యెషయా 22:1-25

  • దర్శన లోయ గురించిన సందేశం (1-14)

  • గృహనిర్వాహకుడైన షెబ్నా స్థానంలోకి ఎల్యాకీము రావడం (15-25)

    • సూచనగా ఉన్న మేకు (23-25)

22  దర్శన లోయ* గురించిన సందేశం:+ మీకు ఏమైంది? మీరంతా ఇంటి పైకప్పుల మీదికి ఎందుకు వెళ్లారు?   నువ్వు అల్లరితో నిండివుండే దానివి,కోలాహలం నిండిన నగరానివి, ఉల్లసించే పట్టణానివి. నీలో హతులైనవాళ్లు ఖడ్గం వల్ల హతమవ్వలేదు,వాళ్లు యుద్ధంలో చనిపోలేదు.+   నీ నియంతలంతా కలిసి పారిపోయారు.+ విల్లు అవసరం లేకుండానే వాళ్లను ఖైదీలుగా తీసుకెళ్లారు. దొరికిన వాళ్లందర్నీ ఖైదీలుగా తీసుకెళ్లారు,+చాలాదూరం పారిపోయినా పట్టుకొని తీసుకెళ్లారు.   అందుకే నేనిలా అన్నాను: “మీ దృష్టి నా మీద నుండి పక్కకు తిప్పండి,నేను వెక్కివెక్కి ఏడుస్తాను.+ నా ప్రజల కూతురి* నాశనాన్ని బట్టి నేను బాధపడుతున్నాను,నన్ను ఓదార్చడానికి అదేపనిగా ప్రయత్నించకండి.+   ఎందుకంటే అది దర్శన లోయలోఅయోమయం, ఓటమి, భయాందోళన+ ఉండే రోజు,అది సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నుండి వస్తుంది. ప్రాకారం కూలగొట్టబడుతుంది,+పర్వతం వరకు అరుపు వినిపిస్తుంది.   ఏలాము+ అంబులపొది తీసుకొనిసైనికులున్న రథాలతో, గుర్రాలతో* వస్తోంది;కీరు+ డాలును బయటికి తీస్తుంది.*   నీ శ్రేష్ఠమైన లోయలుయుద్ధ రథాలతో నిండిపోతాయి,నగర ద్వారం దగ్గర గుర్రాలు* వాటివాటి స్థానాల్లో నిలబడతాయి.   యూదా ముసుగు* తీసేయబడుతుంది. “ఆ రోజు నువ్వు అడవి గృహంలోని+ ఆయుధశాల వైపు చూస్తావు.  దావీదు నగర ప్రాకారంలో మీకు చాలా బీటలు కనిపిస్తాయి.+ దిగువ కోనేరులో+ మీరు నీళ్లు నిల్వచేస్తారు. 10  మీరు యెరూషలేములోని ఇళ్లను లెక్కపెడతారు, దాని ప్రాకారాన్ని దృఢపర్చడానికి ఆ ఇళ్లను కూలగొడతారు. 11  పాత కోనేరులోని నీళ్ల కోసం ప్రాకారపు రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని కడతారు, కానీ దాని మహాగొప్ప నిర్మాణకుడి* వైపు మీరు చూడరు; చాలాకాలం ముందు దాన్ని నిర్మించిన దేవుణ్ణి మీరు చూడరు. 12  ఆ రోజు సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాఏడ్వమని, దుఃఖించమని చెప్తాడు,+గుండు గీయించుకోమని, గోనెపట్ట కట్టుకోమని చెప్తాడు. 13  కానీ ప్రజలు సంబరాలు చేసుకుంటూ సంతోషిస్తున్నారు,పశువుల్ని, గొర్రెల్ని వధిస్తున్నారు,మాంసం తింటూ ద్రాక్షారసం తాగుతున్నారు.+ ‘ఎలాగూ రేపు చచ్చిపోతాం కదా, రండి తిందాం, తాగుదాం’+ అని చెప్పుకుంటున్నారు.” 