యెషయా 7:1-25

  • ఆహాజు రాజుకు సందేశం (1-9)

    • షెయార్యాషూబు (3)

  • ఇమ్మానుయేలు గురించిన సూచన (10-17)

  • విశ్వాసఘాతుక ప్రవర్తన పర్యవసానాలు (18-25)

7  ఉజ్జియా మనవడూ యోతాము కుమారుడూ అయిన ఆహాజు+ యూదాను పరిపాలిస్తున్న రోజుల్లో, సిరియా రాజైన రెజీను, అలాగే ఇశ్రాయేలు రాజూ రెమల్యా కుమారుడూ అయిన పెకహు+ యెరూషలేము మీద యుద్ధానికి వచ్చారు. కానీ అతను* దాన్ని జయించలేకపోయాడు.+  “సిరియా ఎఫ్రాయిముతో* చేతులు కలిపింది” అని దావీదు ఇంటివాళ్లకు కబురు అందింది. దాంతో ఆహాజు, అతని ప్రజలు భయపడిపోయారు. అడవిలోని చెట్లు గాలికి ఊగినట్టు వాళ్ల గుండెలు వణికిపోయాయి.  అప్పుడు యెహోవా యెషయాకు ఇలా చెప్పాడు: “దయచేసి నువ్వూ, నీ కుమారుడు షెయార్యాషూబు*+ వెళ్లి, చాకలివాడి పొలానికి వెళ్లే రహదారి పక్కనున్న పైకొలను కాలువ+ కొన దగ్గర ఆహాజును కలుసుకోండి.  నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘నువ్వు ప్రశాంతంగా ఉండు. సిరియా రాజు రెజీను, రెమల్యా కుమారుడు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న రెండు మండుతున్న మొద్దులు మాత్రమే. వాళ్ల మండే కోపాన్ని చూసి భయపడకు, నీ గుండె జారిపోనివ్వకు.+  సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కుమారుడు కలిసి నీకు హాని చేయడానికి కుట్రపన్నారు. వాళ్లు ఇలా అనుకున్నారు:  “మనం యూదా మీదికి వెళ్లి దాన్ని చీల్చేసి,* దాన్ని స్వాధీనం చేసుకొని,* టాబెయేలు కుమారుణ్ణి దానిమీద రాజుగా నియమిద్దాం.”+  “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “వాళ్ల ఆలోచన సఫలం కాదు,అలా జరగనే జరగదు.   సిరియా రాజధాని దమస్కు,దమస్కు రాజు రెజీను. కేవలం 65 ఏళ్లలోఎఫ్రాయిము పూర్తిగా పగలగొట్టబడుతుంది, అది ఇక జనంగా ఉండదు.+   ఎఫ్రాయిము రాజధాని సమరయ,+సమరయ రాజు రెమల్యా కుమారుడు.+ నీకు బలమైన విశ్వాసం లేకపోతే,నువ్వు దృఢంగా స్థాపించబడవు.” ’ ” 10  యెహోవా ఆహాజుతో ఇంకా ఇలా అన్నాడు: 11  “నీ దేవుడైన యెహోవా నుండి ఒక సూచన అడుగు;+ అది సమాధి* అంత లోతైనదైనా సరే, ఆకాశం అంత ఎత్తైనదైనా సరే.” 12  కానీ ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు. 13  అప్పుడు యెషయా ఇలా అన్నాడు: “దావీదు ఇంటివాళ్లారా, దయచేసి వినండి. మీరు మనుషుల ఓపికను పరీక్షిస్తున్నారు, అది చాలదా? దేవుని ఓపికను కూడా పరీక్షించాలా?