యెషయా 28:1-29

  • ఎఫ్రాయిము తాగుబోతులకు శ్రమ! (1-6)

  • యూదా యాజకులు, ప్రవక్తలు తూలడం (7-13)

  • “మరణంతో ఒప్పందం” (14-22)

    • సీయోనులో అమూల్యమైన మూలరాయి (16)

    • యెహోవా చేసే అసాధారణమైన పని (21)

  • యెహోవా తెలివైన క్రమశిక్షణ గురించి ఉదాహరణలు (23-29)

28  ఎఫ్రాయిము+ తాగుబోతుల ఆడంబరమైన* కిరీటానికి* శ్రమ!వాడిపోతున్న పువ్వు లాంటి దాని మహిమాన్విత సౌందర్యానికి శ్రమ!అది, ద్రాక్షారసం మత్తులో ఉన్నవాళ్లు నివసించే సారవంతమైన లోయ తలమీద ఉంది.   ఇదిగో! శక్తిమంతుడూ బలవంతుడూ అయిన ఒక వ్యక్తి యెహోవాకు ఉన్నాడు. ఉరిమే వడగండ్ల వానలా, నాశనకరమైన గాలివానలా,శక్తివంతమైన ప్రవాహాలతో కూడిన ఉరుముల తుఫానులాఆయన దాన్ని బలంగా భూమ్మీదికి విసిరేస్తాడు.   ఎఫ్రాయిము తాగుబోతుల ఆడంబరమైన* కిరీటాలుకాళ్ల కింద తొక్కబడతాయి.+   సారవంతమైన లోయ తలమీద ఉన్నవాడిపోతున్న పువ్వు లాంటి దాని మహిమాన్విత సౌందర్యంవేసవికాలం రాకముందే కాసిన తొలి అంజూర పండులా ఉంటుంది. ఎవరైనా దాన్ని చూస్తే, వెంటనే దాన్ని తెంపి మింగేస్తారు.  ఆ రోజు సైన్యాలకు అధిపతైన యెహోవా తన ప్రజల్లో మిగిలినవాళ్లకు+ మహిమాన్విత కిరీటం, అందమైన పూలదండ అవుతాడు.  న్యాయం తీర్చడానికి కూర్చున్నవాళ్లకు న్యాయం గురించిన అవగాహనను, నగర ద్వారం దగ్గర దాడిని ఎదిరించేవాళ్లకు బలాన్ని ఇస్తాడు.+   వీళ్లు కూడా ద్రాక్షారసం వల్ల పక్కదారి పడుతున్నారు;వాళ్ల మత్తుపానీయాలు వాళ్లను తూలేలా చేస్తున్నాయి. మద్యం వల్ల యాజకుడు, ప్రవక్త తప్పుదారి పడుతున్నారు;ద్రాక్షారసం వాళ్లను అయోమయంలో పడేస్తోంది,మద్యం తాగి వాళ్లు తూలుతున్నారు;వాళ్ల దర్శనం వాళ్లను పక్కదారి పట్టిస్తోంది,న్యాయం తీర్చే విషయంలో వాళ్లు తడబడుతున్నారు.+   వాళ్ల బల్లలు అసహ్యమైన వాంతితో నిండిపోయాయి,అది లేని చోటంటూ లేదు.   ఎవరికి జ్ఞానం నేర్పిస్తారు?ఎవరికి సందేశాన్ని వివరిస్తారు? అప్పుడే పాలు మానేసిన వాళ్లకా?అప్పుడే చన్ను విడిచిన వాళ్లకా? 10  ఎందుకంటే అతని మాటలు వాళ్లకు, “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,నియమం వెంట నియమం, నియమం వెంట నియమం,*+కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ” అన్నట్టు ఉన్నాయి. 11  కాబట్టి ఆయన ఈ ప్రజలతో నత్తివాళ్ల ద్వారా మాట్లాడతాడు, విదేశీ భాషలో మాట్లాడతాడు.+ 12  ఆయన ఒకసారి వాళ్లతో ఇలా అన్నాడు: “ఇదే విశ్రాంతి స్థలం. అలసిపోయిన వ్యక్తిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇదే సేదదీరే చోటు.” కానీ వాళ్లు వినలేదు.+ 13  కాబట్టి వాళ్ల విషయంలో యెహోవా మాట ఏమిటంటే: “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,నియమం వెంట నియమం, నియమం వెంట నియమం,*+కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ.” దానివల్ల, వాళ్లు నడుస్తున్నప్పుడుతడబడి, వెనక్కి పడిపోయి,గాయపడి, ఉచ్చులో చిక్కుకొని, పట్టబడతారు.+ 14  కాబట్టి యెరూషలేములోని ఈ ప్రజల పరిపాలకులారా,గొప్పలు చెప్పుకుంటున్న మీరంతా యెహోవా మాట వినండి. 15  మీరు ఇలా చెప్పుకుంటున్నారు: “మేము మరణంతో ఒప్పందం చేసుకున్నాం,+సమాధితో* ఒడంబడిక చేసుకున్నాం.* అకస్మాత్తుగా ప్రచండమైన ప్రవాహం దాటివెళ్లేటప్పుడుఅది మా దాకా రాదు;ఎందుకంటే మేము అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకున్నాం,మోసం కింద దాక్కున్నాం.”+ 16  కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో, నేను పరీక్షించబడిన ఒక రాయిని సీయోనులో పునాదిగా వేస్తాను,+సుస్థిరమైన పునాదికి+ అది అమూల్యమైన మూలరాయి.+ దానిమీద విశ్వాసం చూపించే వాళ్లెవరూ కంగారుపడరు.+ 17  నేను న్యాయాన్ని కొలనూలుగా,+నీతిని లంబసూత్రంగా* చేస్తాను.+ వడగండ్లు అబద్ధాల ఆశ్రయాన్ని తుడిచిపెట్టేస్తాయి,దాక్కునే చోటు నీళ్ల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. 18  మరణంతో మీరు చేసుకున్న ఒప్పందం రద్దౌతుంది,సమాధితో* మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు.+ అకస్మాత్తుగా ప్రచండమైన ప్రవాహం దాటివెళ్లినప్పుడుదానివల్ల మీరు చితికిపోతారు. 19  అది దాటివెళ్లిన ప్రతీసారిమిమ్మల్ని ఊడ్చేస్తుంది;+ఎందుకంటే, ప్రతీ ఉదయం అది దాటివెళ్తుంది,పగలూ రాత్రీ ప్రవహిస్తుంది. విపరీతమైన భయం వల్ల మాత్రమే వాళ్లు తాము విన్నదాన్ని గ్రహిస్తారు.”* 20  చాచుకొని పడుకోవడానికి పరుపు పొడవు సరిపోదు,చుట్టుకొని పడుకోవడానికి దుప్పటి వెడల్పు సరిపోదు. 21  ఎందుకంటే యెహోవా పెరాజీము కొండ మీద లేచినట్టు లేస్తాడు;గిబియోను దగ్గరున్న లోయలో రేపుకున్నట్టు తనను తాను రేపుకుంటాడు,+తన కార్యాన్ని, అంటే తన వింతైన కార్యాన్ని చేయడానికితన పనిని, అంటే అసాధారణమైన తన పనిని నెరవేర్చడానికి+ అలా లేస్తాడు. 22  కాబట్టి మీ కట్లు ఇంకా గట్టిగా బిగించబడకుండా ఉండేలాఅపహాస్యం చేయకండి,+ఎందుకంటే దేశమంతా* సమూలంగా నాశనమవ్వాలని నిర్ణయించబడినట్టు+నేను సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా దగ్గర విన్నాను. 23  నేను చెప్పేది చెవిపెట్టి వినండి;నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. 24  దున్నేవాడు అసలు విత్తనాలే విత్తకుండా రోజంతా దున్నుతూ ఉంటాడా? అస్తమానం నేలను చీలుస్తూ, దాన్ని గుల్ల చేస్తూ ఉంటాడా?+ 25  అతను నేలను చదును చేయగానేనల్ల జీలకర్రను, జీలకర్రను చల్లడా?గోధుమల్ని, సజ్జల్ని, బార్లీ గింజల్ని వాటివాటి స్థలాల్లో నాటడా?అంచుల చుట్టూ పొడుగు గోధుమల్ని*+ వేయడా? 26  ఎందుకంటే దేవుడే అతనికి సరైన మార్గం బోధిస్తాడు;*అతని దేవుడే అతనికి ఉపదేశమిస్తాడు.+ 27  నూర్చే పనిముట్టుతో+ నల్ల జీలకర్రను నూర్చరు,జీలకర్ర మీదికి బండి చక్రాన్ని ఎక్కించరు. బదులుగా నల్ల జీలకర్రను కట్టెతో,జీలకర్రను చువ్వతో దుళ్లగొడతారు. 28  ఒక వ్యక్తి రొట్టె కోసం ధాన్యాన్ని నలగ్గొడతాడా? లేదు, అతను అదేపనిగా దాన్ని నూర్చడు.+అతను తన గుర్రాలతో తన బండి చక్రాన్ని దానిమీద నడిపినప్పుడుఅతను దాన్ని నలగ్గొట్టడు.+ 29  ఇది కూడా సైన్యాలకు అధిపతైన యెహోవా వల్లే కలుగుతుంది,ఆయన ఆలోచన* అద్భుతంగా ఉంటుంది,ఆయన సాధించేవి గొప్పగా ఉంటాయి.*+

