యెషయా 20:1-6

  • ఐగుప్తుకు, ఇతియోపియాకు వ్యతిరేకంగా ఒక సూచన (1-6)

20  అష్షూరు రాజైన సర్గోను తర్తానును* అష్డోదుకు+ పంపించిన సంవత్సరంలో అతను అష్డోదు మీద యుద్ధం చేసి, దాన్ని చెరపట్టాడు.+  ఆ సమయంలో, యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా+ ద్వారా మాట్లాడుతూ ఇలా చెప్పాడు: “నువ్వు వెళ్లి, నీ నడుం మీదున్న గోనెపట్టను, నీ కాళ్లకున్న చెప్పుల్ని తీసేయి.” కాబట్టి అతను వాటిని తీసేసి బట్టలు లేకుండా,* వట్టికాళ్లతో తిరిగాడు.  తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “నా సేవకుడైన యెషయా ఐగుప్తుకు,+ ఇతియోపియాకు+ సూచనగా,+ హెచ్చరికగా మూడు సంవత్సరాల పాటు బట్టలు లేకుండా, వట్టికాళ్లతో నడిచినట్టే,  అష్షూరు రాజు కూడా చెరపట్టబడిన ఐగుప్తీయుల్ని,+ ఇతియోపియా ఖైదీలను, అంటే వాళ్లలోని అబ్బాయిల్ని, ముసలివాళ్లను బట్టలు లేకుండా, వట్టికాళ్లతో, పిరుదులు కనిపించేలా నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. అవును ఐగుప్తు అవమానాలపాలు అవుతుంది.  వాళ్లు భయపడిపోతారు; తమ నిరీక్షణయైన ఇతియోపియాను బట్టి, తమ గర్వకారణమైన ఐగుప్తును* బట్టి సిగ్గుపడతారు.  ఆ రోజు ఈ సముద్రతీర ప్రాంతంలో నివసించే ప్రజలు ఇలా అనుకుంటారు: ‘మనం ఆశపెట్టుకున్న దానికి ఏమైందో చూడండి! సహాయం కోసం, అష్షూరు రాజు నుండి రక్షణ కోసం మనం దేని దగ్గరికైతే పారిపోయామో దానికి ఏమైందో చూడండి! ఇప్పుడు మనం ఎలా తప్పించుకుంటాం?’ ”

అధస్సూచీలు

లేదా “సైన్యాధికారిని.”
లేదా “చాలీచాలని బట్టలతో.”
లేదా “దేని సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారో ఆ ఐగుప్తును.”