14  అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవా నా చెవుల్లో ఈ విషయాన్ని వెల్లడిచేశాడు: “ ‘మీరు చనిపోయేవరకు, మీరు చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు’+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.” 15  సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా చెప్పేదేమిటంటే: “గృహనిర్వాహకుడిగా, రాజభవనం మీద పర్యవేక్షకుడిగా ఉన్న షెబ్నా+ దగ్గరికి వెళ్లి నువ్విలా చెప్పు: 16  ‘నీకు ఇక్కడ ఏం పనుంది? ఇక్కడ నీకు ఎవరు ఉన్నారని నీ కోసం ఇక్కడ సమాధి తొలిపించుకున్నావు?’ అతను ఎత్తైన స్థలంలో తనకోసం ఒక సమాధి తొలిపించుకుంటున్నాడు; ఒక బండలో తన కోసం విశ్రాంతి స్థలాన్ని* తొలిపించుకుంటున్నాడు. 17  ‘ఓ మనిషీ, ఇదిగో! యెహోవా నిన్ను బలంగా కిందికి విసిరేసి, బలవంతంగా నిన్ను పట్టుకుంటాడు. 18  ఆయన నిన్ను గట్టిగా చుట్టి, బంతిని విసిరేసినట్టు విశాలమైన దేశంలోకి విసిరేస్తాడు. నువ్వు అక్కడే చనిపోతావు, ఘనమైన నీ రథాలు కూడా అక్కడే ఉండిపోతాయి; అది నీ యజమాని ఇంటికి అవమానం. 19  నీ పదవి నుండి నిన్ను దించేస్తాను, నీ ఉద్యోగంలో నుండి నిన్ను తీసిపారేస్తాను. 20  “ ‘ఆ రోజు నేను హిల్కీయా కుమారుడూ నా సేవకుడూ అయిన ఎల్యాకీమును+ పిలుస్తాను, 21  నీ నిలువుటంగీని అతనికి తొడుగుతాను, నీ దట్టీని అతని నడుము చుట్టూ గట్టిగా కడతాను,+ నీ అధికారాన్ని* అతని చేతుల్లో పెడతాను. యెరూషలేము నివాసులకు, యూదా ఇంటివాళ్లకు అతను తండ్రిగా ఉంటాడు. 22  దావీదు ఇంటి తాళంచెవిని+ నేను అతని భుజాల మీద పెడతాను. అతను తెరిస్తే ఎవ్వరూ మూయలేరు; అతను మూస్తే ఎవ్వరూ తెరవలేరు. 23  కదలని చోట మేకును దిగగొట్టినట్టు నేను అతన్ని స్థిరపరుస్తాను; అతని తండ్రి ఇంటికి అతను మహిమగల సింహాసనం అవుతాడు. 24  అతని తండ్రి ఇంటి మహిమ* అంతటినీ, అంటే అతని వంశస్థుల మహిమను, సంతానపు* మహిమను, చిన్న పాత్రలన్నిటి మహిమను, గుండ్రటి గిన్నెల మహిమను, పెద్ద చెంబులన్నిటి మహిమను వాళ్లు అతని మీద వేలాడదీస్తారు. 25  “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజు, కదలని చోట దిగగొట్టబడిన మేకు తీసేయబడుతుంది,+ అది పడిపోయి నాశనమౌతుంది, దానికి తగిలించిన బరువు పడిపోయి నాశనమౌతుంది; ఎందుకంటే యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.’ ”

అధస్సూచీలు

యెరూషలేమును సూచిస్తుందని స్పష్టమౌతోంది.
బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.
లేదా “గుర్రపురౌతులతో.”
లేదా “సిద్ధం చేస్తుంది.”
లేదా “గుర్రపురౌతులు.”
లేదా “రక్షణ.”
లేదా “రూపకర్త.”
అక్ష., “నివాసాన్ని.”
లేదా “ఆధిపత్యాన్ని.”
అక్ష., “బరువు.”
లేదా “చిగుర్ల.”