+ 14  కాబట్టి యెహోవాయే మీకొక సూచన ఇస్తాడు: ఇదిగో! యువతి* గర్భవతి అయ్యి, కుమారుణ్ణి కని,+ ఆయనకు ఇమ్మానుయేలు* అని పేరు పెడుతుంది.+ 15  చెడును తిరస్కరించి మంచిని ఎంచుకోవడం ఎలాగో ఆయనకు తెలిసే సమయంకల్లా ఆయన వెన్నను, తేనెను తినడం మొదలుపెడతాడు. 16  చెడును తిరస్కరించి మంచిని ఎంచుకోవడం ఎలాగో ఆ పిల్లవాడికి తెలిసేలోపే, నువ్వు భయపడుతున్న ఆ ఇద్దరు రాజుల దేశం పూర్తిగా విడిచిపెట్టబడుతుంది.+ 17  యెహోవా నీ మీదికి, నీ ప్రజల మీదికి, నీ తండ్రి ఇంటివాళ్ల మీదికి ఒక కష్టకాలాన్ని తీసుకొస్తాడు; అది ఎలాంటి కష్టకాలం అంటే, ఎఫ్రాయిము యూదా నుండి విడిపోయిన రోజు+ నుండి ఇప్పటివరకు అలాంటిది రాలేదు. ఎందుకంటే ఆయన అష్షూరు రాజును రప్పిస్తాడు.+ 18  “ఆ రోజు యెహోవా సుదూరాన ఉన్న ఐగుప్తు* నైలు కాలువల నుండి ఈగల్ని, అష్షూరు దేశంలోని కందిరీగల్ని ఈల వేసి పిలుస్తాడు. 19  అవన్నీ వచ్చి లోతైన లోయల్లో,* బండల సందుల్లో, ముళ్లపొదలన్నిటి మీద, నీటి మడుగులన్నిటి మీద వాలతాయి. 20  “యెహోవా ఆ రోజు నదీ* ప్రాంతం నుండి కిరాయికి తెచ్చిన మంగలికత్తితో, అంటే అష్షూరు రాజు+ ద్వారా తలవెంట్రుకల్ని, కాళ్ల మీది వెంట్రుకల్ని గొరిగేస్తాడు. అది గడ్డాన్ని కూడా గీసేస్తుంది. 21  “ఆ రోజు ఒక వ్యక్తి తన పశువుల్లో నుండి చిన్న ఆవును,* రెండు గొర్రెల్ని సజీవంగా ఉంచుతాడు. 22  పాలు సమృద్ధిగా ఉండడం వల్ల అతను వెన్న తింటాడు; దేశంలో మిగిలివున్న ప్రతీ ఒక్కరు వెన్నను, తేనెను తింటారు. 23  “ఒకప్పుడు 1,000 వెండి రూకల విలువచేసే 1,000 ద్రాక్షతీగలు ఉన్న ప్రతీచోట ఆ రోజు ముళ్లపొదలు, కలుపు మొక్కలు మాత్రమే ఉంటాయి. 24  దేశం ముళ్లపొదలతో, కలుపు మొక్కలతో నిండి ఉండడం వల్ల మనుషులు విల్లును, బాణాల్ని తీసుకొని అక్కడికి వెళ్తారు. 25  ఒకప్పుడు పారతో కలుపు మొక్కలు తీసేసిన పర్వతాల దగ్గర ముళ్లపొదలు, కలుపు మొక్కలు పెరుగుతాయి; వాటికి భయపడి మీరు వాటి దగ్గరికి కూడా వెళ్లరు; అవి ఎద్దులకు, గొర్రెలకు మేత స్థలంగా తయారౌతాయి.”

అధస్సూచీలు

లేదా “వాళ్లు” అయ్యుంటుంది.
అంటే, ఇశ్రాయేలుతో.
“శేషం మాత్రమే తిరిగొస్తుంది” అని అర్థం.
లేదా “భయపెడదాం” అయ్యుంటుంది.
లేదా “దాని గోడల్లో సందు చేసుకొని.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
సెప్టువజింటులో “కన్య.”
“దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.
లేదా “ఈజిప్టు.”
లేదా “వాగుల్లో.”
అంటే, యూఫ్రటీసు.
లేదా “పెయ్యను.”