడే విశాలం (22-24)

  • యెహోవా సింహాసనం (25-28)

1  30వ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున, నేను చెరలో ఉన్న ప్రజల+ మధ్య కెబారు నది పక్కన+ ఉన్నప్పుడు ఆకాశం తెరుచుకుంది, నేను దేవుని దర్శనాలు చూశాను.  ఆ నెల ఐదో రోజున (అంటే, యెహోయాకీను రాజు+ చెరలోకి వెళ్లిన ఐదో సంవత్సరంలో)  యెహోవా వాక్యం యాజకుడైన బూజీ కుమారుడు యెహెజ్కేలు* దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో అతను కల్దీయుల+ దేశంలోని కెబారు నది పక్కన ఉన్నాడు. అక్కడ యెహోవా చెయ్యి అతని మీదికి వచ్చింది.+  నేను చూస్తుండగా, ఉత్తరం వైపు నుండి భయంకరమైన గాలి+ వీచింది; ఒక పెద్ద మేఘం, అగ్నిమయమైన మెరుపులు+ కనిపించాయి, ఆ మేఘం చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఆవరించి ఉంది. ఆ అగ్ని మధ్యలో మెరుస్తున్న లోహం* లాంటిది ఒకటి కనిపించింది.+  దానిలో నాలుగు జీవుల లాంటివి కనిపించాయి,+ వాటిలో ప్రతీదాని రూపం మనిషి రూపంలా ఉంది.  ప్రతీదానికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.+  వాటి పాదాలు నిలువుగా ఉన్నాయి, వాటి అరికాళ్లు దూడ అరికాళ్లలా ఉన్నాయి, అవి మెరుగుపెట్టిన రాగిలా మెరుస్తున్నాయి.+  వాటి నాలుగు పక్కల్లో, రెక్కల కింద మనిషి చేతులు ఉన్నాయి; ఆ నాలుగిటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి.  వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతున్నాయి. ప్రతీది పక్కకు తిరగకుండా తిన్నగా ముందుకు సాగుతోంది.+ 10  వాటి ముఖాలు ఇలా ఉన్నాయి: ఆ నాలుగిటిలో ప్రతీదానికి మనిషి ముఖం, దాని కుడి​వైపున సింహం+ ముఖం, ఎడమవై​పున ఎద్దు+ ముఖం ఉన్నాయి; ఆ నాలుగిటిలో ప్రతీదానికి గద్ద+ ముఖం కూడా ఉంది.+ 11  వాటి ముఖాలు అలా ఉన్నాయి. వాటి రెక్కలు వాటికి పైగా చాపివున్నాయి. ప్రతీదాని రెక్కల్లో రెండు ఒకదానికొకటి తాకుతున్నాయి; మరో రెండు రెక్కలు వాటి శరీరాల్ని కప్పుతున్నాయి.+ 12  వాటిలో ప్రతీది తిన్నగా ముందుకు సాగుతోంది, పవిత్రశక్తి* ఎటు నడిపిస్తే అవి అటు వెళ్తున్నాయి.+ వెళ్లేటప్పుడు అవి పక్కకు తిరగవు. 13  ఆ జీవుల రూపం మండుతున్న నిప్పుల్లా ఉంది, ఆ జీవుల మధ్య దివిటీల లాంటివి అటూఇటూ కదులుతూ ఉన్నాయి, ఆ దివిటీల అగ్ని ప్రకాశవంతంగా ఉంది, ఆ అగ్నిలో నుండి మెరుపులు వస్తున్నాయి.+ 14  ఆ జీవులు అటూఇటూ వెళ్తున్నప్పుడు వాటి కదలికలు మెరుపు తీగల్లా ఉన్నాయి. 15  నేను ఆ జీవుల్ని చూస్తుండగా, నాలుగు ముఖాలున్న ఆ జీవుల్లో ప్రతీదాని పక్కన భూమ్మీద ఒక చక్రం కనిపించింది.+ 16  ఆ చక్రాలు, వాటి ఆకారం లేతపచ్చ రాయిలా మెరుస్తున్నట్టు కనిపించింది, చూడడానికి ఆ నాలుగూ ఒకేలా ఉన్నాయి. వాటి ఆకారం, నిర్మాణం ఒక చక్రంలో ఇంకో చక్రం ఉన్నట్టు కనిపించింది.* 17  అవి కదిలేటప్పుడు, పక్కకు తిరగకుండానే నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్లగలవు. 