యెషయా 3:1-26
3 ఇదిగో! నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాయెరూషలేము నుండి, యూదా నుండి ప్రతీ విధమైన ఆధారాన్ని, సరఫరాను తీసేస్తున్నాడు;అంటే ఆహారాన్ని, నీళ్లను,+
2 బలవంతుణ్ణి, యోధుణ్ణి,న్యాయమూర్తిని, ప్రవక్తను;+ సోదె చెప్పేవాణ్ణి, పెద్దను,
3 50 మంది మీద ఉన్న ప్రధానుణ్ణి,+ ఉన్నతాధికారిని, సలహాదారుణ్ణి,ఇంద్రజాలంలో ఆరితేరినవాణ్ణి, నైపుణ్యంగల మాంత్రికుణ్ణి*+ తీసేస్తున్నాడు.
4 నేను బాలల్ని వాళ్లకు అధికారులుగా చేస్తాను,నిలకడలేనివాడు వాళ్లను పరిపాలిస్తాడు.
5 ప్రజలు ఒకరినొకరు అణచివేసుకుంటారు,ప్రతీ వ్యక్తి తన తోటివాణ్ణి అణచివేస్తాడు.+
బాలుడు వృద్ధుడి మీదికి లేస్తాడు,నీచుడు గౌరవనీయుణ్ణి తిరస్కరిస్తాడు.+
6 ప్రతీ వ్యక్తి తన తండ్రి ఇంట్లో తన సహోదరుణ్ణి పట్టుకొని,
“నీ దగ్గర అంగీ ఉంది కాబట్టి నువ్వు మాకు అధిపతిగా ఉండు.
ఈ శిథిలాల కుప్ప మీద అధికారం చెలాయించు” అంటాడు.
7 కానీ ఆ రోజున అతను ఒప్పుకోకుండా,
“నేను మీ గాయాలకు కట్టుకట్టేవాడిగా* ఉండను;నా ఇంట్లో ఆహారం గానీ, బట్టలు గానీ లేవు.
నన్ను ప్రజలకు అధిపతిగా చేయొద్దు” అంటాడు.
8 ఎందుకంటే యెరూషలేము తడబడింది,యూదా పడిపోయింది,వాళ్ల మాటలు, పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల అలా జరిగింది;ఆయన మహిమాన్విత సన్నిధి* ముందు వాళ్లు తిరుగుబాటు చేస్తున్నారు.+
9 వాళ్ల ముఖకవళికలు వాళ్లమీద సాక్ష్యం చెప్తున్నాయి,వాళ్లు సొదొమలా తమ పాపాన్ని చాటుకుంటున్నారు;+దాన్ని దాచడానికి ప్రయత్నించడం లేదు.
వాళ్లకు శ్రమ! ఎందుకంటే వాళ్లు తమ మీదికి తామే విపత్తును తెచ్చుకుంటున్నారు.
10 నీతిమంతులకు మంచి జరుగుతుందని చెప్పండి;వాళ్లు తమ పనులకు ప్రతిఫలం పొందుతారు.+
11 దుష్టుడికి శ్రమ!
అతని మీదికి విపత్తు వస్తుంది,అతను ఇతరులకు చేసినట్టే వాళ్లు అతనికి చేస్తారు!
12 నా ప్రజల విషయానికొస్తే,వాళ్లతో పనులు చేయించేవాళ్లు కఠినులు,
స్త్రీలు వాళ్లను పరిపాలిస్తున్నారు.నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని దారితప్పి తిరిగేలా చేస్తున్నారు,
వాళ్లు మీ త్రోవల్ని తారుమారు చేస్తున్నారు.+
13 తన వ్యాజ్యాన్ని వినిపించడానికి యెహోవా నిలబడ్డాడు;జనాల మీద తీర్పు ప్రకటించడానికి ఆయన లేచి నిలబడుతున్నాడు.
14 తన ప్రజల పెద్దలకు, అధికారులకు యెహోవా తీర్పు ప్రకటించబోతున్నాడు.
“మీరు ద్రాక్షతోటను కాల్చేశారు,పేదవాళ్ల దగ్గర మీరు దొంగిలించింది మీ ఇళ్లలోనే ఉంది.+
15 నా ప్రజల్ని నలగ్గొట్టడానికి,పేదవాళ్ల ముఖాల్ని నేలకేసి రుద్దడానికి మీకెంత ధైర్యం?”+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.
16 యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోను కూతుళ్లు గర్విష్ఠులు,వాళ్లు తమ తలలు పైకెత్తి,*ఓర చూపులు చూస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తూవయ్యారంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి
17 యెహోవా సీయోను కూతుళ్ల తలల్ని పక్కులతో మొత్తుతాడు,యెహోవా వాళ్ల నుదుటిని బోడి చేస్తాడు.+
18 ఆ రోజు యెహోవా వాళ్ల అలంకారాన్ని తీసేస్తాడు;వాళ్ల కడియాల్ని, బాసికాల్ని, చంద్రవంకల్ని,+
19 చెవిపోగుల్ని,* గాజుల్ని, మేలిముసుగుల్ని,
20 అలంకార కిరీటాల్ని, పట్టీల్ని, ఒడ్డాణాల్ని,*అత్తరు బుడ్డీల్ని, తాయెత్తుల్ని,
21 ఉంగరాల్ని, ముక్కుపోగుల్ని,
22 ఉత్సవ వస్త్రాల్ని, ఉత్తరీయాల్ని,* శాలువల్ని, డబ్బు సంచుల్ని,
23 చేతి అద్దాల్ని,+ నారవస్త్రాల్ని,*తలపాగాల్ని, మేలిముసుగుల్ని తీసేస్తాడు.
24 వాళ్ల ఒంటి నుండి సాంబ్రాణి తైలం+ సువాసనకు బదులు దుర్వాసన వస్తుంది;వాళ్లు దట్టీకి బదులు తాడు కట్టుకుంటారు;అల్లిక జడలు పోయి బోడి తల వస్తుంది;+ఖరీదైన వస్త్రానికి బదులు గోనెపట్ట వేసుకుంటారు;+అందానికి బదులు వాత ఉంటుంది.
25 నీ పురుషులు ఖడ్గానికి బలౌతారు,నీ యోధులు యుద్ధంలో చనిపోతారు.+
26 సీయోను ప్రవేశ ద్వారాలు దుఃఖిస్తాయి, విలపిస్తాయి;+ఆమె అన్నీ పోగొట్టుకొని నేలమీద కూర్చుంటుంది.”+
అధస్సూచీలు
^ లేదా “పాములోడిని.”
^ లేదా “మిమ్మల్ని బాగుచేసేవాడిగా.”
^ లేదా “కళ్ల.”
^ అక్ష., “మెడ (గొంతు) చాచి.”
^ లేదా “లోలాకుల్ని.”
^ లేదా “దట్టీల్ని.”
^ లేదా “పైవస్త్రాల్ని.”
^ లేదా “లోదుస్తుల్ని.”