అధస్సూచీలు

లేదా “అహంకారంతో నిండిన; గర్వంతో నిండిన.”
రాజధాని సమరయను సూచిస్తుందని తెలుస్తోంది.
లేదా “అహంకారంతో నిండిన; గర్వంతో నిండిన.”
లేదా “కొలనూలు వెంట కొలనూలు, కొలనూలు వెంట కొలనూలు.”
లేదా “కొలనూలు వెంట కొలనూలు, కొలనూలు వెంట కొలనూలు.”
లేదా “షియోల్‌తో,” అంటే మానవజాతి సాధారణ సమాధితో. పదకోశం చూడండి.
లేదా “సమాధితో పాటు దర్శనం చూశాం” అయ్యుంటుంది.
లేదా “మట్టపుగుండుగా.”
లేదా “షియోల్‌తో,” అంటే మానవజాతి సాధారణ సమాధితో. పదకోశం చూడండి.
లేదా “వాళ్లు గ్రహించినప్పుడు విపరీతంగా భయపడతారు” అయ్యుంటుంది.
లేదా “భూమంతా.”
ఇవి ప్రాచీన ఐగుప్తులో పండే తక్కువ రకం గోధుమలు.
లేదా “క్రమశిక్షణ ఇస్తాడు; శిక్షిస్తాడు.”
లేదా “సంకల్పం; ఉద్దేశం.”
లేదా “ఆయన ఆచరణాత్మక తెలివి గొప్పగా ఉంటుంది.”