యెషయా 38:1-22

  • హిజ్కియా అనారోగ్యం, బాగవ్వడం (1-22)

    • కృతజ్ఞతా పాట (10-20)

38  ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉన్నాడు.+ అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా+ ప్రవక్త వచ్చి అతనితో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు ఈ జబ్బు నుండి కోలుకోవు, నువ్వు చనిపోతావు. కాబట్టి నీ ఇంటివాళ్లకు అవసరమైన నిర్దేశాలివ్వు.’ ”+ 2  దాంతో హిజ్కియా గోడవైపు ముఖం తిప్పుకొని యెహోవాకు ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు: 3  “యెహోవా, నిన్ను బ్రతిమాలుతున్నాను. నేను సంపూర్ణ హృదయంతో నీ ముందు ఎలా నమ్మకంగా నడుచుకున్నానో+ దయచేసి గుర్తుచేసుకో;+ నీ దృష్టిలో ఏది మంచిదో అదే నేను చేశాను.” తర్వాత హిజ్కియా విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు. 4  అప్పుడు యెహోవా వాక్యం యెషయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 5  “నువ్వు వెనక్కి వెళ్లి హిజ్కియాతో ఇలా చెప్పు,+ ‘నీ పూర్వీకుడైన దావీదు దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నీ ప్రార్థన విన్నాను.+ నీ కన్నీళ్లు చూశాను.+ ఇదిగో, నేను నీ ఆయుష్షును ఇంకో 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను;+ 6  అంతేకాదు నిన్నూ, ఈ నగరాన్నీ అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను, ఈ నగరాన్ని కాపాడతాను.+ 7  యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తాడని నీకు చూపించడానికి యెహోవా ఈ సూచన ఇచ్చాడు:+ 8  ఇదిగో, ఆహాజు మెట్ల* మీద దిగిపోతున్న నీడను నేను పది మెట్లు వెనక్కి వెళ్లేలా చేస్తాను.” ’ ”+ దాంతో, అప్పటికే కిందికి దిగిన సూర్యుడి నీడ పది మెట్లు వెనక్కి వెళ్లింది. 9  యూదా రాజైన హిజ్కియా జబ్బుపడి కోలుకున్న సమయంలో రాసిన* మాటలు. 10  నేను ఇలా అనుకున్నాను: “నా ఆయుష్షు తీరకుండానేనేను సమాధి* ద్వారాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. నాకు మిగిలిన ఆయుష్షు నా నుండి లాగివేయబడుతుంది.” 11  నేను ఇలా అనుకున్నాను: “నేను యెహోవాను* చూడలేను, సజీవుల దేశంలో యెహోవాను* చూడలేను.+ జీవంలేని చోట* నివసించేవాళ్లతో నేను ఉన్నప్పుడునేనిక మనుషుల్ని చూడలేను. 12  గొర్రెల కాపరి డేరా లాగివేయబడినట్టునా సొంత నివాసం నా దగ్గర నుండి లాగివేయబడి తీసేయబడింది.+ మగ్గం పనివాడిలా నేను నా జీవితాన్ని చుట్టేశాను;వస్త్రపు నిలువు పోగుల్ని కత్తిరించినట్టు ఆయన నన్ను కత్తిరించేస్తాడు. ఉదయం నుండి రాత్రివరకు నువ్వు నన్ను చావుకు దగ్గర చేస్తూ ఉన్నావు.+ 13  తెల్లారేవరకు నన్ను నేను సముదాయించుకుంటున్నాను. సింహంలా ఆయన నా ఎముకలన్నీ విరగ్గొడుతూ ఉన్నాడు;ఉదయం నుండి రాత్రివరకు నువ్వు నన్ను చావుకు దగ్గర చేస్తూ ఉన్నావు.+ 14  మంగలకత్తి పిట్టలా, మైనా పిట్టలా* నేను కిచకిచలాడుతూ ఉన్నాను;+పావురంలా మూల్గుతూ ఉన్నాను.+ నా కళ్లు నీరసంగా పైకి చూస్తున్నాయి:+ ‘యెహోవా, నేను పెద్ద ఆపదలో ఉన్నాను;నన్ను ఆదుకో!’*+ 15  నేను ఏమని చెప్పను? ఆయన నాతో మాట్లాడాడు, చర్య తీసుకున్నాడు. నాకు వచ్చిన ఘోరమైన కష్టాన్ని బట్టినా జీవితకాలమంతా నేను వినయంగా* నడుచుకుంటాను. 16  ‘యెహోవా, వీటి* వల్ల ప్రతీ మనిషి బ్రతుకుతాడు,వాటిలోనే నా జీవశక్తి* ఉంది. నువ్వు మళ్లీ నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి, నన్ను ప్రాణాలతో ఉంచుతావు.+ 17  ఇదిగో! నెమ్మదితో కాకుండా తీవ్రమైన వేదనతో నేను నిండిపోయాను;నా ప్రాణం మీద నీకున్న ఇష్టం వల్ల,నాశనమనే గోతిలోకి వెళ్లకుండా నన్ను కాపాడావు.+ నా పాపాలన్నిటినీ నీ వెనక పారేశావు.*+ 18  ఎందుకంటే సమాధి* నిన్ను మహిమపర్చలేదు,+మరణం నిన్ను స్తుతించలేదు.+ గోతిలోకి దిగిపోయేవాళ్లు నీ నమ్మకత్వం మీద ఆశపెట్టుకోలేరు.+ 19  బ్రతికున్నవాళ్లు, అవును బ్రతికున్నవాళ్లేఈ రోజు నేను చేస్తున్నట్టుగా నిన్ను స్తుతించగలరు. నీ నమ్మకత్వం గురించి తండ్రులు తమ కుమారులకు వివరించగలరు.+ 20  యెహోవా, నన్ను రక్షించు;అప్పుడు మేము జీవించినంత కాలం యెహోవా మందిరంలో+తంతివాద్యాలతో నా పాటల్ని వాయిస్తాం.’ ”+ 21  అప్పుడు యెషయా, “ఎండు అంజూర పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టండి, అప్పుడతను బాగౌతాడు” అని చెప్పాడు.+ 22  అంతకుముందు హిజ్కియా, “నేను యెహోవా మందిరానికి వెళ్తాను అనడానికి సూచన ఏంటి?” అని యెషయాను అడిగాడు.+

అధస్సూచీలు

బహుశా నీడ గడియారంలోలా ఈ మెట్లను సమయాన్ని కొలవడానికి ఉపయోగించి ఉండవచ్చు.
లేదా “కూర్చిన.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “అంతా ఆగిపోయే చోట.”
లేదా “కొంగలా” అయ్యుంటుంది.
అక్ష., “నాకు జామీనుగా ఉండు.”
లేదా “నిష్ఠగా.”
అంటే, దేవుని మాటలు, పనులు.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “నా పాపాలన్నిటినీ నీ కళ్లముందు నుండి తొలగించేశావు.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.