18  ఆ చక్రాలు సంభ్రమాశ్చ​ర్యాలు పుట్టించేంత ఎత్తుగా ఉన్నాయి, ఆ నాలుగు చక్రాల బయటి అంచుల చుట్టూ అంతటా కళ్లు ఉన్నాయి.+ 19  ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితోపాటు ఆ చక్రాలు కూడా కదిలేవి, ఆ జీవులు భూమ్మీద నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా పైకి లేచేవి.+ 20  పవిత్రశక్తి వాటిని ఎక్కడికి నడిపిస్తుందో, అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అవి అక్కడికి వెళ్తాయి. ఆ జీవులు పైకి లేచిన ప్రతీసారి, వాటితోపాటు ఆ చక్రాలు కూడా పైకి లేచేవి, ఎందుకంటే వాటిమీద పని​చేసే ​పవిత్రశక్తే ఆ చక్రాల్లో కూడా ఉంది. 21  అవి కదిలినప్పుడు ఇవి కూడా కదిలేవి; అవి కదలకుండా ఉన్న​ప్పుడు ఇవి కూడా కదలకుండా ఉండేవి; అవి భూమ్మీద నుండి పైకి లేచినప్పుడు, వాటితోపాటు ఆ చక్రాలు కూడా పైకి లేచేవి, ఎందుకంటే ఆ జీవుల మీద పనిచేసే ​పవిత్రశక్తే ఆ చక్రాల్లో కూడా ఉంది. 22  ఆ జీవుల తలల పైన, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే మంచులాంటి తళతళలాడే విశాలం ఒకటి కనిపించింది, అది వాటి తలలకు పైగా వ్యాపించివుంది.+ 23  ఆ విశాలం కింద వాటి రెక్కలు ఒకదానికొకటి నిటారుగా ఉన్నాయి.* ప్రతీ జీవి రెండు రెక్కలతో తన శరీరం ఒక వైపును, రెండు రెక్కలతో మరో వైపును కప్పుకునివుంది. 24  నేను వాటి రెక్కల చప్పుడు విన్నాను, అది జలప్రవాహాల శబ్దంలా, సర్వశక్తిమంతుని స్వరంలా ఉంది.+ అవి కదిలినప్పుడు ఆ శబ్దం సైన్యం శబ్దంలా ఉంది. అవి కదలకుండా ఉన్నప్పుడు, తమ రెక్కల్ని దించుతాయి. 25  వాటి తలల పైన ఉన్న విశాలం మీద ఒక స్వరం వినిపించింది. (అవి కదలకుండా ఉన్నప్పుడు, తమ రెక్కల్ని దించుతాయి.) 26  వాటి తలల పైన ఉన్న విశాలం మీద నీలం రాయి లాంటిది ఒకటి కనిపించింది,+ అది సింహాసనంలా ఉంది.+ ఆ సింహాసనం మీద ఒకాయన కూర్చుని ఉన్నాడు, ఆయన రూపం మనిషి రూపంలా ఉంది.+ 27  ఆయన నడుము నుండి పైవరకు, చుట్టూ అగ్ని ఉన్న మెరిసే లోహంలా* నాకు కనిపించాడు;+ నడుము నుండి కింది వరకు ఆయన అగ్నిలా కనిపించాడు.+ ఆయన చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది, 28  అది వర్షం పడే రోజున మేఘంలో కనిపించే ఇంద్రధనుస్సు కాంతిలా ఉంది.+ ఆయన చుట్టూ ఉన్న ప్రకాశవంతమైన కాంతి అలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది.+ అది చూసినప్పుడు నేను సాష్టాంగపడ్డాను, మాట్లాడుతున్న ఒక వ్యక్తి స్వరం నాకు వినిపించింది.

అధస్సూచీలు

“దేవుడు బలపరుస్తాడు” అని అర్థం.
వెండిబంగారాల మిశ్రమ లోహం.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
ఒకే అక్షం మీద 90 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి జతచేయబడి ఉండవచ్చు.
లేదా “నిటారుగా చాపబడివున్నాయి” అయ్యుంటుంది.
వెండిబంగారాల మిశ్రమ లోహం.